ఖజానాను సుసంపన్నం చేసుకోవడం కోసం నిరుపేదల పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. వెనుకబడిన మండలాలకు మాత్రమే ఉపాధి హామీ పథకాన్ని పరిమితం చేసేందుకు ప్రణాళిక రచించింది. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనల మేరకు జిల్లాలో ఏడు మండలా లు మాత్రమే వెనుకబడినట్లు అధికారులు నివేదిక పంపడం గమనార్హం. మిగిలిన 59 మండలాల్లోనూ ఉపాధిహామీ పథకం అమలు చేయరన్నది స్పష్టమవుతోంది. వెనుకబడిన మండలాల ఎంపికకు నిర్ణయించిన ప్రాతిపదికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: దుర్భిక్ష ప్రాంతమైన జిల్లాలో ఏడాది పొడవునా 1723 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఐదేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోవడంతో రైతులు ఆర్థింకంగా దివాలా తీశారు. అధికశాతం గ్రామాలకు రహదారులు లేవు. గ్రామాల్లో అంతర్గత రహదారులు, పారిశుద్ధ్యం అంతంత మాత్రమే అన్నది బహిరంగ రహస్యం. కానీ.. అధికారులకు ఇవేవీ కన్పించలేదు. జిల్లాలో చౌడేపల్లి, కేవీబీపురం, పెద్దమండ్యం, కంభంవారిపల్లి, రామకుప్పం, రామసముద్రం, వెదురుకుప్పం మండలాలు మాత్రమే వెనుకబడినట్లు నెల పక్షం రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా నివేదిక పంపారు. వెనుకబడిన మండలాల ఎంపికను అత్యంత గోప్యంగా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాతిపదిక ఇదే..
తాగునీళ్లు, సాగునీళ్లు(చెరువులు, కుంటలు, చిన్న మ ధ్య తరహా ప్రాజెక్టులు, బోరు బావులు) లభ్యత, భూగర్భజలాల పరిస్థితి, రహదారులు, అంతర్గత రహదారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వెనుకబడిన మండలాను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఆ మేరకు ఏడు మండలాలను మాత్రమే వెనుకబడినవిగా అధికారులు ఎంపిక చేయడం గమనార్హం. జిల్లాలో తూర్పున ఏడు మండలాల్లో మినహా తక్కిన 59 మండలాల్లోనూ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సగటున 17.84 మీటర్ల లోతుకు భూగర్భజలమట్టం పడిపోయింది.
చెరువులు, కుంటలే కాదు.. బోరు బావులు కూడా ఎండిపోయాయి. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నోళ్లెళ్లబెట్టాయి. ఆయకట్టు మొత్తం బంజరుగా మారింది. కానీ.. అధికారులకు ఇవేవీ కన్పించకపోవడం గమనార్హం. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రాతిపదికన తీసుకుంటే జిల్లాలో 59 మండలాలు వెనుకబడినట్లుగా గుర్తించవచ్చు. కానీ.. సర్కారు రహస్య ఉత్తర్వుల మేరకే ఏడు మండలాలు మాత్రమే వెనుకబడినట్లు గుర్తించి నివేదిక పంపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
ఉపాధి ఎండమావే..
సొంతూల్లో పని కల్పించి వలసలను నిరోధించాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 2, 2006న ఉపాధిహామీ పథకాన్ని జిల్లాలో చేపట్టారు. జిల్లాలో 66 మండలాల్లో 1,380 పంచాయతీల్లోని 11,580 గ్రామాల్లో ఈ పథకం అ మలవుతోంది. ఈ పథకం కింద 6.4 లక్షల మంది రైతు కూలీ, రైతు కుటుంబాలు జాబ్‌కార్డులు పొందా యి. ఉపాధిహామీ పథకం ప్రారంభించినప్పటి నుంచి నేటిదాకా రూ.1,682.21 కోట్లను మన జిల్లా లో ఖర్చు చేశారు. 2014-15లో రూ.94.78 కోట్లను వేతనాల రూపంలో రైతు కూలీలు, రైతులకు పంపిణీ చేశారు. ఉపాధిహామీ పనుల వల్లే ఎనిమిదేళ్లుగా జిల్లాలో వలసలు లేవు.
కానీ.. ఇప్పుడు ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చడంతో అప్పుడే వలసలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఉపాధిహామీ పథకాన్ని వెనుకబడిన మండలాలకే పరిమితం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగంగా జిల్లాలో ఏడు మండలాలు మాత్రమే వెనుకబడినట్లుగా గుర్తించింది. ఆ ఏడు మండలాల్లోని 385 పంచాయతీల్లో మాత్రమే 2015-16లో ఉపాధిహామీ పథకం అమలుచేయడానికి బడ్జెట్‌ను రూపొందించి.. ప్రభుత్వానికి పంపినట్లు డ్వామా(జిల్లా నీటి యాజమాన్య సంస్థ) అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. తక్కిన 59 మండలాల్లోనూ ఉపాధిహమీ పథకం కనుమరుగవడం ఖాయం. ఇది రైతు కూలీలు, రైతులకు శరాఘాతంగా మారడం ఖాయమని.. వలసలు పెరుగుతాయని.. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని రైతు, సామాజిక, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వెనుకబడిన మండలాలు ఏడే?
Published Thu, Nov 27 2014 3:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement