సాక్షి, విశాఖపట్నం: దేశంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో కీలకంగా మారిన విశాఖపట్నం వైపు దిగ్గజ సంస్థలు క్యూ కడుతున్నాయి. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం)లో ప్రపంచ అగ్రగామి సంస్థల్లో ఒకటైన డబ్ల్యూఎన్‌ఎస్ సంస్థ తమ కార్యకలాపాలు విస్తరించేందుకు సరైన వేదికగా సాగర తీరమైన విశాఖను ఎంపిక చేసుకుంది. ఇక్కడ 200 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏకంగా 3,300 మంది ఉద్యోగులతో భారీ కార్యాలయంలో సేవల్ని విస్తరించింది. త్వరలోనే ఉద్యోగుల సంఖ్యని పెంచే దిశగా అడుగులు వేస్తోంది.
భారత్‌ని నడిపించే చోదకశక్తులుగా మారుతున్న టైర్–2 నగరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు తమ శాఖల్ని విస్తరించుకుంటున్నాయి. మెట్రో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతూ.. సకల సౌకర్యాలున్న టైర్–2 నగరాల్లో మిన్నగా ఉన్న విశాఖపట్నాన్ని మొదటి ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటూ తమ సంస్థ కార్యాలయాల్ని ఏర్పాటుచేసుకుంటున్నాయి.
ఇందులో భాగంగా.. అంతర్జాతీయ బీపీఎం సంస్థల్లో ఒకటైన డబ్లూఎన్‌ఎస్.. 3,300 మంది ఉద్యోగులతో కార్యాలయాన్ని విస్తరిస్తూ తన కార్యకలాపాన్ని ప్రారంభించింది. సిరిపురంలో గతంలో హెచ్‌ఎస్‌బీసీ సంస్థ ఉన్న భవనంలోనే డబ్ల్యూఎన్‌ఎస్ తన కొత్త డెలివరీ సెంటర్‌ని తాజాగా ప్రారంభించింది.
దేశ విదేశాల్లో డబ్ల్యూఎన్‌ఎస్ సేవలు
ఈ కేంద్రం షిప్పింగ్, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్, హైటెక్, ప్రొఫెషనల్ సర్వీసులు అందిస్తుంది. అలాగే, దేశ విదేశాల్లో ఉన్న విభిన్న పరిశ్రమలకు డిజిటల్ ఫస్ట్ ఇండస్ట్రీ పేరుతో పరిష్కార మార్గాల్ని అందిస్తూ.. సామర్థ్యాల్ని మరింత బలోపేతం చేసుకునేలా డెలివరీ సెంటర్ ఏర్పాటుకు విశాఖను వేదికగా ఎంపిక చేసుకుంది.
గతంలో సరైన సహకారంలేక..
వాస్తవానికి డబ్ల్యూఎన్‌ఎస్ సంస్థ 2012లోనే విశాఖలో దాదాపు 40 మంది ఉద్యోగులతో సంస్థ కార్యకలాపాల్ని టెక్ మహీంద్ర భవనంలో ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రభుత్వాలేవీ సరైన ప్రోత్సాహకాలు అందించకపోవడంతో కార్యకలాపాల్ని విస్తరించలేకపోయింది. కానీ, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు ఎనలేని సహకారం అందిస్తుండటంతో ఇదే సరైన తరుణమని భావించిన సంస్థ.. 2020 నాటికి 2000 మంది ఉద్యోగులకు విస్తరించింది.
రెండేళ్లలోనే 3,300 మంది ఉద్యోగులతో మరింత విస్తరించుకుని.. విశాఖలోనే అతిపెద్ద బీపీఎం సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 400 మంది క్లెయింట్స్‌తో డబ్ల్యూఎన్‌ఎస్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది. ఇక విశాఖలో ప్రారంభించిన తాజా డెలివరీ సెంటర్‌తో కెనడా, చైనా, కోస్టారికా, ఇండియా, ఫిలిప్పీన్స్, పోలాండ్, రొమేనియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, శ్రీలంక, టర్కీ, యూకే. యూఎస్ వంటి చోట్ల మొత్తం 60 డెలివరీ సెంటర్లలో 57,503 మంది నిపుణులతో బలోపేతమైంది. త్వరలోనే విశాఖలో మరో 200 మంది ఉద్యోగుల్ని నియమించుకునే అవకాశముంది.
విశాఖ కేంద్రంగా సేవల విస్తరణ
విశాఖపట్నం వంటి శక్తిమంతమైన నగరంలో మా సంస్థ కార్యకలాపాలు విస్తరించడం గర్వంగా ఉంది. వైజాగ్‌లో బలమైన టాలెంట్ హబ్‌ని నిర్మించడంతో పాటు విశాఖ కేంద్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా మా ఖాతాదారులకు సేవల్ని విస్తరిస్తున్నాం. క్లౌడ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీస్ సహా డిమాండ్ బట్టి నైపుణ్యాల్ని అందించనున్నాం.
నైపుణ్యవంతమైన ఉద్యోగులు, సిబ్బంది లభించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. ఏపీ ప్రభుత్వం స్థిరమైన మద్దతుని అందించడంవల్లే వేగవంతంగా సంస్థను విస్తరించగలిగాం.
– కేశవ్ ఆర్ మురుగేష్, డబ్ల్యూఎన్‌ఎస్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment