అందం అంటే నాజుగ్గా, శిల్పంలా ఉండటమే కాదని ప్రూవ్ చేసిందామె. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం ఉంటే..ప్లస్ సైజులో ఉన్నా బ్యూటీగా గెలవొచ్చని చాటి చెప్పింది. అందం అంటే ఆకృతికి సంబంధించింది కాదని మానసిక సౌందర్యమే నిజమైన అందమని తెలియజెప్పింది. అంతేగాదు బాడీ షేమర్ల చెంపచెళ్లుమనేలా అందాల పోటీల్లో గెలిచి చూపించింది.
సోషల్ మీడియా, సినిమాల పుణ్యామా అని అందం మీద మోజు ఎక్కువయ్యింది. కేవలం నాజుగ్గా, చెక్కిన శిల్పంలా ఉంటేనే అందం అన్నట్లుగా భావిస్తున్నారు చాలామంది. ఆఖరికి రంగు విషయంలో కూడా అవహేళనలే. తెల్ల తోలు ఉన్న వాళ్లు తప్ప మిగతా వాళ్లెవరూ కంటికి ఆనరు అనేంతగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ముఖ్యంగా యువతలో ఇది మరీ ఎక్కువగా ఉంది. దీంతో జన్యు పరంగానో లేదా అనారోగ్య కారణాల వల్లనో లావుగా ఉన్నవాళ్లు సమాజం నుంచి పలు చిత్కారాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అవమానాలనే ఎదుర్కొంది సారా మిల్లికెన్.
సారా మెంటల్ హెల్త్ లాయర్(మానసిక ఆరోగ్య న్యాయవాది). చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు బాడీ షేమింగ్‌కి గురయ్యింది. సోషల్‌మీడియాలో కూడా తన ఆకృతి విషయమై ట్రోల్స్ బారిన పడింది. అయినా సరే తనలాంటి వాళ్లు కూడా అందాల పోటీల్లో విజేతలవ్వగలరు అని చెప్పాలన్న సంకల్పంతో మిస్ అలబామా అందాల పోటీల్లో పాల్గొంది. రెండు సార్లు కిరీటం కోసం పోటీపడి త్రుటిలో చేజారిపోయింది. ఆ టైంలో కూడా ఆమె విశ్వాసాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ఎదుర్కొంది. దీంతో మళ్లీ ఈ పోటీల్లో పాల్గొనకూడదు అని వెనక్కి వచ్చేసింది. అలా ఏడేళ్ల పాటు ర్యాపింగ్‌కి దూరంగా ఉంది.
మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనకపోవడం అంటే..ఆ వ్యక్తి అన్న మాటను తాను అంగీకరించి వచ్చేసినట్లే కదా అన్న బాధ వెంటాడింది సారాని. తనలో ఎలాగైన ఆ అవహేళనలు, బాడీ షేమర్లను తిప్పికొట్టేలా ఈ పోటీల్లో గెలవాలన్న కసి పెరిగింది. ఆ పట్టుదలే సారాని మిస్ అలబామా 2024లో కిరీటాన్ని దక్కించుకునేలా చేసింది. అంతేగాదు ఆ వేదికపైనే తన ఆకృతి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. విరుచుకుపడింది. తన గెలుపుతో హేళన చేసే వారి చెంప చెళ్లుమనిపించేలా చేసింది. అంతేగాదు దయచేసి ఎవ్వరూ మరొకరి శరీరాన్ని అగౌరవపరచొద్దు, మానసిక సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వండి అని కోరింది సారా.
మహిళలు మనసు పెట్టి సాధించాలనుకుంటే కచ్చితంగా సాధించగలరని సోషల్ మీడియా వేదికగా తనలాంటి వాళ్లను మోటీవేట్ చేస్తుంటుంది సారా. అంతేగాదు సోషల్ మీడీయా ట్రోల్స్‌కి చాలా వ్యూహాత్మకంగా కౌంటర్లు ఇచ్చేది. దీంతో సారాకు అనూహ్యంగా వేలాది మంది నెటిజన్ల మద్దతు లభించేది. అదే ఆమెకు ఎక్కవ మంది ఫాలోవర్స్‌ని తెచ్చిపెట్టింది. అంతేగాదు ఇలా ఆన్‌లైన్‌లో టైప్ చేసే బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ప్రజల్లో అనుచిత ముద్ర వేస్తాయంటూ.. అంటించే చురకలు అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చేలా చేసింది. ఈ వైఖరే సారానీ మిస్ అలబామాగా అందాల పోటీలో విజేతగా నిలబెట్టింది. ఇప్పుడామెకు ఈ విజయానికి గానూ సోషల్ మీడియా నుంచి వేలాదిగా ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి.
(చదవండి: వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత)
Comments
Please login to add a commentAdd a comment