ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా అన్నివర్గాల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారు(డీఆర్‌డీవో)లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల నేపథ్యం లో నూతనంగా నియమితులైన డీఆర్‌డీవోలకు డీఆర్‌డీఏ, డ్వామా వంటి కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన అవగాహన శిబిరాన్ని జూపల్లి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దరికి సంక్షేమ ఫలాలను చేర్చడమే చిన్న జిల్లాల ఏర్పాటు లక్ష్యమన్నారు. గ్రామాలు స్వయంసమృద్ధిని సాధించే విధం గా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యం కావాలి
అన్ని జిల్లాల్లో అర్హులందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు డీఆర్‌డీవోలను ఆదేశించారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు మహిళా, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఇప్పటికే విద్యుత్ సరఫరా, నూతన పారిశ్రామిక విధానం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల ద్వారా దేశానికే రాష్ట్రం ఆదర్శంగా మారిందని మంత్రి చెప్పారు. కొన్నేళ్లుగా నిస్తేజంగా మారిన మహిళా సంఘాలను సంఘటిత శక్తిగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని డీఆర్‌డీవోలను ఆదేశించారు.
60 శాతం కుటుంబాలకు ఉపాధి
ప్రతి గ్రామంలో కనీసం 60 శాతం కుటుంబాలకు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జూపల్లి ఆదేశించారు. ఉపాధి హామీ పనులపై కరపత్రాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, కూలీ లకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలని సూచించారు.