మజ్జిగ ముచ్చటేది బాబు !!
► ముందుకు రాని నిర్వాహకులు
► ఎండలో అవస్థలు పడుతున్న వేతనదారులు
► పట్టించుకోని అధికారులు
ఉపాధి హామీ పథకం వేతనదారులు మండుటెండలో మాడిపోతున్నారు. ఎండనుంచి ఉపశమనం కోసం ప్రవేశపెట్టిన మజ్జిగ పథకం వీరి దరి చేరలేదు. పనుల్లో ఉన్న వారందరికీ మజ్జిగను సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ..ఇది కొద్దిమందికే పరిమితమైంది. ప్రధానంగా మజ్జిగను సరఫరా చేసేందుకు నిర్వాహకులు ముందుకు రావడం లేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
శ్రీకాకుళం: ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులకు మజ్జిగను సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో తీరేటట్టులేదు. రాష్ట్రంలో లక్షలాది మంది పనులకు వెళ్తున్నప్పటికీ కొద్దిచోట్ల మాత్రమే ఇది అమలవుతోంది. ఒక్కో వేతనదారుకి పని సమయంలో గ్లాసు మజ్జిగ అందజేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశమైనప్పటికీ.. అనేక కారణాలతో ఇది ముందుకు సాగడం లేదు. గ్లాసు మజ్జిగను మూడు రూపాయలకు వేతనదారుకి అందజేయాలి. ఈ డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తోంది.
గ్లాసుడు మజ్జిగ కచ్చితంగా 100 మిల్లీలీటర్లు ఉండాలి. తయారీకి కావాల్సిన పాలు సేకరించి, వాటిని తోడుపెట్టి, నీళ్లు, మిరపాకాయలు, అల్లం, కరివేపాకు వంటివి కలిపిన మజ్జిగను రోజూ ఉదయాన్నే ఉపాధి పనుల వద్దకు బాధ్యులు చేరవేయాలి. ఈ బాధ్యతలను ప్రభుత్వం మహిళా స్వయం సంఘాలకు అప్పజెప్పారు. ఈ విధానం చేయడంలో ఇబ్బందులు ఉండడం, మూడు రూపాయల ధర గిట్టుబాటు ఉండదని భావించిన సంఘ సభ్యులు మజ్జిగ తయారీకి ముందుకు రావడం లేదు. ఫలితంగా ఉపాధి వేతనదారులకు మజ్జిగ ముచ్చటే తీరని పరిస్థితి నెలకొంది.
142 గ్రామాలకే పరిమితం
శ్రీకాకుళం జిల్లాలో 1101 గ్రామ పంచాయతీలు ఉండగా.. సుమారు 5.62 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. ప్రస్తుతం 953 పంచాయతీల్లో సుమారు 2.24 లక్షల మంది ‘ఉపాధి’ పనులు పనిచేస్తున్నారు. తీవ్రమైన ఎండలో పనులు చేస్తున్న వీరికి మజ్జిగ సరఫరా కావడం లేదు. కేవలం 142 పంచాయతీలకు మాత్రమే పరిమితమైంది. మిగిలిన 811 పంచాయతీల్లో అమలు కానప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వేతనదారుల నుంచి వస్తున్నారు.
ఎప్పుడిస్తారో..
మజ్జిగన్నారు. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వడం లేదు. కనీసం ఉపాధి పని ప్రాంతంలో మంచినీరు దొరకడం లేదు. ఇంటి నుంచే సీసాలతో నీరు తెచ్చుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితిల్లో కాకుండా తరువాత ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఎప్పుడు మజ్జిక పథకం ప్రారంభిస్తారో తెలీదు. - గంగు ఎర్రమ్మ, వేతనదారు, గూడేం
నీళ్లు సైతం అందుబాటులో లేవు
ఉపాధి పని దగ్గర కనీసం నీరు కూడా అందుబాటులో ఉండడం లేదు. దాహం వేస్తే నీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. విశ్రాంతి తీసుకోవడానికి నీడ కూడా ఉండడం లేదు. మజ్జిగ మాటను అధికారులు మరిచిపోయారు. - రాములమ్మ, వేతనదారు, తమ్మినాయుడుపేట, ఎచ్చెర్ల మండలం