ప్లస్‌ సైజా..? పర్లేదు లెండి!! | Fashion for plus-size people turned into big business now | Sakshi
Sakshi News home page

ప్లస్‌ సైజా..? పర్లేదు లెండి!!

Published Sat, Jul 22 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

ప్లస్‌ సైజా..? పర్లేదు లెండి!!

ప్లస్‌ సైజా..? పర్లేదు లెండి!!

‘లర్జోసా’లో ప్లస్‌సైజు మహిళలకు ప్రత్యేక దుస్తులు
పుణెలో ఆఫ్‌లైన్‌ స్టోర్లు; దీపావళికల్లా బెంగళూరు, హైదరాబాద్‌కు
నవంబర్‌ నుంచి యూకే, యూరప్‌లకు; అమెజాన్‌తో ఒప్పందం
‘స్టార్టప్‌ డైరీ’తో లర్జోసా కో–ఫౌండర్‌ అభిజిత్‌ జాదవ్‌
 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సైజ్‌ జీరో కోసం ఓ సినిమాలో హీరోయిన్‌ పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. నిజ జీవితంలోనూ ఇలాంటి చిత్రాలు సహజమే!! వీటిల్లో కొన్ని సక్సెస్‌ అయితే మరికొన్ని కావట్లేదు. మరి, లావెక్కువ ఉన్నవాళ్లు అందంగా కనిపించాలంటే? అసలు వారికి సరిపడా దుస్తులు దొరకడమెలా? ఇందుకు మీమున్నామంటోంది.. లర్జోసా.కామ్‌! ఇందులో దుస్తుల సైజులు ప్రారంభమయ్యేదే డబల్‌ ఎక్స్‌ఎల్‌ నుంచే. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ అభిజిత్‌ జాదవ్‌ మాటల్లోనే..

నా భార్య ననీత కాస్త లావు. షాపింగ్‌కెళ్లిన ప్రతిసారి తనకి సరిపడా దుస్తులు దొరికేవి కావు. ప్రతిదీ ఆన్‌లైన్లో కొనే అవకాశమున్న ఈ రోజుల్లో.. ప్లస్‌ సైజ్‌ దుస్తుల కోసం ఎందుకు ఇబ్బంది పడాలా అనిపించింది? దీన్నే వ్యాపారంగా మార్చుకుంటే సరిపోతుందని రూ.50 లక్షల పెట్టుబడితో పుణె వేదికగా లర్జోసా.కామ్‌ను ప్రారంభించాం. పాశ్చాత్య, సంప్రదాయ దుస్తులతో పాటు లోదుస్తులూ ఉంటాయిక్కడ. లార్జోసాలో 2 ఎక్స్‌ఎల్‌ నుంచి మొదలై 7 ఎక్స్‌ఎల్‌ సైజుల వరకు దుస్తులుంటాయి. ఆపైన సైజు దుస్తులు కావాలంటే కస్టమైజ్‌గా లభిస్తాయి.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ..
లర్జోసా బ్రాండ్‌ దుస్తుల్ని ఆన్‌లైన్‌లో నేరుగా లర్జోసా.కామ్‌ నుంచి గానీ... ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్‌లో గానీ కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో అయితే ప్రస్తుతానికి ఫ్రాంచైజీ విధానంలో పుణెలో 5 స్టోర్లను ఏర్పాటు చేశాం. దీపావళి నాటికి బెంగళూరు, హైదరాబాద్‌లో 4 స్టోర్లను ప్రారంభించనున్నాం. దుస్తుల తయారీ కోసం జైపూర్, ముంబై, పుణెలో కేంద్రాలున్నాయి. ఇక్కడి నుంచే దేశమంతా డెలివరీ చేస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాలకు డెలివరీ కోసం ఏడాదిలో బెంగళూరులో 2 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం.

దక్షిణాది వాటా 40%..: ప్రస్తుతం 50 వేల రిజిస్టర్డ్‌ కస్టమర్లున్నారు. నెలకు 200 జతల ఆర్డర్లొస్తున్నాయి. కనిష్ట ఆర్డర్‌ విలువ రూ.1,200. ప్రతి నెలా వ్యాపారం 20 శాతం వృద్ధి చెందుతోంది. మా వ్యాపారంలో 40% వాటా దక్షిణాదిదే.

వచ్చే ఏడాది సొంత స్టోర్లు..: ప్రస్తుతం మా సంస్థలో 65 మంది ఉద్యోగులున్నారు. నవంబర్‌ నాటికి యూకే, యూరప్‌ దేశాలకు విస్తరించాలని లక్ష్యించాం. ఇందుకోసం అమెజాన్‌తో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో నేరుగా లర్జోసా పేరిట సొంత స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్‌ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement