జనయాత్ర
► తాడిపత్రి నియోజకవర్గంలో జనసంద్రం మధ్య సాగుతున్న రైతు భరోసా యాత్ర
► రెండోరోజు యాత్రలో మూడు కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
► క్రిష్టిపాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబానికి పరామర్శ
► పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో జగన్‌ను చూసేందుకు భారీగా వచ్చిన జనం
► నేడు తాడిపత్రి నియోజకవర్గంలో ముగియనున్న యాత్ర.. రేపటి నుంచి కదిరి పరిధిలో.
సాక్షిప్రతినిధి, అనంతపురం : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఐదో విడత రైతు భరోసా యాత్ర రెండోరోజు జనసంద్రం మధ్య దిగ్విజయంగా సాగింది. ప్రతిపల్లె జగన్నినాదంతో మార్మోగింది. అభిమాన నేత రావడంతో జనం తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చారు. ఆయనతో కరచాలనం చేసి ఆనందపరవశులయ్యారు. జన ఉప్పెన మధ్య జగన్ కాన్వాయ్ నిదానంగా ముందుకు సాగింది. అయినా పలుగ్రామాల్లో ప్రజలు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండి జగన్‌ను స్వాగతించారు.
రైతు భరోసా యాత్ర రెండో రోజు గురువారం పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి నుంచి మొదలైంది. ఆ గ్రామంలోని జెడ్పీటీసీ సభ్యుడు చిదంబర్‌రెడ్డి నివాసంలో బసచేసిన జగన్‌ను ఉదయం తాడిపత్రి నియోజకవర్గంలోని ముఖ్యనేతలు, కార్యకర్తలు కలిశారు. అక్కడి నుంచి లక్షుంపల్లికి చేరుకున్నారు. మార్గమధ్యంలో పొలాల్లో వ్యవసాయపనులు చేస్తున్న మహిళా కూలీలు జగన్‌ను చూసి పరుగెత్తుకొచ్చారు. వారిని చూసిన జగన్ కాన్వాయ్‌ను ఆపారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. లక్షుంపల్లి వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ ఊరు దాటేందుకు గంట సమయం పట్టింది. దారిలో చిన్నపిల్లలను ఆప్యాయంగా ముద్దాడారు. వృద్ధులను ‘ఏం పేరు అవ్వా.. ఏం పేరు తాతా?’ అంటూ పలకరించారు. యువకులతో కరచాలనం చేశారు. కొంతమంది చిన్నారులు, యువకులు సెల్ఫీలు తీసుకున్నారు. కాన్వాయ్ వస్తుంటే మిద్దెలపై నుంచి బంతిపూల వర్షం కురిపించారు.
ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌అసిస్టెంట్‌గా గతంలో పనిచేసిన నాగరాజు వీల్‌చైర్‌లో రాగా అతన్ని జగన్ పలకరించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, వైఎస్సార్‌సీపీ కార్యకర్త అని ముద్రవేసి ఫీల్డ్‌అసిస్టెంటుగా తొలగించారని నాగరాజు వాపోయాడు. ఆపై మరింత ఆరోగ్యం క్షీణించి ఇలా కుర్చీకి పరిమితమయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకుడు సూర్యనారాయణరెడ్డి ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్లారు. అక్కడి నుంచి ముప్పాలగుత్తి, బుర్నాకుంట మీదుగా కదరగుట్టపల్లికి చేరుకున్నారు. దారిలో యాడికి కాలువను పరిశీలించారు. ఆ తర్వాత క్రిష్టిపాడుకు చేరుకోగా.. డప్పులు, బ్యాండ్‌వాయిద్యాలతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ ఊరు దాటేందుకు రెండు గంటల సమయం పట్టిందంటే ఏస్థాయిలో జనం తరలివచ్చారో ఇట్టే తెలుస్తోంది. ఈ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబానికి భరోసా ఇచ్చారు. తర్వాత ఇదే గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన అన్నెం శ్రీరాములు అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు.
ఇక్కడి నుంచి నేరుగా యాడికి మండలం రాయలచెరువు చేరుకున్నారు. మహిళలు దిష్టితీసి తిలకం దిద్ది హారతి పట్టారు. గ్రామస్తులంతా రోడ్డుపైకి రావడంలో హైవే కిక్కిరిసింది. అక్కడి నుంచి కూర్మాజీపేటకు చేరుకోగా.. గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఆపై రామరాజుపల్లికి చేరుకున్నారు. తర్వాత గ్రామస్తుల కోరిక మేరకు భోగాలకట్టకు వెళ్లి..అక్కడి నుంచి నగరూరుకు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులు దాసరి కోదండరాముడు, రామసుబ్బారెడ్డి కుటుంబాలను పరామర్శించారు. అటు నుంచి నేరుగా యాడికి చేరుకున్నారు. రామిరెడ్డి ఇంట్లో బస చేశారు. రెండోరోజు యాత్రలో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, వీఆర్ రామిరెడ్డి, అదనపు సమన్వయకర్త రమేశ్‌రెడ్డి, శింగనమల నియోజకవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి, చవ్వారాజశేఖరరెడ్డి, మీసాల రంగన్న, కోటి సూర్యప్రకాశ్‌బాబు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, మహానందరెడ్డి, ట్రేడ్‌యూనియన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, పెన్నోబులేసు తదితరులు పాల్గొన్నారు.
నేటి యాత్ర ఇలా..
మూడోరోజు రైతు భరోసా యాత్ర వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ వెల్లడించారు. వైఎస్ జగన్ యాడికిలో రామిరెడ్డి నివాసం నుంచి బయలుదేరి కమ్మవారిపల్లి, పసలూరు, గార్లదిన్నె, చిన్నపప్పూరు మీదుగా రామకోటి చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు నాగరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత పెద్దపప్పూరు, షేక్‌పల్లి, నామనాంకంపల్లి, వరదాయపల్లి మీదుగా ముచ్చుకోటకు చేరుకుంటారు. రైతు లీలా కృష్ణమూర్తి కుటుంబానికి భరోసానిస్తారు.