ఊరు పొమ్మంది ..ఊళ్లకు తాళం
⇒ కరువుదెబ్బకు పల్లెలు వదిలి నగరాలకు వలస
⇒ తంబళ్లపల్లె నియోజకవర్గంలో దీన పరిస్థితులు
⇒ పల్లెల్లో నిర్మానుష్యం.. తాళం పడిన ఇళ్లే దర్శనం
⇒ అపహాస్యం చేస్తున్న ఉపాధి హామీ పథకం
తంబళ్లపల్లె నియోజకవర్గంలో పల్లెలకు పల్లెలే వలసబాట పడుతున్నాయి. ఒకప్పుడు బాగాబతికిన కుటుంబాలు కూడా బతుకుదెరువు కోసం మూటాముల్లె సర్దుకుని నగరాలకు వెళ్లిపోతున్నాయి. 2015 నవంబర్‌లో కురిసిన వర్షానికి పంటలు పండి కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తున్న పల్లెలు కన్నీటి కథలే చెబుతున్నాయి. వర్షాభావంతో భూగర్భ జలాలు పడిపోయాయి. పంటలసాగు పూర్తిగా కనుమరుగైపోయింది. రైతులు, కూలీలకు పనిలేకుండాపోయింది. కష్టం చేయలేని ముసలివారిని, కడుపున పుట్టిన చిన్నపిల్లలను ఇంటికి కాపలాపెట్టి ఊరుగాని ఊరు వెళ్లిపోతున్నారు. అష్టకష్టాలు పడుతూ జీవితాల్ని నెట్టుకొస్తున్నారు.
బి.కొత్తకోట: నియోజకవర్గంలోని బి.కొత్తకోట, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు మండలాల్లో కరువు కరాళనృత్యం చేస్తోంది. చేసేదానికి పనిలేక పొట్టచేతబట్టుకుని పలువురు వలసబాటపడుతున్నారు. ఒకప్పుడు బాగాబతికిన కుటుంబాలూ దినసరి కూలీలుగా చేరేందుకు పట్టణాలకు వెళ్లిపోతున్నాయి. ఇళ్లకు ముసలివారు కాపలాదారులవుతున్నారు. బెంగళూరు, కేరళ, గోవా, తిరుపతి, హైదరాబాద్, ముంబై నగరాలకు వెళ్లిపోతున్నారు. భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా, ఫ్యాక్టరీలు, ఏటీఎం కేంద్రాల్లో వాచ్‌మెన్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. రోడ్లమీద పానీపూరి అమ్ముకుంటూ కొందరు, ఫుట్‌పాత్ వ్యాపారం చేసుకుంటూ మరికొందరు నెట్టుకొస్తున్నారు.
గ్రామాలు ‘ఖాళీ’
బీరంగి, మొటుకు, బడికాయలపల్లె, గుమ్మసముద్రం, బురకాయలకోట, మద్దినాయునిపల్లె, చౌడసముద్రం, సోంపల్లె, నాయునిచెరువుపల్లె, గూడుపల్లె, కాలువపల్లె, రామానాయక్ తాండా, బండకింద తాండా, కుడుమువారిపల్లె, వడ్డివంకతాండా, మందలవారిపల్లె, ముదివేడు, కనసానివారిపల్లె, సిద్దారెడ్డిగారిపల్లె, తుమ్మచెట్లపల్లె, భద్రయ్యగారిపల్లె, గుట్టమీద సాయిబులపల్లె, పట్టెంవాండ్లపల్లె, మడుమూరు, సంపతికోట, దేవప్పకోట, బురుజుపల్లె, కాట్నగల్లు, బూచి పల్లె, మద్దయ్యగారిపల్లె, తుమ్మరకుంట, కందుకూరు, టీ.సదుం, గోపిదిన్నె, కన్నెమడుగు, ఎర్రసానిపల్లె, కోటకొండ, కోటాల, ఆర్‌ఎన్‌తాండా, తంబళ్లపల్లె, దిన్నిమీదపల్లె పంచాయతీల్లో అధిక కుటుంబాలు వలసలు వెళ్లాయి.
47కు 32 కుటుంబాలు వలస
కురబలకోట మండలంలోని తుమ్మచెట్లపల్లెలో 47 కుటుంబాలున్నాయి. ఇక్కడి జనాభా 282 మంది. 32 కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ కుటుంబాలకు చెందిన వ్యక్తులు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూలి పనులు చేస్తున్నారు. కేబుల్ వేసేందుకు గుంతలు తవ్వడం వీరి పని. వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఇళ్లవద్దే ఉంటున్నారు. పెద్దలకు డబ్బులు చేతికందాక ఇంటికి వచ్చి కొన్నిరోజులుండి మళ్లీ పనుల కోసం వలసలు వెళ్తారు.
ఏడాదిగా ఉపాధి జాడలేదు
ఈ పల్లెల్లో జాబ్‌కార్డులు 132 ఉన్నాయి. ఇక్కడ ఏడాదిగా ఉపాధి జాడలేదు పెద్దమండ్యం మండలం సీ.గొల్లపల్లె పంచాయతీకి చెందిన కుడుములవారిపల్లెలో 54 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 11 కుటుంబాలు పూర్తిగా పల్లె వదిలి బెంగళూరుకు వలస వెళ్లాయి. ఇళ్లకు తాళాలు వేయడంతో గృహాలకు ఆలనాపాలనా లేక దుస్థితికి చేరాయి. ఈ పల్లెలో 96 జాబ్‌కార్డులు, 140 మంది కూలీలు ఉన్నారు. ఏడాదిగా ఒక్క ఉపాధి పనినీ మంజూరు కాలేదు. ఇక్కడ క్షేత్ర సహాయకుడి పోస్టు ఖాళీగా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. కుటుంబాలకు కుటుంబాలే వలసలు వెళ్తున్నాయి.
బి.కొత్తకోటలో మరీ అధ్వానం
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జాబ్‌కార్డులు కలిగిన కూలీలు 62,461 మంది ఉన్నారు. వీరిలో అధికారులు ఉపాధి పనులు కల్పిస్తున్నది 15,749 మంది కూలీలకు మాత్రమే. ఇందులోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యంత దారుణంగా పనులు కల్పించింది బి.కొత్తకోట మండలంలోనే. ఇక్కడ 11,759 జాబ్‌కార్డులు కలిగిన కూలీలుంటే పనులు చేస్తున్నది 2,027 మంది కూలీలే. చేసేదానికి పనిలేక నగరాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
కూలీలుగా మార్చేసింది
పెద్దతిప్పసముద్రం పాత మండలం వీధికి చెందిన బడికాయలపల్లె ఖాదర్‌సాబ్(70)కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయమే ఆధారం. నాలుగు ఎకరాల పొలం ఉంది. సేద్యం చేసేందుకు మూడు బోర్లు వేయించాడు. చుక్కనీరు పడకపోగా అప్పులు మిగిలాయి. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. బతుకుదెరువు కరువైంది. ఇద్దరు కొడుకులు బెంగళూరుకు వలసవెళ్లారు. పెద్ద కొడుకు మహబూబ్‌పీర్ తోపుడు బండిపై టీ అమ్ముతున్నాడు. చిన్నకొడుకు షఫీసాబ్ భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నాడు. వీరి సంపాదనతోనే కుటుంబం గడిచే పరిస్థితి. షఫీసాబ్ ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, భార్య పీటీఎంలోనే ఉంటున్నారు. షఫీసాబ్ కూలి చేస్తే వచ్చే మొత్తంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము ఇంటికి పంపిస్తున్నాడు. భర్త బెంగళూరు వెళ్లడంతో ఇక్కడ బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడం కష్టంగా ఉందని భార్య షాహీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది.