డబ్బులు ఇవ్వకుండా బీపీఎం వేధిస్తున్నాడు
► ఆగ్రహించిన ఉపాధిహామీ కూలీలు
► పోస్టాఫీసు ఎదుట ఆందోళన
కామారెడ్డి రూరల్(కామారెడ్డి): రెక్కలు ముక్కలు చేసుకుని ఉపాధి కూలికి వెళ్తే తమకు సరైన గిట్టుబాటు రేటు వస్తుందని ఆశించిన ఉపాధిహామీ కూలీలకు చెదు అనుభవం ఎదురైంది. ఉపాధిహామీ పథకం కింద పనిచేసి నెలలు గడుస్తున్నా తమకు కూలి డబ్బులు సక్రమంగా అందకపోవడంతో కూలీలు నైరాశ్యం చెందారు. ప్రభుత్వం సకాలంలో ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించాలని సూచిస్తున్నా పోస్టాఫీసు సిబ్బంది తమ వ్యక్తిగత కారణాలతో కూలీలకు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న సంఘటన మండలంలోని అడ్లూర్‌లో జరిగింది.
ఉపాధిహామీ పథకం కింద పనిచేసిన కూలీలు గ్రామంలోని పోస్టాఫీసుకు బుధవారం ఉదయం 7 గంటలకు డబ్బుల కోసం వెళ్లారు. బీపీఎం నాయిని బాల్‌రాజు 15రోజులుగా కూలీలను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. బుధవారం ఉదయం పోస్టాఫీసుకు సకాలంలో వస్తే డబ్బులు చెల్లిస్తామనడంతో కూలీలంతా ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎదుట పడిగాపులు కాశారు. అయినా బీపీఎం పోస్టాఫీస్‌లో ఉండడంలేదని ఆగ్రహించిన కూలీలు డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన అక్కడే ఆందోళనకు దిగారు. కూలీలు బీపీఎంకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించపోవడంపై తమ అసహనాన్ని ప్రదర్శించారు. డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పాలని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.