అంత ‘ఉపాధి’ ఎలా సాధ్యం!
- రాష్ట్ర బడ్జెట్లో ఉపాధిహామీకి రూ.3 వేల కోట్లు కేటాయింపు
- 30 వేల కోట్ల పనిదినాలు కల్పించడంపై సందేహాలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుపై సర్కారు అంచనాలకు, ఆచరణకు భారీ వ్యత్యాసం కని పిస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ అమలు నిమిత్తం తాజా బడ్జెట్లో రూ.3 వేల కోట్లు కేటాయిం చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో రూ.253.98 కోట్లు నిర్వహణ పద్దుగాను, రూ.2,746.02 కోట్లు ప్రగతి పద్దుగానూ ప్రభుత్వం చూపింది. ప్రగతి పద్దుగా చూపిన మొత్తాన్ని ప్రభుత్వం మెటీరియల్ కాంపొ నెంట్ కింద పేర్కొనడంపై సిబ్బందిని విస్మ యానికి గురి చేసింది.
ఉపాధిహామీ కూలీలకు వేతనంగా ఇచ్చిన మొత్తంలో 40 శాతం దాకా మెటీరియల్ కాంపొనెంట్ కింద ఖర్చు చేసేందుకు వీలుకానుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.2,746.02 కోట్ల మొత్తాన్ని మెటీరియల్ కాంపొనెంట్‌గా ఖర్చు చేయడంతో నిర్దేశిత నిష్పత్తి మేరకు వేతన కాంపొనెంట్ కింద రూ.4,119.03 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన సగటు వేతనం రూ.138 ప్రకారం వచ్చే ఏడాది రూ.4,119 కోట్ల వేతన కాంపొనెంట్‌ను ఖర్చు చేసేందుకు దాదాపు 30 కోట్ల పనిదినాలను కూలీలకు కల్పిం చాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన మెటీరియల్ కాంపొనెంట్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వేతన కాంపొనెంట్ ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ, 30 కోట్ల పనిది నాలను జనరేట్ చేయడం ఎలా సాధ్యమనే ప్రశ్న వివిధ స్థాయిల్లో వ్యక్తమవుతోంది. ఇది లా ఉంటే.. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఉపా ధిహామీ కింద కూలీలకు 14 కోట్లకు మించి పనిదినాలు కల్పించలేని పరిస్థితి ఉండగా, వచ్చే ఏడాది 30 కోట్ల పనిదినాల కల్పనకు సర్కారు అంచనా వేయడం గమనార్హం. సర్కారు బడ్జెట్లో పేర్కొన్న అంచనాలు బాగా నే ఉన్నా, ఆచరణలో 30 కోట్ల పనిదినాలను కల్పించడం ఎంతవరకు సాధ్యమని పలు జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులకు వచ్చిన కూలీలకు ప్రభుత్వం సకాలంలో వేతనాలు ఇవ్వనందున, ఈ ఏడాది పనులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని డీఆర్డీవోలు చెబుతున్నారు. ఊహా జనితమైన అంచనాలతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు.