కెమెరా ముందు నిలుచునే మోడల్స్ కొంతమంది. ఎప్పటికీ కెమెరా తెలియక ఫుట్‌పాత్ మీదే జీవితాలను వెళ్లమార్చే మోడల్స్ కొంతమంది. కానరాని ఈ ముఖాలను కనిపించేలాచేయొచ్చు కదా అనుకున్నాడు కేరళ ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి. కొచ్చి ఫుట్‌పాత్ మీద చిన్న చిన్న వస్తువులు అమ్మేఅస్మాన్ అనే 21 ఏళ్ల అమ్మాయిని ఫొటోలు తీశాడు.‘స్ట్రీట్ టు స్టూడియో’ పేరుతో ఆస్మాన్‌కు తీసిన ఫొటోలు ఇప్పుడు అతనికీ, ఆమెకు కూడా ప్రశంసలు తెచ్చిపెడుతున్నాయి. అజ్ఞాత సౌందర్యం గురించి సంభాషిస్తున్నాయి.
ఫ్లవర్ ఎగ్జిబిషన్‌లో పెట్టేవి మాత్రమే పూలు కాదు. ఒక సందు చివర ఏదో ఒక పూరిగుడిసె మట్టికుండలో ఒక పువ్వు పూస్తుంది. ఏదో మధ్యతరగతి ఇంటి పెరడులో ఉదయపు వెలుతురు రాక మునుపు ఒక పూవు పూస్తుంది. పొలాలకు వెళ్లే బాట అంచున ఒక పూవు పూస్తుంది. అడవిలో ఎవరి కంటా పడనివ్వని గుబురు వెనుక ఒక పువ్వు పూస్తుంది. వాటిని ఎవరు చూస్తారు. స్ట్రీట్ ఫొటోగ్రాఫర్లు, లైఫ్‌స్టైల్ ఫొటోగ్రాఫర్లు తమ దారిలో అదాటున కనిపించిన ముఖాలను ఫొటోలు తీస్తుంటారు. వాటిని పత్రికలలో వేసినప్పుడు ఆ ఫొటోలలోని వ్యక్తుల సౌందర్యం ఎంత బాగుందో అనిపిస్తుంది. ముఖ్యంగా రాజస్తాన్, కశ్మీర్ ప్రాంత స్త్రీలను గిరిజన ప్రాంతాల మహిళలను తీసినప్పుడు వారి స్వచ్ఛమైన సౌందర్యం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అయితే అలాంటి వారిని తీసుకొచ్చి వారి చేత ఫ్యాషన్ ఫొటోగ్రఫీ ఎవరూ చేయరు. ఎందుకంటే అందుకు వారు ఒప్పుకోరు. కాని కేరళకు చెందిన సినిమాటోగ్రాఫర్ కమ్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ అయిన మహదేవన్ థంపి ఇటీవల చేసిన ఆ ప్రయోగం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఫుట్‌పాత్ సౌందర్యానికి సలామ్
కొచ్చికి చెందిన ఫొటోగ్రాఫర్ మహదేవన్ థంపి భిన్నమైన ప్రయోగాలు చేస్తాడన్న పేరు సంపాదించాడు. అతని ఫొటోసెషన్స్ అన్నీ నిర్భయంగా, మొహమాటాలు లేకుండా సాగుతాయి. ఆ విధంగా అతడు కొచ్చి వాసులకు తెలుసు. అలాగే కొచ్చిలో ఎడప్పల్లి ట్రాఫిక్ సిగ్నల్ మీదుగా వెళ్లేవారికి ఆస్మాన్ తెలుసు. ఆ ట్రాఫిక్ పాయింట్ దగ్గర చాలా రోజులుగా ఆస్మాన్ సీజనల్ వస్తువులు అమ్ముతూ ఉంటుంది. వానొస్తే గొడుగు, ఎండొస్తే విండ్‌షీల్డ్... ఇలా. ‘ఒక రోజు ఆమెను చూశాను. ఆమె నవ్వు చాలా బాగుందనిపించింది. అదొక్కటే కాదు.. ఆమె రూపం.. చర్మం కూడా ఒక ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి బాగా పనికొస్తాయని అనిపించింది. వెంటనే ఆమెతో ఫొటో షూట్ చేయాలని నిశ్చయించుకున్నాను’ అన్నాడు థంపి. ‘
ఫుట్‌పాత్ మీద జీవించేవారిని మనం సాధారణంగా గౌరవించం. వారి శ్రమలో ఏం తక్కువ ఉంది. ముఖ్యంగా ఆ ఎండకు వానకు తడిచి స్త్రీలు ఎంత కష్టం చేస్తారు పొట్టకూటి కోసం. అలాంటి మహిళా స్ట్రీట్ వెండర్స్‌ను గౌరవించమని చెప్పడానికి కూడా నేను ఈ ఫొటో షూట్ చేయాలని అనుకున్నాను. నా మిత్రుడు మేకప్‌మేన్ అయిన ప్రబిన్‌కు ఈ విషయం చెప్తే జోక్ చేస్తున్నానేమో అనుకున్నాడు. కాని నేను నిజమే చెబుతున్నానని అర్థమయ్యాక చాలా ఉత్సాహంగా పనిలో దిగాడు’ అన్నాడు థంపి.రాజస్తాన్‌కు చెందిన దేశ దిమ్మరి జాతికి చెందిన ఆస్మాన్ కుటుంబం కొచ్చిలోనే కలమాస్సెరిలో మిగిలిన తమలాంటి కుటుంబాలతో ఉంటోంది. ‘నేను వాళ్లను కలిశాను. ఆస్మాన్ కుటుంబంతో మాట్లాడాను. వాళ్లు ఇవన్నీ పట్టని ప్రాథమిక జీవనాన్ని కోరుకునేవారు. చాలా చెప్పి ఒప్పించాల్సి వచ్చింది. మొత్తం మూడు కాస్టూమ్ సెషన్స్ అనుకున్నాం. నా మిత్రురాలు షెరీన్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. క్లాప్ మీడియా ఈ ఫొటోషూట్‌ను ప్రొడ్యూస్ చేసింది’ అని తెలిపాడు థంపి.
మెరిసిన ముత్యం
ఫొటోషూట్ రోజున ఆస్మాన్ వచ్చింది. వచ్చాక కూడా ఇది నిజం కాదనే భావించింది. ‘ఆమెకు మేము ఎక్కువ మేకప్ వద్దనుకున్నాం. మొదటి ఫొటోషూట్ ముగిసే వరకూ ఆస్మాన్ ఇదంతా ఉత్తుత్తికే ఏమో అనుకుంది. కాని ఆ సెషన్ ఫొటోలు చూశాక ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి మిగిలిన సెషన్స్‌లో స్వేచ్ఛగా ఫోజులిచ్చింది’ అన్నాడు థంపి. ఈయన తీసిన ఫొటోలు బయటకు వచ్చాక అందరూ థంపీని మెచ్చుకున్నారు. ఆస్మాన్‌కు అభినందనలు తెలిపారు. ‘సాధారణంగా ఇలాంటి ప్రయోగాలకు విమర్శలు కూడా వస్తాయి. స్ట్రీట్ వెండర్స్‌ను ఉద్ధరించినట్టు ఫోజులు కొడుతున్నాం అని కూడా అనవచ్చు. కాని ఎవరూ అనలేదు. నా ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. నేను చేసిన పని మరికొంతమందికి స్ఫూర్తినిచ్చి ఇలాంటి ప్రయోగాలు చేయనిస్తే అంతే చాలు’ అన్నాడు థంపి.ఈ ఫొటోలు వచ్చాక ఆస్మాన్ కొచ్చిన్‌లో ఇంకా ఫేమస్ అయ్యింది. కాని ఆమెకు ఈ రంగం ఏమీ ఇష్టం లేదు. మరునాడు యధావిధిగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు చేరింది. గుప్పెడు మెతుకుల కోసం జీవితం అనే కెమెరా ముందు ఆమె అహర్నిశలు పోజులు ఇవ్వక తప్పదు కదా.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment