
పర్సంటేజీలు ఇస్తేనే బిల్లులు
► జెడ్పీటీసీ సభ్యులను కూడా వదలని పీఆర్ ఇంజనీర్లు
► జెడీ స్థాయీ సంఘాల సమావేశాల్లో సభ్యుల ఆరోపణ
► వివిధ అంశాలపై వాడీవేడి చర్చ
హన్మకొండ : పంచాయతీరాజ్, మిషన్ కాకతీయలో పర్సంటేజీలు ఇస్తేనే బిల్లులు చెల్లిస్తున్నారని జెడ్పీటీసీ సభ్యులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు జెడ్పీటీసీ సభ్యుల నుంచి కూడా పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ప్రజా పరిషత్ పాలక మండలి సభ్యులు పర్సంటేజీలు చెల్లించాల్సి రావడం దుర్మార్గమని 7వ స్థాయి సంఘానికి అధ్యక్షతన వహించిన లింగాల ఘనపురం జెడ్పీటీసీ సభ్యుడు గంగసాని రంజిత్‌రెడ్డితో పాటు పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక జెడ్పీ స్థాయీ సంఘం సమావేశానికి పీఆర్ ఎస్‌ఈ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం శనివారం జరిగింది. జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ అనారోగ్యం కారణంగా గైర్హాజరు కావడంతో.. రెండో స్థాయీ సంఘం సమావేశాన్ని మంగపేట జెడ్పీటీసీ వైకుంఠం అధ్యక్షతన, నాలుగో సంఘం సమావేశాన్ని నర్సింహులపేట జెడ్పీటీసీ ధర్మారం వేణు అధ్యక్షతన, ఏడో సంఘం సమావేశాన్ని లింగాల ఘనపురం జెడ్పీటీసీ సభ్యుడు గంగసాని రంజిత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా.. సంగెం జెడ్పీటీసీ గుగులోతు వీరమ్మ అధ్యక్షతన జరగాల్సిన 5వ స్థాయి సంఘం సమావేశాన్ని కోరం లేక వాయిదా వేశారు.
అధికారుల తీరు సరికాదు..
మిషన్ కాకతీయ బిల్లులు సైతం పర్సంటేజీలు ఇస్తేనే విడుదల చేస్తున్నారని స్థాయీ సంఘం సమావేశంలో గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు మహమ్మద్ ఖాసీం ఆరోపించారు. ఆయనతో పాటు పలువురు బిల్లుల విషయమై విమర్శలు చేయగా పీఆర్ ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు స్పందించకపోవడం విశేషం. ఇక పనులు లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నా ఉపాధి హామీ పథకం పనులు ఎందుకు కల్పించడం లేదని, పనుల వివరాలకు తమకు చెప్పాలని గణపురం జెడ్పీటీసీ సభ్యుడు మోటపోతుల శివశంకర్ సూచించారు. దీనికి డ్వామా ఏపీడీ శ్రీనివాస్ స్పందిస్తూ మాట్లాడుతూ పనుల వివరాలు తెలియజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందని అధికారులు చెపుతున్న అంశంలో వాస్తవం లేదని ఖాసిం అన్నారు.
జనగామలో దుర్గమ్మ గుడి ప్రాంతంలోని నాగుల చెరువు ఆక్రమణ జరిగిందని, చెరువులో అక్రమంగా నిర్మించిన గోడను కూల్చాలని లింగాలగణపురం జెడ్పీటీసీ సభ్యుడు రంజిత్ నీటిపారుదల శాఖ అధికారులను డిమాండ్ చేశారు. కాగా, జెడ్పీ వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ అధ్యక్షతన మూడో స్థాయీ సంఘం సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన,పట్టు పరిశ్రమ, మత్స్యశాఖలపై, పర్వతగిరి జెడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజ అధ్యక్షతన జరిగిన ఆరో స్థాయీ సంఘం సమావేశంలో సాంఘక సంక్షేమ శాఖపై, నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యుడు ధర్మారం వేణు అధ్యక్షతన జరిగిన మరో సమావేశంలో విద్య, వైద్య శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ విజయ్‌భాస్కర్‌రావు, జేడీఏ బి.గంగారాం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.