భుజాలు దాటని జుట్టు ఫ్యాషనై చాలా కాలమయ్యింది. గాలికి వయ్యారంగా ఎగిరే ముంగురులను ఎగదోసుకుంటూ తిరగడం ఇప్పుడు ఫ్యాషన్. మంచి జుత్తు ఉన్నా, దాన్ని పెంచి పోషించే ఆసక్తి ఇప్పటి అమ్మాయిలకు లేదు. కానీ చైనాలోని హాంగ్లువో గ్రామంలోని అమ్మాయిలు అలా కాదు. పొడవాటి కురులే తమకు అందమంటారు. పొందికగా కొప్పులు వేసి తమ గొప్పను చాటుతుంటారు.
హాంగ్లువో యువతులు జుత్తు కత్తిరించరు. అది వారి సంప్రదాయం. పెరిగినంత మేర పెరగనిస్తారే తప్ప కత్తెర కురులను తాకనివ్వరు. అందుకే అక్కడ ప్రతి అమ్మాయీ పొడవాటి కురులతో కనిపిస్తుంది. రెండు మీటర్ల పొడవైన జుత్తు ఉన్న అమ్మాయిలు వందకు పైనే ఉన్నారా ఊరిలో. వీరికి తలస్నానాలు చేయడం ఓ పెద్ద సమస్య. అందుకే వారానికి ఒకట్రెండుసార్లు ఊరి పొలిమేరలో ఉన్న చెరువు దగ్గరకు పోయి, మూకుమ్మడిగా తలలు అంటుకుంటారు.
ఒకప్పుడు హాంగ్లువో మగువల కురులను భర్త తప్ప ఎవరూ చూడకూడదనే నియమం ఉండేది. అయితే అతడు కూడా కేవలం పెళ్లిరోజునే చూడాలి. అందుకే స్త్రీలంతా తలలకు నీలిరంగు గుడ్డను చుట్టుకునేవారు. పరాయి పురుషుడు కనుక ఏ స్త్రీ జుత్తయినా చూస్తే, అతడు మూడేళ్లపాటు వారి ఇంట్లో బందీగా ఉండాల్సి వచ్చేది. అయితే రోజులు మారాక ఈ నియమం పోయింది. గుడ్డను తీసేసి కురులను కొప్పుగా ముడుచుకునే సంప్రదాయం వచ్చింది. జుత్తును పొడవుగా వేళ్లాడేసుకోకుండా చుట్టలా చుట్టి అందరూ ఒకే విధంగా కొప్పు పెట్టుకుంటారు. దుస్తులు కూడా ఒకలాంటివే వేసుకుంటారేమో... కొత్తవాళ్లు వెళితే అందరూ ఒకేలా కనిపించి కన్‌ఫ్యూజ్ అవుతుంటారు!
ఆదమరిస్తే... అంతే సంగతులు!
విమానం ఆకాశంలో ఎగిరితే చూడ్డానికి సరదాగా చూస్తాం. అదే మన నెత్తిమీద ఎగిరితే...! విమానం మన నెత్తిమీద ఎగిరేంత కిందికి ఎందుకొస్తుంది, పిచ్చి ప్రశ్న కాకపోతే... అనుకోకండి. కరీబియన్ దీవుల్లో ఒకటైన సెయింట్ మార్టిన్ దీవిలో అలా జరుగు తుంది మరి!
సెయింట్ మార్టిన్ జనాభా ఎనభై వేలకు మించదు. ఈ దీవిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది మాహో బీచ్ గురించి. ఈ బీచ్‌లో ఉన్న వారి మీదకు విమానాలు దూసుకొస్తూ ఉంటాయి. అంటే, అంత కింద ఎగురు తాయన్నమాట! కొత్తగా వెళ్లినవాళ్లు విమానం కూలిపోతూ మీదికి దూసుకొస్తోందని అనుకుంటారు. కానీ అది కాదు అసలు విషయం.
జూలియానా ఎయిర్‌పోర్టు చిన్నగా ఉంటుంది. అతి చిన్న రన్‌వే కావడంతో అక్కడికి వచ్చి ఎత్తును తగ్గించడానికి ఉండదు. కాబట్టి సముద్రం మీద ఉండగానే విమానాన్ని కిందకు దించడం మొదలుపెడతారు పెలైట్లు. బీచ్ పక్కనే రన్‌వే ఉండటంతో, అక్కడికి వచ్చేసరికి విమానం బాగా కిందకు దిగుతుంది. అప్రమత్తంగా లేకపోతే తగిలేయడం ఖాయం. అందుకే బీచ్ నిండా ప్రమాద హెచ్చరికలుంటాయి. అనౌన్స్‌మెంట్లు వినిపిస్తాయి. కాబట్టి ప్రమాదాలు జరగవు. ఇంకా చెప్పాలంటే, ఆ అనుభవాన్ని సొంతం చేసుకోవడానికే కొందరు ఆ బీచ్‌కి వెళ్తుంటారు!
విడ్డూరం: ఊరినిండా కొప్పుల కుప్పలే!
Published Sun, Sep 15 2013 2:35 AM | Last Updated on Wed, Aug 1 2018 2:26 PM
Advertisement