సాక్షి, విశాఖపట్నం: హూదూద్ విధ్వంసంతో దెబ్బ తిన్న రైతులకు ఉపాధి హామీ ద్వారా సాంత్వన కలగనుంది. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఉపయోగపడే పనులు గుర్తించారు. పొలాల్లో పేరుకుపోయిన ఇసుకమేటలు తొలగించడం, ధ్వంసమైన పొలం గట్లు, వరదగట్లు పటిష్టపరచడం, ఫీల్డ్ చానల్స్, ఫీడర్ ఛానల్స్‌లో పేరుకుపోయిన డీసిల్టింగ్ తొలగించడం వంటి పనులను ఉపాధి కూలీల ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. అలాగే పొలం గట్లు, తోటల్లో నేలకొరిగిన కొబ్బరి, మామిడి, జీడిమామిడి, సపోటా, సిల్వర్‌ఓక్ తదితర చె ట్లు తొలగింపు వంటి పనులను కూడా ఉపాధి హామీలో చేర్చారు.
ఇందుకోసం రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు జిల్లాలకు రూ.50కోట్లు కేటాయించింది. తొలగింపునకు ఒక్కో చెట్టుకు ఒక్కో ధరను నిర్ణయించారు. మామిడి/జీడిమామిడి చెట్టుకు రూ.250లు, కొబ్బరి/సిల్వర్ ఓక్ చెట్లకు రూ.200లు, ఇతర పండ్ల చెట్లకు రూ.150 చొప్పున చెల్లించనున్నారు. ఐదేళ్ల వయస్సు పైబడిన చెట్లకు మాత్రమే ఈసొమ్మును చెలిలంచనున్నారు. ఇలా తొలగించిన చెట్లను రైతులే విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు.
అంతేకాకుండా రైతులు కోరుకున్న పండ్ల చెట్లను హార్టికల్చర్ ప్రొగ్రామ్ ద్వారా ఉపాధి హామీ పథకం కింద వారు కోరుకున్న ప్రాంతాల్లో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్యూమరేషన్ పూర్తి కాగానే చెట్ల తొలగింపునకు అంచనాలు రూపొందిస్తారు. ఆతర్వాత రైతుల సమ్మతితో కూలీలద్వారా వారు కోరుకున్న మొక్కలను నాటనున్నారు. ఇందుకోసం అవసరమైన మొక్కలను ఉద్యానశాఖ సరఫరా చేయనుంది. ఈ పనుల కింద ఉపాధి కూలీలకు పెద్ద ఎత్తున పనిదినాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు.
బాధిత రైతులకు 'ఉపాధి' వరం
Published Sat, Nov 1 2014 5:36 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement