plus size
-
మిస్ అలబామాగా ప్లస్ సైజ్ మోడల్..!
అందం అంటే నాజుగ్గా, శిల్పంలా ఉండటమే కాదని ప్రూవ్ చేసిందామె. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం ఉంటే..ప్లస్ సైజులో ఉన్నా బ్యూటీగా గెలవొచ్చని చాటి చెప్పింది. అందం అంటే ఆకృతికి సంబంధించింది కాదని మానసిక సౌందర్యమే నిజమైన అందమని తెలియజెప్పింది. అంతేగాదు బాడీ షేమర్ల చెంపచెళ్లుమనేలా అందాల పోటీల్లో గెలిచి చూపించింది. సోషల్ మీడియా, సినిమాల పుణ్యామా అని అందం మీద మోజు ఎక్కువయ్యింది. కేవలం నాజుగ్గా, చెక్కిన శిల్పంలా ఉంటేనే అందం అన్నట్లుగా భావిస్తున్నారు చాలామంది. ఆఖరికి రంగు విషయంలో కూడా అవహేళనలే. తెల్ల తోలు ఉన్న వాళ్లు తప్ప మిగతా వాళ్లెవరూ కంటికి ఆనరు అనేంతగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ముఖ్యంగా యువతలో ఇది మరీ ఎక్కువగా ఉంది. దీంతో జన్యు పరంగానో లేదా అనారోగ్య కారణాల వల్లనో లావుగా ఉన్నవాళ్లు సమాజం నుంచి పలు చిత్కారాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అవమానాలనే ఎదుర్కొంది సారా మిల్లికెన్. సారా మెంటల్ హెల్త్ లాయర్(మానసిక ఆరోగ్య న్యాయవాది). చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు బాడీ షేమింగ్‌కి గురయ్యింది. సోషల్‌మీడియాలో కూడా తన ఆకృతి విషయమై ట్రోల్స్ బారిన పడింది. అయినా సరే తనలాంటి వాళ్లు కూడా అందాల పోటీల్లో విజేతలవ్వగలరు అని చెప్పాలన్న సంకల్పంతో మిస్ అలబామా అందాల పోటీల్లో పాల్గొంది. రెండు సార్లు కిరీటం కోసం పోటీపడి త్రుటిలో చేజారిపోయింది. ఆ టైంలో కూడా ఆమె విశ్వాసాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ఎదుర్కొంది. దీంతో మళ్లీ ఈ పోటీల్లో పాల్గొనకూడదు అని వెనక్కి వచ్చేసింది. అలా ఏడేళ్ల పాటు ర్యాపింగ్కి దూరంగా ఉంది. మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనకపోవడం అంటే..ఆ వ్యక్తి అన్న మాటను తాను అంగీకరించి వచ్చేసినట్లే కదా అన్న బాధ వెంటాడింది సారాని. తనలో ఎలాగైన ఆ అవహేళనలు, బాడీ షేమర్లను తిప్పికొట్టేలా ఈ పోటీల్లో గెలవాలన్న కసి పెరిగింది. ఆ పట్టుదలే సారాని మిస్ అలబామా 2024లో కిరీటాన్ని దక్కించుకునేలా చేసింది. అంతేగాదు ఆ వేదికపైనే తన ఆకృతి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. విరుచుకుపడింది. తన గెలుపుతో హేళన చేసే వారి చెంప చెళ్లుమనిపించేలా చేసింది. అంతేగాదు దయచేసి ఎవ్వరూ మరొకరి శరీరాన్ని అగౌరవపరచొద్దు, మానసిక సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వండి అని కోరింది సారా. మహిళలు మనసు పెట్టి సాధించాలనుకుంటే కచ్చితంగా సాధించగలరని సోషల్ మీడియా వేదికగా తనలాంటి వాళ్లను మోటీవేట్ చేస్తుంటుంది సారా. అంతేగాదు సోషల్ మీడీయా ట్రోల్స్‌కి చాలా వ్యూహాత్మకంగా కౌంటర్లు ఇచ్చేది. దీంతో సారాకు అనూహ్యంగా వేలాది మంది నెటిజన్ల మద్దతు లభించేది. అదే ఆమెకు ఎక్కవ మంది ఫాలోవర్స్‌ని తెచ్చిపెట్టింది. అంతేగాదు ఇలా ఆన్లైన్లో టైప్ చేసే బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ప్రజల్లో అనుచిత ముద్ర వేస్తాయంటూ.. అంటించే చురకలు అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చేలా చేసింది. ఈ వైఖరే సారానీ మిస్ అలబామాగా అందాల పోటీలో విజేతగా నిలబెట్టింది. ఇప్పుడామెకు ఈ విజయానికి గానూ సోషల్ మీడియా నుంచి వేలాదిగా ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. (చదవండి: వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత) -
లావు ఉండటం మైనస్సే కాదు.. బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోండి
శరీరం పరిమాణం... ఆకృతిని బట్టి అందాన్ని కొలిచే జనరేషన్ ఇది. సన్నగా, నాజూకుగా ఉండే అమ్మాయిలనే అందగత్తెలుగా గుర్తించడం కామన్ అయింది. అలాంటిది లావుగా ఉన్నవారిని ఏ మాత్రం పట్టించుకోక పోగా, వారి మనసు గాయపడేలా కామెంట్లు చేస్తుంటారు. ప్లస్ సైజు అయితే ఏంటీ? సైజు గురించి పట్టించుకోకండి! అది అస్సలు మైనస్సే కాదు! ఒబేసిటిని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోండి! అంటోంది తన్వి గీతా రవిశంకర్. తన్వి లావుగా ఉన్నప్పటికీ నచ్చిన డ్రెస్‌లు వేసుకుంటూ ఫ్యాషన్‌ను ఎంజాయ్ చేస్తూ.. ఫ్యాటీ ఫ్యాషన్ వీడియోలను తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. డ్యాన్సర్, స్టైలిస్ట్, వాయిస్ వోవర్ ఆర్టిస్ట్ అయిన తన్వి ముంబైలో పుట్టి పెరిగింది. చిన్నప్పటినుంచి బొద్దుగా ఉండే తన్విని అందరూ బాగానే ముద్దు చేసేవారు. ఆమెకు మొదటి నుంచి డ్యాన్స్ అంటే ఆసక్తి. మిగతా విద్యార్థుల కంటే తాన్వి బాగా డ్యాన్స్ చేస్తుందని టీచర్ కూడా చెప్పేవారు. దీంతో చిన్నతనం నుంచే తన్వికి తనపై తనకు ఒక నమ్మకం ఏర్పడింది. అంతేగాక తన శరీరం భారీగా ఉన్నప్పటికీ పన్నెండేళ్ల నుంచే ఫ్యాషన్‌గా ఉండడానికి ఇష్టపడేది. మొదట్లో ఇంజినీరింగ్ చదవాలనుకుంది. కానీ డాన్స్ అంటే మక్కువతో ఫైనలియర్‌లోనే ఇంజినీరింగ్‌ను వదిలేసి, ముంబైలో డ్యాన్స్ అకాడమీలో చేరి, డాన్స్ నేర్చుకుంది. దాంతోబాటు తనకు ఫ్యాషన్ మీద కూడా ఆసక్తి ఉన్న ఉండడంతో ఫ్యాషన్ డిగ్రీ చదివింది. అయితే అక్కడా ఆమె శరీరాకృతి గురించి కామెంట్లు తప్పేవి కాదు. అయితే, అవేమీ లెక్క చేయకుండా నచి్చన డ్రెస్‌లు వేసుకుంటూ, వాటిలోనే అందంగా కనిపిస్తూ ఆత్మవిశ్వాసంతో అందరి నోళ్లు మూయించింది. శరీరాన్ని చూసి చిన్నబుచ్చుకోవద్దు..దాన్ని సెలబ్రేట్ చేసుకోండని చెబుతోన్న తన్వి మాటలు భారీకాయులెందరికో స్ఫూర్తిదాయకం. ఆ మాటలు వినకండి.. కడుపునిండా తినకండి, నెయ్యి వేసుకోవద్దు, చిప్స్ తినొద్దు. ఇలాంటి మాటలు అస్సలు వినకండి. వీటిని విన్నారంటే ఆహారాన్ని ప్రసాదంలాగా తినాల్సి వస్తుంది. మా అమ్మ తరపున వాళ్లు సన్నగా ఉంటే, నాన్న తరపు వాళ్లు బొద్దుగా ఉండేవాళ్లు. నేను వాళ్ల కమ్యూనిటీలో చేరాను. చాలామంది లావుగా ఉన్నవాళ్లను చూసి వీళ్లు అతిగా తింటారు, శరీరానికి వ్యాయామం ఉండదు. బద్దకంగా తయారవుతారు అంటారు. అది నిజం కాదు. ఇన్‌స్టా స్టైలిస్ట్‌గా స్కూలు, కాలేజీలో ఎక్కడా నేను నా శరీరాన్ని గురించి సిగ్గుపడింది లేదు. లావుగా ఉన్నానని ఫీల్ అవ్వలేదు. అందుకే ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌ను ఎంతో ధైర్యంగా క్రియేట్ చేసాను. ఇండియాలో దొరికే బ్రాండెడ్ డ్రెస్‌లు వేసుకుని ఇన్‌స్టాలో పోస్టు చేసేదాన్ని. జీన్స్, బికినీ, షార్ట్స్’, చీరలతోపాటు దాదాపు అన్నిరకాల డ్రెస్‌లు వేసుకుని ఫొటోలు అప్లోడ్ చేసేదాన్ని. అంతేగాక లిప్‌స్టిక్, ఐలైనర్, ఫౌండేషన్, షూస్, మ్యాచింగ్ జ్యూవెలరీ వేసుకునేదాన్ని. నా పోస్టులకు చాలా అభినందనలు వచ్చేవి. సెలబ్రేట్ చేసుకోండి! మీరు ఊబకాయం, అధిక బరువుతో ఉన్నారని ఇబ్బంది పడొద్దు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల మీ శరీరంలో ఏదో లోపించిందని కాదు. సన్నగా ఉన్నవారిలాగే మీరు అన్ని చేయగలరు. ఫ్యాటీగా ఉన్నప్పటికీ ఫిట్‌గా, యాక్టివ్‌గా హెల్దీగా ఉండేందుకు ప్రయతి్నంచాలి. దీనివల్ల మిమ్మల్ని చులకన చేసి మాట్లాడే సమాజం కామెంట్ చేయడానికి ఆలోచిస్తుంది. లావుగా ఉన్న శరీరం గురించి ఫీల్ కాకుండా ప్రతిరోజూ ‘‘ఐయామ్ ఓకే, ఐయామ్ వర్త్ ఇట్’’ అని చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ వ్యక్తిత్వాన్ని రంగులమయం చేసుకుని డైలీ సెలబ్రేట్ చేసుకోండి. నిజంగా ఇలాంటి ప్రేరణ కలిగించే వారు ఉంటే ఎలా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలుగుతుంది. -
నేను ప్లస్ సైజ్ మోడల్ని..
స్లిమ్‌గా ఉన్నవాళ్లే అందంగా ఉంటారా? స్లిమ్‌గా ఉన్నవాళ్లే ఫ్యాషన్ దుస్తులు వేసుకోగలరా?స్లిమ్‌గా ఉన్నవాళ్లే మోడలింగ్ చేస్తారా?కేరళకు చెందిన ఇందూజా ప్రకాష్ ఇలా ప్రశ్నించడమే కాదు ప్లస్ సైజ్ మహిళల్లో విశ్వాసాన్ని తీసుకురావడానికి మోడల్‌గా మారింది. ‘నా ఊబకాయం నాకో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. బాడీ షేమింగ్ కారణంగా తిరస్కరించబడిన మహిళలందరికీ నేను ప్రేరణ’ అంటోంది. మోడల్ అవ్వాలంటే స్లిమ్‌గా ఉండడమే కాదు శరీరం కొన్ని కొలతల్లో ఇమిడిపోవాలి. చూపులను ఆకట్టుకునే రూపం సొంతమై ఉండాలి. ర్యాంప్ వేదికలపై సొగసుగా అడుగులు వేయడం రావాలి... అయితే ఇవేవీ అవసరం లేదంటోంది ఇందూజ ప్రకాష్. 27 సంవత్సరాల వయసులో మోడలింగ్‌ను వృత్తిగా మార్చుకొని ఊబకాయాన్ని ఎగతాళి చేసే వ్యక్తులకు తన రూపంతోనే సరైన సమాధానం ఇస్తోంది. నా తప్పుకాదు.. ‘‘ఊబకాయం ఉన్న మహిళల్ని, అమ్మాయిలను చాలా మంది గేలి చేస్తారు. ఊబకాయంగా ఉండటం అది వారి తప్పు కాదు. కానీ, ఎన్నో సమాజంలో ఎన్నో హేళనలు తట్టుకోవాలి. నా వరకే చూస్తే.. చిన్నప్పటి నుంచి అందరూ నన్ను ఆటపట్టించినవారే. ఎక్కడకు వెళ్లినా బరువు తగ్గమని సలహాలు ఇచ్చేవారే ఎక్కువయ్యారు. దీంతో చాలా సార్లు బరువు తగ్గటానికి ప్రయత్నించాను. కొన్నిరోజులు ఎక్కడకూ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. చాలా బాధగా అనిపించేది. తిండి తినకుండా అతిగా డైటింగ్ నియమాలు చాలా పాటించాను. ఆకలికి తట్టుకున్నాను. వ్యాయామాలు చేశాను. కానీ, బరువు తగ్గలేదు. విని విని విసుగిపోయాను. మా కుటుంబంలో ఊబకాయం వంశపారంపర్యంగా ఉంది. అది నాకూ వచ్చింది. లావుగా ఉండటం నా తప్పు కాదు’’ అని వివరించిన ఇందూజ సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసింది. లాక్డౌన్ సమయాన్ని ప్లస్ సైజ్ మోడల్‌గా మార్చుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడదే వృత్తిగా చేసుకుంది. ఊబకాయం సమస్య, మానసికంగా తను ఎదిగిన విధానం గురించి మరింతగా వివరిస్తూ ‘‘ఎంత శ్రమ చేసినా తగ్గడం లేదు అని నిర్ధారణకు వచ్చాక ఇక ఈ సమస్య గురించి ఆలోచించకూడదు అనుకున్నాను. అప్పుడు నా మనసు చాలా తేలికైనట్టనిపించింది. కేరళలో ప్లస్ సైజ్ మోడలింగ్ అంత సులభం కాదు. ఇక్కడి జనం స్లిమ్ సైజ్ వాళ్లే మోడలింగ్‌కి అర్హత గలవారు అనుకుంటారు. నిజానికి ఏ రాష్ట్రమైనా, ప్రాంతమైనా అంతటా అందరిలోనూ ఇదే అభిప్రాయం ఉంటుందని నాకు తెలుసు. కానీ, నేను ఇదే శరీరం తో జనాలను ఒప్పించాలి అని బలంగా అనుకున్నాను. బాడీ షేమింగ్ కారణంగా తిరస్కరించబడిన మహిళలందరికీ నేను ప్రేరణ కావాలనుకున్నాను. ప్లస్ సైజ్ మోడల్‌గా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నచ్చిన పనిని కొనసాగిస్తున్నాను. ఇతరుల కోసం నన్ను నేను మార్చుకోలేను’ అని తెలిపింది ఇందూజ. ఇందూజ ఇప్పుడు ఫొటోగ్రాఫర్స్, మేకప్ ఆర్టిస్టుల కోసం మోడలింగ్ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు మలయాళీ చిత్రాల్లోనూ నటించిన ఇందూజ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కృషి చేస్తోంది. -
చబ్బీ గర్ల్స్
చార్మింగ్ కాస్ట్యూమ్స్ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి ‘బాడీ’కీ ఓ ‘లెక్క’ ఉంటుంది. జీరో సైజ్‌లో ఉన్నవారే కాదు.. బొద్దుగుమ్మలు కూడా క్యాట్‌వాక్‌లతో అదరగొడుతున్నారు. అయితే స్లిమ్ అమ్మాయిలకి ఎలాంటి డ్రెస్ వేసినా అందంగానే ఉంటుంది. మరి బొద్దుగా ఉండేవారి మాటేంటి..! వారు డ్రెస్సింగ్ కేర్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇలాంటి వారి కోసం కొత్త సూత్రాలు చెబుతున్నారు సిటీ డిజైనర్లు. ప్రస్తుత సిటీ లైఫ్‌స్టైల్ వద్దంటున్నా... అమ్మాయిలను బొద్దుగా మార్చేస్తోంది. ఏ పార్టీకో, పెళ్లికో, పేరంటానికో వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. కాస్త లావుగా ఉన్నందుకు ఎందరు కామెంట్ చేస్తారోనని భయపడుతుంటారు. ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియక తికమక పడుతుంటారు. వీరు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఏ రంగులు వేసుకోవాలనే దానిపై డిజైనర్ల సూచనలు. డార్క్ కలర్స్ బెటర్.. మేని ఛాయ బంగారంలా మెరిసిపోయే ‘చబ్బీ గర్ల్స్’ ముదురు రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది. లేత రంగులైతే శరీరతత్వాన్ని బయటపెడతాయి. కాళ్లు కాస్త లావుగా ఉంటే డార్క్ కలర్ బోటం, లేత రంగు టాప్ ధరిస్తే బెటర్. కానీ టాప్స్ మాత్రం నడుము కింది భాగం వరకు ఉండేలా చూసుకుంటే మంచిది. చేతులు లావుగా ఉంటే స్లీవ్ లెస్‌లు, మెగా స్లీవ్లను కాకుండా ఎక్కువ శాతం త్రీఫోర్త్లను, ఫుల్ హాండ్స్ టాప్స్లనే ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. వేసుకునే డ్రెస్ లేదా చీరపై చిన్నచిన్న బొమ్మలు, పూలు ఉండేటట్టు చూసుకుంటే సన్నగా కనిపిస్తారు. పెద్ద పూలు, పెద్ద బొమ్మలున్నవి వేసుకుంటే మరింత లావుగా కనిపించే అవకాశం ఎక్కువంటున్నారు. ప్యాంట్, షర్ట్స్‌లో అయితే.. అడ్డ గీతల ప్యాంట్లు, షర్టులు, టాప్‌లు వేసుకుంటే ఉన్న దానికంటే ఇంకా లావుగా కనిపిస్తారు. అలాంటప్పుడు నిలువు గీతల కాస్ట్యూమ్స్ చాలా బాగా నప్పుతాయి. ఇవి సన్నగా పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. కాస్త ట్రెండీగా కనపడాలనుకునే చబ్బీస్.. మార్కెట్లో ఎన్నో రకాల నెట్టెడ్ అండ్ స్పన్ ష్రగ్స్ లేదా ఓవర్ కోట్స్ చాలానే దొరుకుతున్నాయి. వాటిని టాప్ మీద ధరిస్తే బాగుంటుంది. కాస్ట్యూమ్స్ మాత్రమే కాకుండా, పెద్ద ఇయర్ టాప్స్, స్లిమ్ హ్యాండ్ బ్యాగ్, ఎత్తుని బట్టి అందమైన సాండల్స్‌తో పాటు లైట్ మేకప్ వేసుకుంటే చాలు.. లుక్ మారిపోతుంది. దీనికి కాస్త కాన్ఫిడెన్స్‌ను కూడా అద్దితే టోటల్‌గా లుక్కే మారిపోతుందని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్లు ప్రియ, రూప. -
ప్లస్ సైజా..? పర్లేదు లెండి!!
♦ ‘లర్జోసా’లో ప్లస్సైజు మహిళలకు ప్రత్యేక దుస్తులు ♦ పుణెలో ఆఫ్‌లైన్ స్టోర్లు; దీపావళికల్లా బెంగళూరు, హైదరాబాద్‌కు ♦ నవంబర్ నుంచి యూకే, యూరప్‌లకు; అమెజాన్‌తో ఒప్పందం ♦ ‘స్టార్టప్ డైరీ’తో లర్జోసా కో–ఫౌండర్ అభిజిత్ జాదవ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైజ్ జీరో కోసం ఓ సినిమాలో హీరోయిన్ పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. నిజ జీవితంలోనూ ఇలాంటి చిత్రాలు సహజమే!! వీటిల్లో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని కావట్లేదు. మరి, లావెక్కువ ఉన్నవాళ్లు అందంగా కనిపించాలంటే? అసలు వారికి సరిపడా దుస్తులు దొరకడమెలా? ఇందుకు మీమున్నామంటోంది.. లర్జోసా.కామ్! ఇందులో దుస్తుల సైజులు ప్రారంభమయ్యేదే డబల్ ఎక్స్ఎల్ నుంచే. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్ అభిజిత్ జాదవ్ మాటల్లోనే.. నా భార్య ననీత కాస్త లావు. షాపింగ్కెళ్లిన ప్రతిసారి తనకి సరిపడా దుస్తులు దొరికేవి కావు. ప్రతిదీ ఆన్లైన్లో కొనే అవకాశమున్న ఈ రోజుల్లో.. ప్లస్ సైజ్ దుస్తుల కోసం ఎందుకు ఇబ్బంది పడాలా అనిపించింది? దీన్నే వ్యాపారంగా మార్చుకుంటే సరిపోతుందని రూ.50 లక్షల పెట్టుబడితో పుణె వేదికగా లర్జోసా.కామ్‌ను ప్రారంభించాం. పాశ్చాత్య, సంప్రదాయ దుస్తులతో పాటు లోదుస్తులూ ఉంటాయిక్కడ. లార్జోసాలో 2 ఎక్స్ఎల్ నుంచి మొదలై 7 ఎక్స్ఎల్ సైజుల వరకు దుస్తులుంటాయి. ఆపైన సైజు దుస్తులు కావాలంటే కస్టమైజ్‌గా లభిస్తాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ.. లర్జోసా బ్రాండ్ దుస్తుల్ని ఆన్లైన్లో నేరుగా లర్జోసా.కామ్ నుంచి గానీ... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌లో గానీ కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే ప్రస్తుతానికి ఫ్రాంచైజీ విధానంలో పుణెలో 5 స్టోర్లను ఏర్పాటు చేశాం. దీపావళి నాటికి బెంగళూరు, హైదరాబాద్‌లో 4 స్టోర్లను ప్రారంభించనున్నాం. దుస్తుల తయారీ కోసం జైపూర్, ముంబై, పుణెలో కేంద్రాలున్నాయి. ఇక్కడి నుంచే దేశమంతా డెలివరీ చేస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలకు డెలివరీ కోసం ఏడాదిలో బెంగళూరులో 2 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. దక్షిణాది వాటా 40%..: ప్రస్తుతం 50 వేల రిజిస్టర్డ్ కస్టమర్లున్నారు. నెలకు 200 జతల ఆర్డర్లొస్తున్నాయి. కనిష్ట ఆర్డర్ విలువ రూ.1,200. ప్రతి నెలా వ్యాపారం 20 శాతం వృద్ధి చెందుతోంది. మా వ్యాపారంలో 40% వాటా దక్షిణాదిదే. వచ్చే ఏడాది సొంత స్టోర్లు..: ప్రస్తుతం మా సంస్థలో 65 మంది ఉద్యోగులున్నారు. నవంబర్ నాటికి యూకే, యూరప్ దేశాలకు విస్తరించాలని లక్ష్యించాం. ఇందుకోసం అమెజాన్‌తో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో నేరుగా లర్జోసా పేరిట సొంత స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...