న్యూఢిల్లీ : డోక్లాం వివాదాన్ని మర్చిపోదామని చైనా చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అది వాస్తవరూపం దాల్చడం లేదు. డోక్లాం వివాదంతో అంతర్జాతీయంగా చైనా అభాసుపాలవడాన్ని ఆ దేశాధికారులు జీర్ణించుకోలేకపోతున్నట్లు అర్థమవుతోంది. సాధారణంగా దేశ ఆవిర్భావ వేడుకుల సమయంలో సరిహద్దు సైనికులతో సంప్రదాయ సమావేశాన్ని ఇరుదేశాలు కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాయి. అయితే తొలిసారిగా డోక్లాం వివాదం తరువాత చైనా.. తమ దేశ ఆవిర్బావ వేడుకలకు భారత సైన్యాన్ని ఆహ్వానించలేదు. చైనా-భారత్ మధ్య మొత్తం 4,057 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దులో మొత్తం అయిదు ప్రాంతాల్లో చైనా ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది బోర్డర్ పర్సనల్ మీటింగ్ (బీపీఎం) జరుగుతుంది. భారత్ సైతం ఆగస్టు 15 వేడుకలకు సరిహద్దుల్లో ఉన్న చైనా సైన్యాన్ని ఆహ్వానిస్తోంది. డోక్లాం ఎఫెక్ట్ తరువాత ఈ ఏడాది తొలిసారిగా చైనా బీపీఎంకు భారత సైన్యాన్ని చైనా ఆహ్వానించలేదు.
భారతదేశ స్వతంత్ర వేడుకలకు సైతం బీపీఎం మీటింగ్‌కు చైనా సైన్యాన్ని ఆహ్వానించింది. ఇరు దేశాల సైనికులు ఆవిర్భావ, స్వతంత్ర వేడుకల సమయంలో కలిసి సైనిక కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇరుదేశాల మధ్య 2005 తరువాత బీపీఎం మీటింగ్ జరగక పోవడం ఇదే తొలిసారి.