సెర్ప్, ‘ఉపాధి’ ఉద్యోగుల వేతనాలు పెంపు | CM KCR hikes Serp guarantee employment salary | Sakshi
Sakshi News home page

సెర్ప్, ‘ఉపాధి’ ఉద్యోగుల వేతనాలు పెంపు

Published Wed, Aug 3 2016 2:57 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

సెర్ప్, ‘ఉపాధి’ ఉద్యోగుల వేతనాలు పెంపు - Sakshi

సెర్ప్, ‘ఉపాధి’ ఉద్యోగుల వేతనాలు పెంపు

పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం
ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం (సెర్ప్), ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపునకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు వేతనాల పెంపు కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సమర్పించిన ప్రతిపాదనలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సెర్ప్ సీఈవో పౌసమిబసుతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమీక్షించారు. అనంతరం ఏమేరకు వేతనాలను పెంచాలనే దానిపై అధికారులకు ఆదేశాలిచ్చారు.

సెర్ప్‌లో మొత్తం 4,174 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 767 మంది మండల సమాఖ్య క్లస్టర్ కో-ఆర్డినేటర్లుగా పనిచేస్తున్నారు. వారి వేతనాన్ని ప్రస్తుతమున్న రూ.6,150 నుంచి రూ.12 వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు. మిగతా ఉద్యోగులకు 30 శాతం పెంచాలని సూచించారు. ఇక ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 6,900 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రస్తుతమున్న రూ.6,290 వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని... మిగతా ఉద్యోగులకు 20 శాతం మేర పెంచాలని సూచించారు. ఈ వేతనాల పెంపునకు సంబంధించి వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీచేయాలని మంత్రి జూపల్లికి సూచించారు.

 కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం
సెర్ప్, ఉపాధి హామీ ఉద్యోగుల వేతనాల పెంపుపై కొందరు ఉద్యోగులు హర్షం ప్రకటిస్తుండగా, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.6 వేల వేతనంతో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండింతలు పెంచి.. తమకు 20 శాతమే పెంచడం ఎంతవరకు సమంజసమని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ ఉద్యోగులతో సమానంగా 30 శాతం వేతనాలు పెంచినా బాగుండేదని పేర్కొంటున్నారు. ఇక 50 శాతం దాకా వేతనాలు పెరుగుతాయని ఆశించిన సెర్ప్ ఉద్యోగులు సైతం తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement