bpm
-
విశాఖలో విస్తరించిన ఐటీ అనుబంధ దిగ్గజం
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో కీలకంగా మారిన విశాఖపట్నం వైపు దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం)లో ప్రపంచ అగ్రగామి సంస్థల్లో ఒకటైన డబ్ల్యూఎన్ఎస్ సంస్థ తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సరైన వేదికగా సాగర తీరమైన విశాఖను ఎంపిక చేసుకుంది. ఇక్కడ 200 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏకంగా 3,300 మంది ఉద్యోగులతో భారీ కార్యాలయంలో సేవల్ని విస్తరించింది. త్వరలోనే ఉద్యోగుల సంఖ్యని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. భారత్‌ని నడిపించే చోదకశక్తులుగా మారుతున్న టైర్–2 నగరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు తమ శాఖల్ని విస్తరించుకుంటున్నాయి. మెట్రో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతూ.. సకల సౌకర్యాలున్న టైర్–2 నగరాల్లో మిన్నగా ఉన్న విశాఖపట్నాన్ని మొదటి ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటూ తమ సంస్థ కార్యాలయాల్ని ఏర్పాటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా.. అంతర్జాతీయ బీపీఎం సంస్థల్లో ఒకటైన డబ్లూఎన్ఎస్.. 3,300 మంది ఉద్యోగులతో కార్యాలయాన్ని విస్తరిస్తూ తన కార్యకలాపాన్ని ప్రారంభించింది. సిరిపురంలో గతంలో హెచ్ఎస్బీసీ సంస్థ ఉన్న భవనంలోనే డబ్ల్యూఎన్ఎస్ తన కొత్త డెలివరీ సెంటర్‌ని తాజాగా ప్రారంభించింది. దేశ విదేశాల్లో డబ్ల్యూఎన్ఎస్ సేవలు ఈ కేంద్రం షిప్పింగ్, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్, హైటెక్, ప్రొఫెషనల్ సర్వీసులు అందిస్తుంది. అలాగే, దేశ విదేశాల్లో ఉన్న విభిన్న పరిశ్రమలకు డిజిటల్ ఫస్ట్ ఇండస్ట్రీ పేరుతో పరిష్కార మార్గాల్ని అందిస్తూ.. సామర్థ్యాల్ని మరింత బలోపేతం చేసుకునేలా డెలివరీ సెంటర్ ఏర్పాటుకు విశాఖను వేదికగా ఎంపిక చేసుకుంది. గతంలో సరైన సహకారంలేక.. వాస్తవానికి డబ్ల్యూఎన్ఎస్ సంస్థ 2012లోనే విశాఖలో దాదాపు 40 మంది ఉద్యోగులతో సంస్థ కార్యకలాపాల్ని టెక్ మహీంద్ర భవనంలో ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రభుత్వాలేవీ సరైన ప్రోత్సాహకాలు అందించకపోవడంతో కార్యకలాపాల్ని విస్తరించలేకపోయింది. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు ఎనలేని సహకారం అందిస్తుండటంతో ఇదే సరైన తరుణమని భావించిన సంస్థ.. 2020 నాటికి 2000 మంది ఉద్యోగులకు విస్తరించింది. రెండేళ్లలోనే 3,300 మంది ఉద్యోగులతో మరింత విస్తరించుకుని.. విశాఖలోనే అతిపెద్ద బీపీఎం సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 400 మంది క్లెయింట్స్‌తో డబ్ల్యూఎన్ఎస్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. ఇక విశాఖలో ప్రారంభించిన తాజా డెలివరీ సెంటర్‌తో కెనడా, చైనా, కోస్టారికా, ఇండియా, ఫిలిప్పీన్స్, పోలాండ్, రొమేనియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, శ్రీలంక, టర్కీ, యూకే. యూఎస్ వంటి చోట్ల మొత్తం 60 డెలివరీ సెంటర్లలో 57,503 మంది నిపుణులతో బలోపేతమైంది. త్వరలోనే విశాఖలో మరో 200 మంది ఉద్యోగుల్ని నియమించుకునే అవకాశముంది. విశాఖ కేంద్రంగా సేవల విస్తరణ విశాఖపట్నం వంటి శక్తిమంతమైన నగరంలో మా సంస్థ కార్యకలాపాలు విస్తరించడం గర్వంగా ఉంది. వైజాగ్‌లో బలమైన టాలెంట్ హబ్‌ని నిర్మించడంతో పాటు విశాఖ కేంద్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా మా ఖాతాదారులకు సేవల్ని విస్తరిస్తున్నాం. క్లౌడ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీస్ సహా డిమాండ్ బట్టి నైపుణ్యాల్ని అందించనున్నాం. నైపుణ్యవంతమైన ఉద్యోగులు, సిబ్బంది లభించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. ఏపీ ప్రభుత్వం స్థిరమైన మద్దతుని అందించడంవల్లే వేగవంతంగా సంస్థను విస్తరించగలిగాం. – కేశవ్ ఆర్ మురుగేష్, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ సీఈవో -
ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్: కోటి ఉద్యోగాలున్నాయ్!
సాక్షి,ముంబై: ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ముప్పు మళ్లీ ముంచుకొస్తోందన్న ఆందోళనల మధ్య తాజా రిపోర్టు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు,ఐటీ నిపుణులకు శుభవార్త అందించింది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్-రష్యా వార్, అంతర్జాతీయంగా చమురు ధరల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి జారుకుంటున్నాయన్న ఆందోళన నేపథ్యంలో టీమ్ లీజ్ నివేదిక వారికి భారీ ఊరటనిస్తోంది. ఐటీ, బీపీఎం(బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) రంగాల్లో భారీ ఉద్యోగాలు రానున్నాయని "డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్"లో పేర్కొంది. మూడు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనతో దేశీయ ఐటీ, బీపీఎం ఉద్యోగాలు 2023లో 7 శాతం వృద్ది నమోదుకానుందని సోమవారంతెలిపింది. అంతేకాదు మొత్తంమీద భారతదేశ ఐటీ ఉద్యోగాలు రాబోయే కొద్ది సంవత్సరాల్లో 5 మిలియన్ల నుండి 10 మిలియన్లకు (కోటి) పెరగనుందని అంచనావేసింది. ఇండియాలో ఐటీ,బీపీఎం పరిశ్రమల వృద్ధి కొనసాగుతోందని నివేదిక వెల్లడించింది. ప్రైవేట్ రంగంలో సుమారు 3.9 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది, అలాగే దేశ జీడీపీలో 8 శాతానికి పైగా తోడ్పడుతోందని టీమ్ లీజ్ తెలిపింది. గ్లోబల్ అవుట్సోర్సింగ్ మార్కెట్లో 55 శాతం వాటాను సొంతం చేసుకుందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ సీ వెల్లడించారు. తాజా రిపోర్టు ప్రకారం 2022 చివరి నాటికి డిజిటల్ నైపుణ్యాల డిమాండ్ 8.4 శాతం పుంజుకోనుంది. హెడ్‌కౌంట్ 5.1 మిలియన్ల నుంచి 5.45 మిలియన్లకు పెరుగుతుందని టీమ్‌లీజ్ తన ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్‌లో పేర్కొంది. అలాగే ఈ ఇండస్ట్రీలో అట్రిషన్ తదుపరి త్రైమాసికాల్లో కూడా అత్యధికంగానే ఉంటుంది, 2023లో కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపు కనీసం 49 శాతం నుండి 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. అయితే లింగ సమానత్వం మెరుగుపడుతోంది. ప్రస్తుతం 20 శాతం నుంచి 2023 ఆర్థిక సంవత్సరానికి 25 శాతానికి పెరగబోతోందని తెలిపింది. పెట్టుబడులు, కంపెనీలు కొత్త టెక్నాలజీలను ఇన్స్టాలింగ్తో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 21 శాతం పెరుగుతుందని అంచనా. ఐటీ సేవల కంపెనీలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCC), ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీలు ఈ ట్రెండ్‌లో 70 శాతానికి పైగా దోహదపడుతున్నాయని నివేదించింది. 2023లో టాప్-10 ఐటీ కంపెనీలు డిజిటల్ నైపుణ్యాలకు సంబంధించి చిన్న నగరాల అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయట. మార్కెటింగ్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డిమాండ్ వరుసగా 5 -7 శాతం, 4-6 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. అంతేకాదు ఉద్యోగాలు వెతుక్కోవడానికి ఐటీ మేధావులు నగరాలకు వెళ్లాల్సిన రోజులు పోయాయని పేర్కొంది. ముఖ్యంగా వర్క్‌ఫ్రం హోం విధానం, డిజిటల్ నైపుణ్యాలున్న వారు మెట్రోయేతర నగరాల్లో లభిస్తున్న తరుణంలో కంపెనీలే ఉద్యోగాలను వారి వద్దకే తీసుకువెళుతున్నాయని సునీల్ వెల్లడించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఊపందుకున్నప్పటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 33 శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు.. ఇందులో 35 శాతం గ్రాడ్యుయేట్లు టాప్ 500 నగరాల నుంచే వస్తున్నారని టీమ్ లీజ్ నివేదించింది. -
లక్ష మంది యువతకు శిక్షణలో విజనెట్ ఇండియా
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీపీఎం రంగాల్లో ఉద్యోగాలకు అనుగుణంగా 1 లక్ష మంది గ్రాడ్యుయేట్స్‌కు తగు శిక్షణ కల్పించాలని బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సంస్థ విజనెట్ ఇండియా నిర్దేశించుకుంది. 500 మంది యువ ప్రొఫెషనల్స్‌తో 45 రోజుల ప్రోగ్రాం తొలి బ్యాచ్‌ను ప్రారంభించిన సందర్భంగా సంస్థ ఎండీ అలోక్ బన్సల్ ఈ విషయం తెలిపారు. ’ఉన్నతి ఫర్ ఇండియా’ ప్రాజెక్టు కింద ఈ శిక్షణ ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేషన్ లభిస్తుందని తెలిపారు. ఫ్రెషర్లకు సాధారణంగా తమ సంస్థలో 3–4 దశల్లో వడపోత ఉంటుందని, ఈ శిక్షణ పొందినవారు ఒక్క రౌండును పూర్తి చేస్తే సరిపోతుందని బన్సల్ చెప్పారు. -
డిజిటల్ వైపు తపాలా అడుగులు
సాక్షి, బోయినపల్లి: సంపూర్ణ డిజిటల్ గ్రామాల దిశలో తపాలా శాఖ అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు అభిమాన్‌లో భాగంగా కరీంనగర్ డివిజన్లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపీపీబీ) ఆధ్వర్యంలో ఐదు డిజిటల్ గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లోని ప్రజలంతా ఐపీపీబీ ఖాతాలు కలిగి ఉన్నట్లు ధ్రువీకరించామని ఐపీపీబీ కరీంనగర్ డివిజన్ సీనియర్ మేనేజర్ చంద్రకాంత్ తెలిపారు. ఐపీపీబీ ఖాతాలతో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు సైతం పొందే అవకాశముంది. రూ.100 బ్యాలెన్స్‌తో ఐపీపీబీ ఖాతా ప్రారంభించవచ్చు. వినియోగదారుడు తన మొబైల్లో ఐపీపీబీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌తో పోస్టల్ శాఖలో ఉన్న ఎస్ఎస్ఏ, పీపీఎఫ్, ఆర్డీ ఖాతాల డిపాజిట్ ఉన్న చోటి నుంచే ఆపరేట్ చేయొచ్చు. కరీంనగర్ డివిజన్ పోస్టల్ సమాచారం డివిజన్ కేంద్రం: కరీంనగర్ హెచ్ఓలు: 2, కరీంనగర్, జగిత్యాల సబ్ డివిజన్లు: 5, కరీంనగర్నార్త్, సౌత్, జగిత్యాల ఈస్ట్, వెస్ట్, రాజన్నసిరిసిల్ల సబ్ పోస్టాఫీసులు: 43 బ్రాంచ్ పోస్టాఫీసులు: 310 ఐపీపీబీ ఖాతాలు: 50,000 ఐదు సంపూర్ణ డిజిటల్ గ్రామాలు కరీంనగర్ పోస్టల్ డివిజన్లో 310 బ్రాంచి పోస్టాఫీసులు, 43 సబ్ పోస్టాఫీసులు, కరీంనగర్, జగిత్యాల కేంద్రాలుగా 2 హెడ్ పోస్టాఫీసులు ఉన్నాయి. వీటి పరిధిలో 50వేల మందికి ఐపీపీబీ ఖాతాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐపీపీబీలో సాక్షమ్ గ్రామ్ (డిజిటల్ గ్రామాలు)గా ఐదు గ్రామాలు ఎంపికైనట్లు సంబందిత శాఖ అధికారి చంద్రకాంత్ తెలిపారు. కరీంనగర్ డివిజన్లో ఉన్న సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గునుకుల కొండాపూర్, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్, గంగిరెడ్డిపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామాలు డిజిటల్ గ్రామాలుగా ఎంపికయ్యాయి. ఈ గ్రామాల్లో ఖాతాదారులు తమ మొబైల్ ఫోన్‌తో ఆన్లైన్ బ్యాంకింగ్ చేసే అవకాశం ఉంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్.. ఆధార్ అనుసంధానంతో ఐపీపీబీ ఖాతాదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ (డీబీటీ) ద్వారా తమ ఖాతాల్లో జమ అయ్యే అవకాశముంది. ఇదులో ఉపాధిహామీ చెల్లింపులు, గ్యాస్ సబ్సిడీ, పీఎం కిసాన్ నిధి, రైతుబంధు, కేసీఆర్ కిట్ తదితర పథకాల డబ్బులు నేరుగా ఐపీపీబీ ఖాతాలో జమ చేసుకుని లబ్ధి పొందవచ్చు. గ్రామాల్లో డోర్ స్టెప్ బ్యాంకింగ్.. ఇంటి వద్దకే బ్యాంకు సేవలు కాన్సెప్ట్‌తో.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లలోకి బీపీఎంలు వెళ్లి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ కింద ఐపీపీబీ ఖాతాలు తెరుస్తున్నారు. ఇందుకోసం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం)లకు పోస్టల్ శాఖ ఐపీపీబీ యాప్ ఉన్న ప్రత్యేక సెల్ ఫోన్, బయోమెట్రిక్ డివైస్ అందించారు. ఖాతా ఇంటి వద్దే తెరిచి డీవైసీలో వేలిముద్ర తీసుకుని ఆన్లైన్ చేస్తారు. డిపాజిట్ సొమ్ము విత్‌డ్రా చేసుకోవాలనుకున్నా ఇంటి వద్దనే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రజలతో సన్నిహిత సంబంధాలు బోయినపల్లి ఎస్ఓ పరిధిలో ఉన్న తడగొండ గ్రామంలో ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నా. ఐపీపీబీ ఖాతాలతో కలిగే ప్రమోజనాలు ప్రజలకు వివరించా. దీంతో గ్రామంలో ఐదు వందలకు పైగా ఖాతాలు తెరిచా. తడగొండ డిజిటల్ గ్రామంగా ఎంపికయ్యాంది. – కిరణ్, బీపీఎం, తడగొండ, బోయినపల్లి పథకాల డబ్బులు జమ మంచిదే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్యాస్ సబ్సిడీ, ఉపాధిహామీ, రైతుబంధు తదితర సంక్షేమ పథకాల డబ్బులు నేరుగా ఖాతాలో జమ చేయడం మంచి పరిణామం. దీంతో వినియోగదారులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. – బుర్ర రాజు, తడగొండ, బోయినపల్లి ఇంటి వద్దే సేవలు.. ఐపీపీబీ కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు గ్రామాలను సంపూర్ణ డిజిటల్ గ్రామాలుగా ప్రకటించడం జరిగింది. ఈ గ్రామాల్లో ప్రజలందరికీ ఐపీపీబీ ఖాతాలు ఉన్నాయి. ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇంట్లోంచే బ్యాంకు సేవలు పొందే అవకాశం ఉంది. – చంద్రకాంత్, ఐపీపీబీ సీనియర్ మేనేజర్, కరీంనగర్ డివిజన్ -
పింఛన్ డబ్బులు కాజేశాడని ఫిర్యాదు
బజార్హత్నూర్: మండలంలోని గిర్నూర్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ నూర్సింగ్ పింఛన్ డబ్బుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఎంపీడీవో దుర్గం శంకర్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. 15వందల పింఛన్‌కు వెయ్యి రూపాయలు, రెండు నెలలకు సంబంధించిన పింఛన్ 2వేలకు వెయ్యి మాత్రమే ఇస్తున్నారని, బయోమెట్రిక్ ద్వారా వచ్చిన ప్లే స్లిప్‌ను లబ్ధిదారులకు ఇవ్వకుండా చించివేస్తున్నాడని, బుక్కుకు వంద రూపాయలు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీవో ఈవోపీఆర్డీ విజయ్‌భాస్కర్‌రెడ్డిని గ్రామానికి పంపారు. గ్రామానికి వచ్చి న ఈవోపీఆర్డీ బీపీఎంతో మాట్లాడుతున్న సమయంలో వెయ్యి ఇచ్చి 2వేలు ఇచ్చినట్లు రాయడంతో గ్రామస్తులు గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న సీఐ జయరాం, ఎస్సై అబ్ధుల్‌బాఖీ సంఘటన స్థాలానికి చేరుకుని పోస్టల్‌కు సంబంధించిన ఎస్పీఎం, మేయిల్ గార్డ్ అధికారులతో మాట్లాడారు. సోమవారం విచారణ చేపట్టి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామి ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ వినోద్‌యాదవ్, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, భూపాల్‌రెడ్డి, గ్రామస్తులు కొమ్ము నారాయణ, బాపురావ్, రాములు, సాయికృష్ణ,లక్కం నారాయణ, గవ్వల సాయిచైతన్య పాల్గొన్నారు. -
డోక్లాం ఎఫెక్ట్ : కలవని సైన్యాలు
న్యూఢిల్లీ : డోక్లాం వివాదాన్ని మర్చిపోదామని చైనా చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అది వాస్తవరూపం దాల్చడం లేదు. డోక్లాం వివాదంతో అంతర్జాతీయంగా చైనా అభాసుపాలవడాన్ని ఆ దేశాధికారులు జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమవుతోంది. సాధారణంగా దేశ ఆవిర్భావ వేడుకుల సమయంలో సరిహద్దు సైనికులతో సంప్రదాయ సమావేశాన్ని ఇరుదేశాలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాయి. అయితే తొలిసారిగా డోక్లాం వివాదం తరువాత చైనా.. తమ దేశ ఆవిర్బావ వేడుకలకు భారత సైన్యాన్ని ఆహ్వానించలేదు. చైనా-భారత్ మధ్య మొత్తం 4,057 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులో మొత్తం అయిదు ప్రాంతాల్లో చైనా ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బీపీఎం) జరుగుతుంది. భారత్ సైతం ఆగస్టు 15 వేడుకలకు సరిహద్దుల్లో ఉన్న చైనా సైన్యాన్ని ఆహ్వానిస్తోంది. డోక్లాం ఎఫెక్ట్ తరువాత ఈ ఏడాది తొలిసారిగా చైనా బీపీఎంకు భారత సైన్యాన్ని చైనా ఆహ్వానించలేదు. భారతదేశ స్వతంత్ర వేడుకలకు సైతం బీపీఎం మీటింగ్‌కు చైనా సైన్యాన్ని ఆహ్వానించింది. ఇరు దేశాల సైనికులు ఆవిర్భావ, స్వతంత్ర వేడుకల సమయంలో కలిసి సైనిక కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇరుదేశాల మధ్య 2005 తరువాత బీపీఎం మీటింగ్ జరగక పోవడం ఇదే తొలిసారి. -
డబ్బులు ఇవ్వకుండా బీపీఎం వేధిస్తున్నాడు
► ఆగ్రహించిన ఉపాధిహామీ కూలీలు ► పోస్టాఫీసు ఎదుట ఆందోళన కామారెడ్డి రూరల్(కామారెడ్డి): రెక్కలు ముక్కలు చేసుకుని ఉపాధి కూలికి వెళ్తే తమకు సరైన గిట్టుబాటు రేటు వస్తుందని ఆశించిన ఉపాధిహామీ కూలీలకు చెదు అనుభవం ఎదురైంది. ఉపాధిహామీ పథకం కింద పనిచేసి నెలలు గడుస్తున్నా తమకు కూలి డబ్బులు సక్రమంగా అందకపోవడంతో కూలీలు నైరాశ్యం చెందారు. ప్రభుత్వం సకాలంలో ఉపాధి కూలీలకు డబ్బులు చెల్లించాలని సూచిస్తున్నా పోస్టాఫీసు సిబ్బంది తమ వ్యక్తిగత కారణాలతో కూలీలకు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్న సంఘటన మండలంలోని అడ్లూర్‌లో జరిగింది. ఉపాధిహామీ పథకం కింద పనిచేసిన కూలీలు గ్రామంలోని పోస్టాఫీసుకు బుధవారం ఉదయం 7 గంటలకు డబ్బుల కోసం వెళ్లారు. బీపీఎం నాయిని బాల్‌రాజు 15రోజులుగా కూలీలను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. బుధవారం ఉదయం పోస్టాఫీసుకు సకాలంలో వస్తే డబ్బులు చెల్లిస్తామనడంతో కూలీలంతా ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎదుట పడిగాపులు కాశారు. అయినా బీపీఎం పోస్టాఫీస్‌లో ఉండడంలేదని ఆగ్రహించిన కూలీలు డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన అక్కడే ఆందోళనకు దిగారు. కూలీలు బీపీఎంకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించపోవడంపై తమ అసహనాన్ని ప్రదర్శించారు. డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పాలని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీపీఎంపై చర్యలు తీసుకోవాలి
దౌల్తాబాద్: మండలంలోని ఇండాపూర్, కుదురుమళ్ళ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రతి నెలా ఇచ్చే ఆసరా పింఛన్ల ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న తపాలా బీపీఎంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సంతోష్‌కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రతి నెలా లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పించుకుంటున్నారని ఈ నెల హస్నాబాద్‌కు వస్తేనే ఇస్తానని ఇప్పటి వరకు పింఛన్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారని బీపీఎంపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.