‘భావనపాడు’కు సహకరించండి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘దేశంలో మరెక్కడాలేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో 193 కి.మీ. తీర ప్రాంతం ఉంది. ఇక్కడ పోర్టు ఏర్పాటైతే ఉద్యోగాలొస్తాయి. ఉపాధి దొరుకుతుంది. పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ప్రపంచమంతా ఈ జిల్లావైపే చూస్తుంది. భావనపాడు పోర్టుకు సహకరించండి. రాజధాని ఏర్పాటుకు పిలుపునిస్తే రైతులు 33 వేల ఎకరాల భూమినిచ్చారు. ఎవరికీ అన్యాయం జరగదు. విలువైన భూమి ఇస్తే 25 నుంచి 30 శాతం ఇల్లు, వ్యాపారాభివృద్ధికి కేటాయిస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరులో నిర్వహించిన జనచైతన్యయాత్రలో సీఎం మాట్లాడారు. భావనపాడు, కళింగపట్నంలలో పోర్టులు ఏర్పాటైతే సమీపంలోని జాతీయ ర హదారి ద్వారా ఎగుమతుల్ని పెంచడంతోపాటు ఉపాధి దొరుకుతుందన్నారు. భూములిచ్చే రైతులకు, మత్స్యకారులకు అన్యాయం జరగదని, తనను నమ్మాలంటూ చెప్పుకొచ్చారు. పాత ఇల్లుంటే దాన్ని కొట్టేసి కొత్తగా కట్టిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దు
భావనపాడు పోర్టు విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి ట్రాప్‌లో పడొద్దని చంద్రబాబు అన్నారు. జిల్లాకో పోర్టు ఏర్పాటైతే వలసలు తగ్గుతాయని, ప్రపంచమంతా మన దగ్గరకే వస్తుందన్నారు. జనం ఆలోచన విధానం మారాలని హితవు పలికారు. పత్రికలూ సహకరించాలని, నాయకులు అడ్డం పడితే వాటినే నెగిటివ్‌గా వార్తలు రాయొద్దన్నారు. మత్స్యకార పిల్లలకు ఉపయోగపడే విధంగా యూనివర్సిటీ, హార్టికల్చర్ కళాశాల, ఓపెన్ యూనివర్సిటీ, ఎచ్చెర్ల ప్రాంతంలో రైస్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకూ పెన్షన్లు ఇప్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, మంత్రులు పరిటాల సునీత, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ ప్రతిభా భారతి, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.
జనవరిలో 4,500 కోట్ల రైతు రుణాలు మాఫీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘వచ్చే జన్మభూమి కార్యక్రమంలో రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలు, ఇతరత్రా సమస్యలు పరిష్కరిస్తాం. రైతుల పేరుతో అప్పు తెచ్చి వడ్డీతో సహా వారి రుణాల్ని చెల్తిస్తా. వచ్చే జనవరిలో రూ.4,500 కోట్లు రైతు రుణాలు మాఫీ చేస్తా. రైతు కోసం ఎంత కష్టమైనా భరిస్తా.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో సోమవారం నిర్వహించిన జన చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన 300 అడుగుల దూరం పాదయాత్ర చేసి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో రూ.3 లక్షలతో, పట్టణాల్లో రూ.5.5 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు.
ఉపాధి హామీ పథకం, 13, 14వ ఆర్థిక సంఘం నిధులతో వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తామన్నారు. గిరిజనుల ఆమోదంతో బాక్సైట్‌ను ఉపయోగించుకునేలా ఆలోచన చేస్తున్నట్టు సీఎం తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు రాకతో విజయనగరం స్మార్ట్ సిటీగా తయారై పరిశ్రమలొస్తాయని, దాని దృష్ట్యా భోగాపురం రైతులు ముందుకొచ్చి భూములివ్వాలని కోరారు. ఇదిలా ఉండగా సీఎంకు సమస్యలు వివరించేందుకు యత్నించిన సీపీఎం నేతల్ని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.