
కూలీలకు అందని రెక్కలకష్టం
♦ 2 నెలలుగా ‘ఉపాధి’ బిల్లుల పెండింగ్
♦ అమలు కాని మూడు రోజుల పేమెంట్ ప్రణాళిక
♦ పస్తులుంటున్న కూలీలు ఫలితమివ్వని సర్కారు లక్ష్యం
దినాం కూలికి పోవాలె.. మీరు సెప్పినట్టు పనిచేయాలె.. కాని కూలికి మాత్రం నెలల తరబడి ఆగాలె.. గిదేం పనో అర్థమైతలేదు.. రెండు నెలలైంది బిల్లులిచ్చి.. రెక్కల కష్టానికి అప్పుడే పైసలిస్తే బాగుంటది.. చేతిలో చిల్లిగవ్వలేక పస్తులుంటున్నం.. జర మా గురించి పట్టించుకోండయ్యా.. అంటూ ఏ గ్రామానికి వెళ్లినా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలను అధికారులను ఇలావేడుకుంటున్నారు.
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : వలసల నివారణకు ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం నీరుగాతోంది. అధికారులు అడిగిన వారందరికీ పని కల్పిస్తున్నా చేసిన కష్టానికి మాత్రం నిరీక్షించేలా చేస్తున్నారు. ప్రభుత్వం జూలైలో రూ.10 నిధులు విడుదల చేసినా వాటిని పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రెండు నెలలనుంచి చెల్లింపులు పెండింగ్‌లో ఉండటంతో కూలీలు పస్తులుండాల్సి వస్తోంది.
రెండు నెలలుగా పెండింగులో..
జిల్లాలో సుమారు రెండు నెలల నుంచి కూలీ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 10,767 మంది కూలీలకు రూ.10 కోట్ల డబ్బులు రావాల్సి ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరం జిల్లాలో 68 లక్షల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటిదాక 31.45 లక్షల పని దినాలను మాత్రమే కల్పించారు. జూలైలో రూ.14 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇంకా జిల్లాకు రూ.10 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. కూలి డబ్బుల చెల్లింపు క్రమాన్ని పరిశీలిస్తే 42.14 శాతం కల్పించినట్లు లెక్కలు చెబుతున్నాయి. వారం రోజులుగా కూలీలు చేసిన కష్టానికి ఆ వారం చివరి రోజు నుంచి మూడు రోజుల్లో చెల్లిం పు ఆర్డర్‌ను జనరేట్ చేయాలి. ఈ మేరకు చెల్లింపులు అస్సలు అమలు కావడం లేదు.
పనితీరు ఇలా..
జిల్లాలో 21 మండలాలు, 485 గ్రామాలు, 1049 ఆమ్లెట్ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2,49,192 జాబ్‌కార్డులు ఉన్నాయి. 447 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటిదాక 91,653 కుటుంబాలకు పని కల్పించగా ఇందులో 1,47,725 కూలీలకు పని పొందారు. వీటికి ఇçప్పటిదాక 49.16 శాతం వేతనాలను చెల్లించారు. ఇప్పటి దాక 2,06,159 లక్షల పనులు చేపట్టగా ఇందులో 54187 పనులు నిర్మాణంలో ఉన్నాయి. 1,51, 972 పనులు పూర్తి చేశారు.
బడ్జెట్ బాగానే ఉన్నా..
జిల్లాలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి అధికారులు 68 లక్షల పని దినాలతో లేబర్ బడ్జెట్ తయారు చేశారు. జిల్లాలో 2,49,192 బాజ్‌కార్డులుండగా 10,767 మంది కూలీలకు డబ్బులు రావాల్సి ఉంది. సుమారు రెండునెలల నుంచి 42.14 శాతం మాత్రమే నమోదు కావడంతో క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు లోటుపాట్లున్నట్లు స్పష్టమవుతోంది. ఏటా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికారుల శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పని చేయని ఈఎంఎంఎస్
కూలీల హాజరు, పనుల నాణ్యతలో పారదర్శకత, సిబ్బందికి పని భారం తగ్గించడం కోసం ప్రభుత్వం ప్రమోగాత్మకంగా జీపీఎస్‌తో అనుసంధానించి అమలు చేస్తున్న ఎలక్ట్రానిక్ మాస్టర్ మెజర్మెంట్ సిష్టం (ఈఎమ్మెమ్మెఎస్) ఎగతాళికి గురయింది. దీనికోసం ప్రభుత్వం అన్ని స్థాయి ఉద్యోగులకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చింది. క్షేత్రసహాయకుల, సాంకేతిక సహాయకుల కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏ రోజుకారోజు కూలీల హాజరును ఫీల్డ్ అసిస్టెంట్ వారం మొత్తం చేసిన పనికి సంబంధించి కొలతలను టెక్నికల్ అసిస్టెంబట్ ఫొటోలతో సహాయ ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఉపగ్రహ ఫొటోలు పని ప్రదేశాల వద్ద నుంచి అప్‌లోడ్ చేశారా.? లేదా? అనేది ఎక్కడి నుంచి పంపారో తెలిసిపోతుంది. సిబ్బంది అక్రమాలను అరికట్టడమేగాక పనితీరులో మార్పు వస్తుంది. ఈ మాస్టర్ ఎంసీపీలో వెంటనే జరరేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కూలీలకు చెల్లింపు సకాలంలో చేతికందుతాయి.
నిర్లక్ష్యం వీడని సిబ్బంది
కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఉపాధి పనులను వేగవంతం చేయడానికి తరచూ జిల్లాలో ఎక్కడో ఓ చోట సమీక్షలు, క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ కనీసం 50 మంది కూలీలకు పని కల్పించాలని ఆదేశించారు. కానీ కనీసం పది మందికి కూడా ఉపాధి లభించడంలేదు. అత్యధిక కూలీలున్న ఈ జిల్లాలోనే పథకం విజయవంతం చేయడానికి అధికార యాంత్రాంగం విఫలమవుతోంది. ఆరు నెలలుగా పనులు అతి తక్కువగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కనీసం వంద మందికి పనులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా 20 నుంచి 30 మందికి మించడంలేదు. వారికి నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 17 శాతం మాత్రమే పనులు కల్పించారు. అత్యల్పంగా పని కల్పించిన 116 మంది సిబ్బంది జాబితాను తయారుచేశారు.