స్లిమ్‌గా ఉన్నవాళ్లే అందంగా ఉంటారా? స్లిమ్‌గా ఉన్నవాళ్లే ఫ్యాషన్ దుస్తులు వేసుకోగలరా?స్లిమ్‌గా ఉన్నవాళ్లే మోడలింగ్ చేస్తారా?కేరళకు చెందిన ఇందూజా ప్రకాష్ ఇలా ప్రశ్నించడమే కాదు ప్లస్ సైజ్ మహిళల్లో విశ్వాసాన్ని తీసుకురావడానికి మోడల్‌గా మారింది. ‘నా ఊబకాయం నాకో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. బాడీ షేమింగ్ కారణంగా తిరస్కరించబడిన మహిళలందరికీ నేను ప్రేరణ’ అంటోంది.
మోడల్ అవ్వాలంటే స్లిమ్‌గా ఉండడమే కాదు శరీరం కొన్ని కొలతల్లో ఇమిడిపోవాలి. చూపులను ఆకట్టుకునే రూపం సొంతమై ఉండాలి. ర్యాంప్ వేదికలపై సొగసుగా అడుగులు వేయడం రావాలి... అయితే ఇవేవీ అవసరం లేదంటోంది ఇందూజ ప్రకాష్. 27 సంవత్సరాల వయసులో మోడలింగ్‌ను వృత్తిగా మార్చుకొని ఊబకాయాన్ని ఎగతాళి చేసే వ్యక్తులకు తన రూపంతోనే సరైన సమాధానం ఇస్తోంది.
నా తప్పుకాదు..
‘‘ఊబకాయం ఉన్న మహిళల్ని, అమ్మాయిలను చాలా మంది గేలి చేస్తారు. ఊబకాయంగా ఉండటం అది వారి తప్పు కాదు. కానీ, ఎన్నో సమాజంలో ఎన్నో హేళనలు తట్టుకోవాలి. నా వరకే చూస్తే.. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను ఆటపట్టించినవారే. ఎక్కడకు వెళ్లినా బరువు తగ్గమని సలహాలు ఇచ్చేవారే ఎక్కువయ్యారు. దీంతో చాలా సార్లు బరువు తగ్గటానికి ప్రయత్నించాను. కొన్నిరోజులు ఎక్కడకూ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. చాలా బాధగా అనిపించేది. తిండి తినకుండా అతిగా డైటింగ్ నియమాలు చాలా పాటించాను. ఆకలికి తట్టుకున్నాను. వ్యాయామాలు చేశాను. కానీ, బరువు తగ్గలేదు. విని విని విసుగిపోయాను. మా కుటుంబంలో ఊబకాయం వంశపారంపర్యంగా ఉంది. అది నాకూ వచ్చింది. లావుగా ఉండటం నా తప్పు కాదు’’ అని వివరించిన ఇందూజ సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసింది. లాక్‌డౌన్ సమయాన్ని ప్లస్ సైజ్ మోడల్‌గా మార్చుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడదే వృత్తిగా చేసుకుంది.
ఊబకాయం సమస్య, మానసికంగా తను ఎదిగిన విధానం గురించి మరింతగా వివరిస్తూ ‘‘ఎంత శ్రమ చేసినా తగ్గడం లేదు అని నిర్ధారణకు వచ్చాక ఇక ఈ సమస్య గురించి ఆలోచించకూడదు అనుకున్నాను. అప్పుడు నా మనసు చాలా తేలికైనట్టనిపించింది. కేరళలో ప్లస్ సైజ్ మోడలింగ్ అంత సులభం కాదు. ఇక్కడి జనం స్లిమ్ సైజ్ వాళ్లే మోడలింగ్‌కి అర్హత గలవారు అనుకుంటారు. నిజానికి ఏ రాష్ట్రమైనా, ప్రాంతమైనా అంతటా అందరిలోనూ ఇదే అభిప్రాయం ఉంటుందని నాకు తెలుసు. కానీ, నేను ఇదే శరీరం తో జనాలను ఒప్పించాలి అని బలంగా అనుకున్నాను. బాడీ షేమింగ్ కారణంగా తిరస్కరించబడిన మహిళలందరికీ నేను ప్రేరణ కావాలనుకున్నాను. ప్లస్ సైజ్ మోడల్‌గా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నచ్చిన పనిని కొనసాగిస్తున్నాను. ఇతరుల కోసం నన్ను నేను మార్చుకోలేను’ అని తెలిపింది ఇందూజ. ఇందూజ ఇప్పుడు ఫొటోగ్రాఫర్స్, మేకప్ ఆర్టిస్టుల కోసం మోడలింగ్ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు మలయాళీ చిత్రాల్లోనూ నటించిన ఇందూజ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కృషి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment