Footpath Business
-
కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి..
ప్రస్తుతం కుబేరులుగా.. సక్సెస్ పీపుల్స్‌గా చెప్పుకుంటున్న వారందరూ కూడా ఒకప్పుడు ఎన్నెన్నో కష్టాలు పడి విజయం సాధించిన వారే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త 'రాజా నాయక్'. ఈయనెవరో, ఈయన సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పేద కుటుంబంలో జన్మించిన రాజా నాయక్ ఆర్థిక పరిస్థితుల వల్ల పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాడు. తండ్రికి సంపాదన లేదు, తల్లి బ్రతకడానికి చాలా కష్టపడింది. కష్టాలు భరించలేక 17 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి పారిపోయిన రాజా ముంబై చేరుకున్నాడు. ఫుట్‌పాత్‌పై షర్టుల విక్రయం ఉన్నత చదువు లేని కారణంగా ఎలాంటి ఉద్యోగం లభించలేదు. కానీ అతనికి.. అతనిమీద ఉన్న దృఢమైన విశ్వాసంతో ఏదో ఒకటి సాధించాలని సంకల్పించుకున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో, డబ్బు కూడా లేకుండా పోయింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్‌పాత్‌పై షర్టులను విక్రయించాడు. జీవితం మీద కసితో పగలు, రాత్రి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. తన కృషి, అంకితభావం వల్ల ఫుట్‌పాత్‌లోని తన చిన్న దుకాణం బాగా నడిచే స్థాయికి చేరింది. వ్యాపార రంగంలో మరిన్ని అడుగులు వేయడానికి కంకణం కట్టుకున్న రాజా నాయక్ అనేక అడ్డంకులను ఎదుర్కొని, ఫుట్‌పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్‌వేర్ బిజినెస్ ప్రారంభించాడు. కొత్త వ్యాపారాలు ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు, ఇది కాకుండా బాటిల్ డ్రింకింగ్ వాటర్ వెంచర్ జల బేవరేజెస్ ప్రారంభించాడు. ఇప్పటికి కూడా ఈయన తన వ్యాపారాన్ని పెంచుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు! ప్రస్తుతం ఈయన రూ. 60 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఈయన సమాజంలోని అణగారిన వర్గాల కోసం విద్యా సంస్థలను నడుపుతున్నాడు. ప్రస్తుతం రాజా నాయక్ కర్ణాటకలోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డిఐసిసిఐ) అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. -
ఫైన్ల మోత.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ పోలీసుల కొత్త రూల్స్ తెచ్చారు. సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్స్ దాటితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఒకవేళ లైన్స్ దాటి ముందుకొస్తే రూ.100 జరిమానా విధిస్తారు. అలాగే.. ఎవరైనా ఫ్రీ లెఫ్ట్‌ను గనుక బ్లాక్ చేస్తే ఫైన్‌ను రూ.1000 గా నిర్ణయించారు. పుట్‌పాత్‌లపై దుకాణాదారులు వస్తువులు పెట్టడానికి వీల్లేదని, ఒకవేళ పెడితేగనుక భారీ జరిమానా విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. అలాగే.. పాదాచారులకు ఆటంకం కలిగేలా పార్కింగ్ చేస్తే గనుక రూ.600 ఫైన్ విధించనున్నారు. అయితే.. ఈ రూల్స్‌కు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. -
అమ్మేవి చాయ్, సమోసాలు సంపాదన మాత్రం కోట్లు!
సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ లక్షలు అర్జించే వారు కోట్లు వెనకేసుకోవడం మనకి తెలిసిందే. అయితే రోడ్డు పై టీ స్టాల్, సమోసా అమ్మకునే వ్యక్తులు కూడా ఇలా కోట్లు కూడబెడుతున్నారని మీకు తెలుసా. ఈ నమ్మలేని నిజాలు కాన్పూర్‌లోని జీఎస్టీ, ఆదాయ శాఖ అధికారుల పరిశీలనలో బయటపడ్డాయి. అక్కడ పలు ప్రాంతాల్లో రహదారిపై చాట్, క్రిస్పీ-కచోరి, చాయ్-సమోసా, పాన్ షాపుల వాళ్లలో కొందరు కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంట. ఈ పుట్ పాత్ వ్యాపారులంతా ఆహార భద్రతకు భరోసా ఇచ్చే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ తీసుకోకుండా చాలా సంవత్సరాలుగా ఈ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. కొందరు పేదలుగా కనిపించే ఈ కనపడని కోటీశ్వరులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది వ్యాపారులు మిలీనియర్లుగా బయటకు పడ్డారు. డేటా సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలను పరిశీలించినప్పుడు, ఐటి విభాగం అధికారులు సైతం నివ్వెరపోయారు. వీరిలోని చాలా మంది వద్ద ఖరీదైన కార్లు, ఎకరాల్లో భూములు లాంటివి కోనుగులు చేస్తూ ఆస్తులు భారీగానే కూడబెడుతున్నారని తెలిపారు. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారం నడుపుతున్నారని వెల్లడించారు. హిందూస్థాన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ వ్యాపారులు జిఎస్టి రిజిస్ట్రేషన్ వెలుపల ఒక్క పైసా కూడా పన్ను చెల్లించలేదట. కాని నాలుగేళ్లలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని వెల్లడించింది. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాలలో పలు ఆస్తులను కొనుగోలు చేశారని, దక్షిణ కాన్పూర్‌లో కూడా ఆస్తులు కొన్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు ఈ విషయాలపై పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. -
నేనెట్టా బతకాలి సారూ..
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా కాలం.. పనులు దొరకని వైనం.. ముగ్గురు పిల్లలను తీసుకొని ఫుట్‌పాత్‌పై డబ్బా పెట్టుకొని టీ అమ్ముకుంటూ బతుకు బండిని లాగుతోంది ఓ మహిళ. అయితే ఆమెకు జీవనాధారంగా ఉన్న ఆ డబ్బాను గురువారం జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడంతో ఆమె కన్నీరు మున్నీరైంది. ఈ డబ్బాను నమ్ముకునే ముగ్గురు పిల్లలను పోషిస్తున్నానని జీహెచ్ఎంసీ సిబ్బందికి మొర పెట్టుకున్నా కనికరించలేదు. బంజారాహిల్స్‌లోని క్యాన్సర్ ఆస్పత్రి చౌరస్తా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. -
సాక్షి, ఎఫెక్ట్: తొలగించిన డబ్బా మళ్లీ పెట్టించారు
సాక్షి, హైదరాబాద్: ముగ్గురు పిల్లలను పోషించేందుకు వేరే గత్యంతరం లేక ఫుట్‌పాత్‌పై టీకొట్టు పెట్టుకొని బతుకు నెట్టుకొస్తున్న పార్వతి అనే మహిళ డబ్బాను తొలగించిన వైనంపై ‘నేనెట్టా బతకాలి సారూ’ అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమై కథనం పట్ల వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి స్పందించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని కేన్సర్ ఆస్పత్రి సమీపంలో టీకొట్టు నిర్వహిస్తున్న ఆమె వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని ఆమె డబ్బాను తిరిగి పెట్టించారు. జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ఆమెకు వీధి వ్యాపారుల కార్డు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆమెను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఈ సందర్భంగా అధికారులను కోరారు. దీంతో బాధితురాలు పార్వతి కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ‘నాతో రాకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా’ -
60 కాస్త 10 అయ్యింది.. పట్టించుకోండి సారూ
సాక్షి ,హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని లోయర్ ట్యాంకు బండ్ గోశాల నుంచి ఏసీటీసీ కళాశాల మీదగా బీమామైదానం, ఇందిరా పార్కు రోడ్డు 60 అడుగుల వరకు ఉండేది. విశాలమైన ఈ రోడ్డుకు ఇరువైపులా గోశాల నుంచి ఇందిరా పార్కు రోడ్డు వరకు కార్లు, ద్విచక్ర వాహనాలను అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు. డెంటింగ్, వాటర్ సర్వీసింగ్ తదితర వ్యాపారులు ఆక్రమించారు. ఇష్టారాజ్యంగా మెకానిక్ షెడ్లను ఏర్పాటు చేశారు. మరమ్మతులకు వచ్చే వాహనాలు, వాహన చోదకులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేసి సర్వీసింగ్ చేయడంతో 60 అడుగులు కాస్త 10 అడుగులకు కుంచించుకుపోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ఇదేమని ఎవరైనా వాహనదారులు అడిగితే ఘర్షణలు, వాగ్వాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్గంలో మెకానిక్ షాపుల యజమానులు ఒకరిని మించి మరొకరు అక్రమంగా షెడ్లను నిర్మించి రోడ్లను ఆక్రమించారు. దీంతో పాదచారులు నడవడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. రోగులకు దారేదీ.. ► ఇదే మార్గంలో ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉంది. ► ఇక్కడికి నిత్యం వందలాది మంది వైద్యం కోసం వస్తుంటారు. ► ఇటీవల కరోనా నేపథ్యంలో ఈ సెంటర్‌ను కరోనా వైద్యం కోసం కేటాయించారు. ► దీంతో కవాడిగూడ డివిజన్‌తో పాటు ఇతర డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షల కోసం, వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. ► వారి వాహనాలను పార్క్ చేయడానికి స్థలం లేకపోవడంతో ఇబ్బందులకు గురువుతున్నారు. పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు.... అనేక సంవత్సరాలుగా రోడ్డును ఇష్టారాజ్యంగా ఆక్రమించుకుని విపరీతంగా షెడ్లను ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులకు కారణం అవుతున్న షెడ్ల యజమానులపై ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఫలితంగా రోజు రోజుకు కొత్త షెడ్లు ఈ మార్గంలో రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించి, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందిపడుతున్న రోడ్డు ఆక్రమణలను తొలగించాలని పలువురు వాహనదారులు, పాదచారులు కోరుతున్నారు. ( చదవండి: సిబ్బంది మధ్య వార్.. నిలిచిపోయిన కరోనా పరీక్షలు.. ) -
చెంప చెళ్లుమనిపించిన మహిళ, ఫుట్‌పాత్ వ్యాపారి దాడి
సాక్షి, రాంగోపాల్‌పేట్: వస్తువులు కొనుగోలు చేయలేదని మహిళను ఫుట్‌పాత్ వ్యాపారి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన మహిళ చెంప దెబ్బకొట్టింది. మరింత ఆగ్రహానికి లోనైన వ్యాపారి మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అడ్డగుట్టకు చెందిన లక్ష్మి హౌస్‌కీపింగ్ చేస్తోంది. బుధవారం రెతిఫైల్ బస్టాప్ మీదుగా ఆటోలో ఇంటికి వెళ్లేందుకు నడుచుకుంటూ తన స్నేహితురాలితో కలిసి వెళ్తోంది. రేతిఫైల్ బస్టాండ్ ఎదురుగా ఖాజా వాటర్ బాటిళ్లు విక్రయిస్తుండగా లక్ష్మి ఎంత? అని అడిగింది. ధర ఎక్కువ చెప్పడంతో వద్దని వెళ్తుండగా ఖాజా ఆమెను బూతులు తిట్టాడు. ఆగ్రహానికి లోనైన ఆమె చెంప చెల్లుమనిపించింది. దీంతో ఫుట్‌పాత్ వ్యాపారి ఆమెపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. వెంటనే ఆమె గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వ్యాపారి గతంలోనూ వినియోగదారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయినట్లు తెలిసింది. స్టేషన్ వద్ద వ్యాపారిపై దాడి మహిళ ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు ఖాజాను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అదే సమయంలో మహిళ బంధువు ఒకరు అక్కడికి చేరుకుని ఖాజాపై దాడి చేశాడు. దీంతో అతడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: లాఠీచార్జి అంటూ ప్రచారం: యూట్యూబ్ చానల్‌పై కేసు -
ఫుట్‌పాత్ సౌందర్యం
కెమెరా ముందు నిలుచునే మోడల్స్ కొంతమంది. ఎప్పటికీ కెమెరా తెలియక ఫుట్‌పాత్ మీదే జీవితాలను వెళ్లమార్చే మోడల్స్ కొంతమంది. కానరాని ఈ ముఖాలను కనిపించేలాచేయొచ్చు కదా అనుకున్నాడు కేరళ ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి. కొచ్చి ఫుట్‌పాత్ మీద చిన్న చిన్న వస్తువులు అమ్మేఅస్మాన్ అనే 21 ఏళ్ల అమ్మాయిని ఫొటోలు తీశాడు.‘స్ట్రీట్ టు స్టూడియో’ పేరుతో ఆస్మాన్కు తీసిన ఫొటోలు ఇప్పుడు అతనికీ, ఆమెకు కూడా ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. అజ్ఞాత సౌందర్యం గురించి సంభాషిస్తున్నాయి. ఫ్లవర్ ఎగ్జిబిషన్లో పెట్టేవి మాత్రమే పూలు కాదు. ఒక సందు చివర ఏదో ఒక పూరిగుడిసె మట్టికుండలో ఒక పువ్వు పూస్తుంది. ఏదో మధ్యతరగతి ఇంటి పెరడులో ఉదయపు వెలుతురు రాక మునుపు ఒక పూవు పూస్తుంది. పొలాలకు వెళ్లే బాట అంచున ఒక పూవు పూస్తుంది. అడవిలో ఎవరి కంటా పడనివ్వని గుబురు వెనుక ఒక పువ్వు పూస్తుంది. వాటిని ఎవరు చూస్తారు. స్ట్రీట్ ఫొటోగ్రాఫర్లు, లైఫ్‌స్టైల్ ఫొటోగ్రాఫర్లు తమ దారిలో అదాటున కనిపించిన ముఖాలను ఫొటోలు తీస్తుంటారు. వాటిని పత్రికలలో వేసినప్పుడు ఆ ఫొటోలలోని వ్యక్తుల సౌందర్యం ఎంత బాగుందో అనిపిస్తుంది. ముఖ్యంగా రాజస్తాన్, కశ్మీర్ ప్రాంత స్త్రీలను గిరిజన ప్రాంతాల మహిళలను తీసినప్పుడు వారి స్వచ్ఛమైన సౌందర్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అయితే అలాంటి వారిని తీసుకొచ్చి వారి చేత ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ఎవరూ చేయరు. ఎందుకంటే అందుకు వారు ఒప్పుకోరు. కాని కేరళకు చెందిన సినిమాటోగ్రాఫర్ కమ్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అయిన మహదేవన్ థంపి ఇటీవల చేసిన ఆ ప్రయోగం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఫుట్‌పాత్ సౌందర్యానికి సలామ్ కొచ్చికి చెందిన ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి భిన్నమైన ప్రయోగాలు చేస్తాడన్న పేరు సంపాదించాడు. అతని ఫొటోసెషన్స్ అన్నీ నిర్భయంగా, మొహమాటాలు లేకుండా సాగుతాయి. ఆ విధంగా అతడు కొచ్చి వాసులకు తెలుసు. అలాగే కొచ్చిలో ఎడప్పల్లి ట్రాఫిక్ సిగ్నల్ మీదుగా వెళ్లేవారికి ఆస్మాన్ తెలుసు. ఆ ట్రాఫిక్ పాయింట్ దగ్గర చాలా రోజులుగా ఆస్మాన్ సీజనల్ వస్తువులు అమ్ముతూ ఉంటుంది. వానొస్తే గొడుగు, ఎండొస్తే విండ్‌షీల్డ్... ఇలా. ‘ఒక రోజు ఆమెను చూశాను. ఆమె నవ్వు చాలా బాగుందనిపించింది. అదొక్కటే కాదు.. ఆమె రూపం.. చర్మం కూడా ఒక ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి బాగా పనికొస్తాయని అనిపించింది. వెంటనే ఆమెతో ఫొటో షూట్ చేయాలని నిశ్చయించుకున్నాను’ అన్నాడు థంపి. ‘ ఫుట్‌పాత్ మీద జీవించేవారిని మనం సాధారణంగా గౌరవించం. వారి శ్రమలో ఏం తక్కువ ఉంది. ముఖ్యంగా ఆ ఎండకు వానకు తడిచి స్త్రీలు ఎంత కష్టం చేస్తారు పొట్టకూటి కోసం. అలాంటి మహిళా స్ట్రీట్ వెండర్స్‌ను గౌరవించమని చెప్పడానికి కూడా నేను ఈ ఫొటో షూట్ చేయాలని అనుకున్నాను. నా మిత్రుడు మేకప్‌మేన్ అయిన ప్రబిన్కు ఈ విషయం చెప్తే జోక్ చేస్తున్నానేమో అనుకున్నాడు. కాని నేను నిజమే చెబుతున్నానని అర్థమయ్యాక చాలా ఉత్సాహంగా పనిలో దిగాడు’ అన్నాడు థంపి.రాజస్తాన్‌కు చెందిన దేశ దిమ్మరి జాతికి చెందిన ఆస్మాన్ కుటుంబం కొచ్చిలోనే కలమాస్సెరిలో మిగిలిన తమలాంటి కుటుంబాలతో ఉంటోంది. ‘నేను వాళ్లను కలిశాను. ఆస్మాన్ కుటుంబంతో మాట్లాడాను. వాళ్లు ఇవన్నీ పట్టని ప్రాథమిక జీవనాన్ని కోరుకునేవారు. చాలా చెప్పి ఒప్పించాల్సి వచ్చింది. మొత్తం మూడు కాస్టూమ్ సెషన్స్ అనుకున్నాం. నా మిత్రురాలు షెరీన్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. క్లాప్ మీడియా ఈ ఫొటోషూట్‌ను ప్రొడ్యూస్ చేసింది’ అని తెలిపాడు థంపి. మెరిసిన ముత్యం ఫొటోషూట్ రోజున ఆస్మాన్ వచ్చింది. వచ్చాక కూడా ఇది నిజం కాదనే భావించింది. ‘ఆమెకు మేము ఎక్కువ మేకప్ వద్దనుకున్నాం. మొదటి ఫొటోషూట్ ముగిసే వరకూ ఆస్మాన్ ఇదంతా ఉత్తుత్తికే ఏమో అనుకుంది. కాని ఆ సెషన్ ఫొటోలు చూశాక ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి మిగిలిన సెషన్స్‌లో స్వేచ్ఛగా ఫోజులిచ్చింది’ అన్నాడు థంపి. ఈయన తీసిన ఫొటోలు బయటకు వచ్చాక అందరూ థంపీని మెచ్చుకున్నారు. ఆస్మాన్కు అభినందనలు తెలిపారు. ‘సాధారణంగా ఇలాంటి ప్రయోగాలకు విమర్శలు కూడా వస్తాయి. స్ట్రీట్ వెండర్స్‌ను ఉద్ధరించినట్టు ఫోజులు కొడుతున్నాం అని కూడా అనవచ్చు. కాని ఎవరూ అనలేదు. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. నేను చేసిన పని మరికొంతమందికి స్ఫూర్తినిచ్చి ఇలాంటి ప్రయోగాలు చేయనిస్తే అంతే చాలు’ అన్నాడు థంపి.ఈ ఫొటోలు వచ్చాక ఆస్మాన్ కొచ్చిన్‌లో ఇంకా ఫేమస్ అయ్యింది. కాని ఆమెకు ఈ రంగం ఏమీ ఇష్టం లేదు. మరునాడు యధావిధిగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు చేరింది. గుప్పెడు మెతుకుల కోసం జీవితం అనే కెమెరా ముందు ఆమె అహర్నిశలు పోజులు ఇవ్వక తప్పదు కదా. – సాక్షి ఫ్యామిలీ -
ఊరు పొమ్మంది ..ఊళ్లకు తాళం
⇒ కరువుదెబ్బకు పల్లెలు వదిలి నగరాలకు వలస ⇒ తంబళ్లపల్లె నియోజకవర్గంలో దీన పరిస్థితులు ⇒ పల్లెల్లో నిర్మానుష్యం.. తాళం పడిన ఇళ్లే దర్శనం ⇒ అపహాస్యం చేస్తున్న ఉపాధి హామీ పథకం తంబళ్లపల్లె నియోజకవర్గంలో పల్లెలకు పల్లెలే వలసబాట పడుతున్నాయి. ఒకప్పుడు బాగాబతికిన కుటుంబాలు కూడా బతుకుదెరువు కోసం మూటాముల్లె సర్దుకుని నగరాలకు వెళ్లిపోతున్నాయి. 2015 నవంబర్‌లో కురిసిన వర్షానికి పంటలు పండి కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తున్న పల్లెలు కన్నీటి కథలే చెబుతున్నాయి. వర్షాభావంతో భూగర్భ జలాలు పడిపోయాయి. పంటలసాగు పూర్తిగా కనుమరుగైపోయింది. రైతులు, కూలీలకు పనిలేకుండాపోయింది. కష్టం చేయలేని ముసలివారిని, కడుపున పుట్టిన చిన్నపిల్లలను ఇంటికి కాపలాపెట్టి ఊరుగాని ఊరు వెళ్లిపోతున్నారు. అష్టకష్టాలు పడుతూ జీవితాల్ని నెట్టుకొస్తున్నారు. బి.కొత్తకోట: నియోజకవర్గంలోని బి.కొత్తకోట, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు మండలాల్లో కరువు కరాళనృత్యం చేస్తోంది. చేసేదానికి పనిలేక పొట్టచేతబట్టుకుని పలువురు వలసబాటపడుతున్నారు. ఒకప్పుడు బాగాబతికిన కుటుంబాలూ దినసరి కూలీలుగా చేరేందుకు పట్టణాలకు వెళ్లిపోతున్నాయి. ఇళ్లకు ముసలివారు కాపలాదారులవుతున్నారు. బెంగళూరు, కేరళ, గోవా, తిరుపతి, హైదరాబాద్, ముంబై నగరాలకు వెళ్లిపోతున్నారు. భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా, ఫ్యాక్టరీలు, ఏటీఎం కేంద్రాల్లో వాచ్మెన్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. రోడ్లమీద పానీపూరి అమ్ముకుంటూ కొందరు, ఫుట్‌పాత్ వ్యాపారం చేసుకుంటూ మరికొందరు నెట్టుకొస్తున్నారు. గ్రామాలు ‘ఖాళీ’ బీరంగి, మొటుకు, బడికాయలపల్లె, గుమ్మసముద్రం, బురకాయలకోట, మద్దినాయునిపల్లె, చౌడసముద్రం, సోంపల్లె, నాయునిచెరువుపల్లె, గూడుపల్లె, కాలువపల్లె, రామానాయక్ తాండా, బండకింద తాండా, కుడుమువారిపల్లె, వడ్డివంకతాండా, మందలవారిపల్లె, ముదివేడు, కనసానివారిపల్లె, సిద్దారెడ్డిగారిపల్లె, తుమ్మచెట్లపల్లె, భద్రయ్యగారిపల్లె, గుట్టమీద సాయిబులపల్లె, పట్టెంవాండ్లపల్లె, మడుమూరు, సంపతికోట, దేవప్పకోట, బురుజుపల్లె, కాట్నగల్లు, బూచి పల్లె, మద్దయ్యగారిపల్లె, తుమ్మరకుంట, కందుకూరు, టీ.సదుం, గోపిదిన్నె, కన్నెమడుగు, ఎర్రసానిపల్లె, కోటకొండ, కోటాల, ఆర్‌ఎన్‌తాండా, తంబళ్లపల్లె, దిన్నిమీదపల్లె పంచాయతీల్లో అధిక కుటుంబాలు వలసలు వెళ్లాయి. 47కు 32 కుటుంబాలు వలస కురబలకోట మండలంలోని తుమ్మచెట్లపల్లెలో 47 కుటుంబాలున్నాయి. ఇక్కడి జనాభా 282 మంది. 32 కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ కుటుంబాలకు చెందిన వ్యక్తులు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూలి పనులు చేస్తున్నారు. కేబుల్ వేసేందుకు గుంతలు తవ్వడం వీరి పని. వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఇళ్లవద్దే ఉంటున్నారు. పెద్దలకు డబ్బులు చేతికందాక ఇంటికి వచ్చి కొన్నిరోజులుండి మళ్లీ పనుల కోసం వలసలు వెళ్తారు. ఏడాదిగా ఉపాధి జాడలేదు ఈ పల్లెల్లో జాబ్‌కార్డులు 132 ఉన్నాయి. ఇక్కడ ఏడాదిగా ఉపాధి జాడలేదు పెద్దమండ్యం మండలం సీ.గొల్లపల్లె పంచాయతీకి చెందిన కుడుములవారిపల్లెలో 54 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 11 కుటుంబాలు పూర్తిగా పల్లె వదిలి బెంగళూరుకు వలస వెళ్లాయి. ఇళ్లకు తాళాలు వేయడంతో గృహాలకు ఆలనాపాలనా లేక దుస్థితికి చేరాయి. ఈ పల్లెలో 96 జాబ్‌కార్డులు, 140 మంది కూలీలు ఉన్నారు. ఏడాదిగా ఒక్క ఉపాధి పనినీ మంజూరు కాలేదు. ఇక్కడ క్షేత్ర సహాయకుడి పోస్టు ఖాళీగా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. కుటుంబాలకు కుటుంబాలే వలసలు వెళ్తున్నాయి. బి.కొత్తకోటలో మరీ అధ్వానం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జాబ్‌కార్డులు కలిగిన కూలీలు 62,461 మంది ఉన్నారు. వీరిలో అధికారులు ఉపాధి పనులు కల్పిస్తున్నది 15,749 మంది కూలీలకు మాత్రమే. ఇందులోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యంత దారుణంగా పనులు కల్పించింది బి.కొత్తకోట మండలంలోనే. ఇక్కడ 11,759 జాబ్‌కార్డులు కలిగిన కూలీలుంటే పనులు చేస్తున్నది 2,027 మంది కూలీలే. చేసేదానికి పనిలేక నగరాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కూలీలుగా మార్చేసింది పెద్దతిప్పసముద్రం పాత మండలం వీధికి చెందిన బడికాయలపల్లె ఖాదర్‌సాబ్(70)కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయమే ఆధారం. నాలుగు ఎకరాల పొలం ఉంది. సేద్యం చేసేందుకు మూడు బోర్లు వేయించాడు. చుక్కనీరు పడకపోగా అప్పులు మిగిలాయి. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. బతుకుదెరువు కరువైంది. ఇద్దరు కొడుకులు బెంగళూరుకు వలసవెళ్లారు. పెద్ద కొడుకు మహబూబ్‌పీర్ తోపుడు బండిపై టీ అమ్ముతున్నాడు. చిన్నకొడుకు షఫీసాబ్ భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నాడు. వీరి సంపాదనతోనే కుటుంబం గడిచే పరిస్థితి. షఫీసాబ్ ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, భార్య పీటీఎంలోనే ఉంటున్నారు. షఫీసాబ్ కూలి చేస్తే వచ్చే మొత్తంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము ఇంటికి పంపిస్తున్నాడు. భర్త బెంగళూరు వెళ్లడంతో ఇక్కడ బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడం కష్టంగా ఉందని భార్య షాహీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది.