సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశాంత విశాఖే లక్ష్యంగా అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు సిద్ధమైంది. విశాఖను టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి విస్తరించింది. విశాఖ పోలీస్ కమిషనరేట్నంతా టాస్క్ ఫోర్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి తెచ్చింది. ఈ మేరకు హోం శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులు మే 24 నుంచి అమల్లోకొచ్చినట్టుగా పరిగణిస్తున్నట్టు కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విశాఖపట్నంలో ఇటీవల ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, వైఎస్సార్‌సీపీ నేత, బిల్డర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ) కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. మరో బిల్డర్ కిడ్నాప్ కూడా పరిస్థితి తీవ్రతను తెలియజేసింది. మరోవైపు అరకు జిల్లా పరిధిలో గంజాయి సాగును ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసినా.. ఒడిశా నుంచి గంజాయి అక్రమ రవాణా సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని భావించింది.
అసాంఘిక శక్తులపై కేసులు నమోదుచేయనున్న టాస్క్‌ఫోర్స్
ఇప్పటివరకు ఏ ప్రాంతంలోని కేసులను అక్కడి పోలీస్ స్టేషన్‌లో నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. దీంతో కేసుల దర్యాప్తు, విచారణ, శిక్షలు పడేలా చేయడం మొదలైన ప్రక్రియలో కొంత సమన్వయలోపం కనిపిస్తోంది. ఇక నుంచి విశాఖలో ఏ ప్రాంతంలో అసాంఘిక శక్తులపైన అయినా సరే టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు ఆస్కారం ఏర్పడింది.
రౌడీలు, ఇతర అసాంఘిక శక్తుల కట్టడి బాధ్యత టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపడతారు. రౌడీలు, ఇతర అసాంఘిక శక్తులు, గంజాయి అక్రమ రవాణాదారులు, విక్రేతలు, ఈవ్ టీజర్లు, మహిళలపై వేధింపులకు పాల్పడేవారు... ఇలా అన్ని తరహా కేసులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపడతారు. అందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కు అదనపు అధికారులు, సిబ్బదిని కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment