‘ఉపాధి’పై బాబు దబాయింపు | Chandrababu attack on employment | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’పై బాబు దబాయింపు

Published Wed, Mar 30 2016 2:31 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

‘ఉపాధి’పై బాబు దబాయింపు - Sakshi

‘ఉపాధి’పై బాబు దబాయింపు

♦ ఉపాధి చట్టంపై వక్రభాష్యాలు... ప్రతిపక్ష నేతపై వ్యాఖ్యలు
♦ కూలీల వేతనాలకు కనీసం 60% ఖర్చు చేయాలంటున్న చట్టం
♦ చట్టంలో గరిష్ట పరిమితి లేదు...
♦ మెటీరియల్ కాంపొనెంట్ గరిష్టంగా 40% మించరాదు
♦ వైఎస్ హయాంలో 97 శాతం నిధులు వేతనాలకే..
♦ 100 శాతం నిధులు కూలీలకే ఖర్చుచేస్తున్న తమిళనాడు
 
 సాక్షి, హైదరాబాద్: కరువు చుట్టుముట్టిన కష్టకాలంలో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల విషయంలో చట్టాలు, కండిషన్లు మాట్లాడడం పాలకులకు విదాయకమేనా? కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఉపాథిహామీ నిధులలో కూలీల వేతనాలకు 60శాతం, మెటీరియల్ ఖర్చులకు 40శాతం ఖర్చుపెట్టాల్సి ఉందని ఆయన వాదించడం ఈ కోవలోకే వస్తుంది. ముఖ్యమంత్రి పేదలకు హామీ ఇచ్చే రీతిలో కాకుండా ప్రతిపక్షంపై దబాయింపునకు దిగడం విశేషం.

ఉపాధి హామీ పథకం ప్రస్తావనలో భాగంగా 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్‌పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ...ఇది కేంద్రం తెచ్చిన చట్టమని, ప్రతిపక్షనేతకు ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని అన్నారు. దీనికి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కసారి క్లారిఫికేషన్ చదివి వినిపించారు. ఉపాధి హామీ పథకంలో  కూలీల వేతనాలకు కనీసం 60 శాతం ఖర్చు చేయాలనేది నిబంధన అని, అంటే గరిష్టంగా దానికి మించి ఎంతైనా ఖర్చు చేయవచ్చునని అన్నారు. దానర్థం 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్ విధిగా వాడుకోవాలని కాదని అన్నారు. ఓవైపు క్లారిఫికేషన్ ఇస్తూండగానే స్పీకర్ మైక్ కట్‌చేశారు.

 ఉపాధి చట్టం ఏం చెబుతోంది?
  నిజానికి చట్టం అలాంటి కండిషన్ ఏదీపెట్టలేదు. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికిచ్చే నిధులలో కూలీల వేతనాలకే గరిష్టభాగం ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం -2005లోని లేబర్ బడ్జెట్ ఛాప్టర్ 8.4.4 నిబంధనలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధన ప్రకారం ఉపాథి నిధులలో కూలీలకు కనీసం 60 శాతం (గరిష్టంగా ఎంతయినా కావచ్చు), మెటీరియల్ అవసరాలకు గరిష్టంగా 40 శాతం (అంతకు మించరాదు) ఖర్చు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇది పూర్తిగా తిరగబడుతోంది.  ఈ ఏడాది కేంద్రం మన రాష్ట్రానికిచ్చిన నిధులలో ఎక్కువ భాగం మెటీరియల్ వినియోగం పేరిట సిమెంట్‌రోడ్లు, నీరు- చెట్టు పథకానికి కేటాయించారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఎత్తిచూపారు. సీసీ రోడ్ల నిర్మాణానికి బదులు కేంద్ర నిధులలో అధికభాగాన్ని కూలీల వేతనాలకు ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అయితే అధికారపక్షం మాత్రం యథాప్రకారం ఎదురుదాడికి దిగింది.

 తమిళనాడులో పదేళ్లుగా వంద శాతం నిధులు పేదలకే
 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉపాధి పథకంలో కేంద్రం ఆ రాష్ట్రానికిచ్చే నిధులలో వంద శాతం పేదల కూలీల వేతనంగా చెల్లిస్తున్నారు. ఎక్కడైనా మెటీరియల్ అవసరాలకు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులుంటే అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరుగా నిధులు కేటాయించి ఈ పథకంలో మెటీరియల్ అవసరాలకు ఉపయోగిస్తున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement