THAMBALLAPALLE constituency
-
అన్నీ హామీలై..
బి.కొత్తకోట: చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో నాలుగు సార్లు పర్యటించారు. అన్నిసార్లూ హామీలు గుప్పించారు. అసలే కరువు ప్రాంతం.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితుల్లో హామీలపై ఇక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆచరణలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. తొలిసారి 2014 నవంబర్ 5న కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన జన్మభూమి– మాఊరు సభలో, 2015 ఫిబ్రవరి 19న బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పెద్దచెరువులో జరిగిన నీరు– చెట్టు ప్రారంభోత్సవ సభలో, 2015 మే 7న కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన రైతు సదస్సులో, 2016లో కురబలకోట మండలం ముదివేడులో జరిగిన పంట సంజీవని పనుల పరిశీలన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. రైతు సదస్సు జరిగిన మరుసటి రోజు జరిగిన విలేకరుల సమావేశంలోనూ హామీల వరద పారించారు. ఈ హామీలన్నీ హామీల స్థాయిలోనే ఆగిపోయాయి. సీఎం ఇచ్చిన హామీలను పరిశీలిస్తే.. ► 2015 వర్షాకాలంలోగా హంద్రీ–నీవా జలాలను తంబళ్లపల్లె నియోజకవర్గానికి రప్పిస్తామని ప్రకటించారు. రెండు వర్షాకాలాలు ముగిసినా నీరు పారలేదు. ► జిల్లాలో రోజుకు 22 లక్షల లీటర్ల పాలను రైతులు ఉత్పత్తి చేస్తున్నారని, దీన్ని 50 లక్షల లీటర్లకు పెంచేలా ప్రణాళిక అమలు చేస్తానన్నారు. ► కరువు పరిస్థితులతో రైతులు పశుగ్రాసం కొరత ఎదుర్కొంటున్నారని, ఈ కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలోనూ ఊరి వెలుపల 400 నుంచి 500 పశువులకు వసతులు కల్పించే హాస్టల్స్ నిర్మిస్తామని చెప్పారు. ఇందులోని పశువుల కోసం 50 నుంచి 60 ఎకరాల్లో సామూహికంగా పశుగ్రాసం సాగుచేసి వాటికి అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ► పశువుల హాస్టల్స్‌లో లభించే పేడ, పంచితం (గోమూత్రం)తో బయోగ్యాస్ తయారు చేసి గ్రామంలోని కుటుంబాలకు సరఫరా చేస్తామన్నారు. పశువుల పేడతో ఎరువును తయారు చేసి విక్రయాలు సాగిస్తామన్నారు. ► జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్న కరువు ప్యాకేజీని ఇక్కడా అమలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. కరువు జిల్లాగా ప్రకటించక పోగా, అనంతపురం ప్యాకేజీని పట్టించుకోనేలేదు. ► పరిశ్రమలను ప్రోత్సహించేలా కర్ణాటకలోని బెంగళూరును కలి పేలా అనంతపురం జిల్లా మీదుగా తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు కలిసేలా రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. ► పడమటి మండలాలకు ప్రత్యేక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా ప్రతి కుటుంబానికి కొళాయిల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందిస్తామని చెప్పారు. హంద్రీ–నీవా కాలువ నీటిని దీనికి అనుసంధానిస్తామన్నారు. గ్రిడ్ పరిధిలోకి తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలను కలుపుతామని ప్రకటించారు. ► బి.కొత్తకోటలో డిగ్రీ కళాశాలను ప్రారంభించి, ఉద్యోగాలు లభించే సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులను ప్రారంభిస్తామని నమ్మబలికారు. ► కురబలకోటలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుకున్న బీటెక్, ఎంటెక్ విద్యార్థులు ఉద్యోగాలకోసం వలసపోకుండా స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేందుకు హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలను స్థాపిస్తామన్నారు. ► 100 రోజుల్లో లక్ష మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ► తంబళ్లపల్లె నియోజకవర్గ టమాట రైతుకు రూ.10కోట్ల ప్యాకేజీ అమలు చేస్తామన్నారు.. ఇవన్నీ హామీలుగానే మిగిలిపోయాయి. -
వైఎస్ఆర్ సీపీలోకి టీడీపీ నాయకులు
సోంపల్లికి చెందిన 15 కుటుంబాలు ములకలచెరువు: మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం వైఎస్ఆర్ సీపీలో చేరారు. మండలంలోని సోంపల్లికి చెందిన సుమారు 15 కుటుంబాలు తంబళ్లపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ద్వారకనాథ్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో తమకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. వైఎస్ఆర్ సీపీ, పెద్దిరెడ్డి కుటుంబంపై ఉన్న నమ్మకంతో పార్టీలో చేరుతున్నామని తెలిపారు. వీరిలో ఖాసిమ్సాబ్, సిరాజ్, కరీముల్లా, మున్వర్, రఫీ, మహబూబ్‌బాషా, ఫిరోజ్, బషీర్, రసూల్, బావాజాన్, సాజన్, కాలేషా, ఫకృద్ధీన్. నౌషాద్, బాదుల్లా, సయ్యద్ బాదుల్లా తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సదాశివ, శ్రీనివాసులు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరు పొమ్మంది ..ఊళ్లకు తాళం
⇒ కరువుదెబ్బకు పల్లెలు వదిలి నగరాలకు వలస ⇒ తంబళ్లపల్లె నియోజకవర్గంలో దీన పరిస్థితులు ⇒ పల్లెల్లో నిర్మానుష్యం.. తాళం పడిన ఇళ్లే దర్శనం ⇒ అపహాస్యం చేస్తున్న ఉపాధి హామీ పథకం తంబళ్లపల్లె నియోజకవర్గంలో పల్లెలకు పల్లెలే వలసబాట పడుతున్నాయి. ఒకప్పుడు బాగాబతికిన కుటుంబాలు కూడా బతుకుదెరువు కోసం మూటాముల్లె సర్దుకుని నగరాలకు వెళ్లిపోతున్నాయి. 2015 నవంబర్‌లో కురిసిన వర్షానికి పంటలు పండి కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఎడారిని తలపిస్తున్నాయి. నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తున్న పల్లెలు కన్నీటి కథలే చెబుతున్నాయి. వర్షాభావంతో భూగర్భ జలాలు పడిపోయాయి. పంటలసాగు పూర్తిగా కనుమరుగైపోయింది. రైతులు, కూలీలకు పనిలేకుండాపోయింది. కష్టం చేయలేని ముసలివారిని, కడుపున పుట్టిన చిన్నపిల్లలను ఇంటికి కాపలాపెట్టి ఊరుగాని ఊరు వెళ్లిపోతున్నారు. అష్టకష్టాలు పడుతూ జీవితాల్ని నెట్టుకొస్తున్నారు. బి.కొత్తకోట: నియోజకవర్గంలోని బి.కొత్తకోట, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు మండలాల్లో కరువు కరాళనృత్యం చేస్తోంది. చేసేదానికి పనిలేక పొట్టచేతబట్టుకుని పలువురు వలసబాటపడుతున్నారు. ఒకప్పుడు బాగాబతికిన కుటుంబాలూ దినసరి కూలీలుగా చేరేందుకు పట్టణాలకు వెళ్లిపోతున్నాయి. ఇళ్లకు ముసలివారు కాపలాదారులవుతున్నారు. బెంగళూరు, కేరళ, గోవా, తిరుపతి, హైదరాబాద్, ముంబై నగరాలకు వెళ్లిపోతున్నారు. భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా, ఫ్యాక్టరీలు, ఏటీఎం కేంద్రాల్లో వాచ్మెన్లుగా కాలం వెళ్లదీస్తున్నారు. రోడ్లమీద పానీపూరి అమ్ముకుంటూ కొందరు, ఫుట్‌పాత్ వ్యాపారం చేసుకుంటూ మరికొందరు నెట్టుకొస్తున్నారు. గ్రామాలు ‘ఖాళీ’ బీరంగి, మొటుకు, బడికాయలపల్లె, గుమ్మసముద్రం, బురకాయలకోట, మద్దినాయునిపల్లె, చౌడసముద్రం, సోంపల్లె, నాయునిచెరువుపల్లె, గూడుపల్లె, కాలువపల్లె, రామానాయక్ తాండా, బండకింద తాండా, కుడుమువారిపల్లె, వడ్డివంకతాండా, మందలవారిపల్లె, ముదివేడు, కనసానివారిపల్లె, సిద్దారెడ్డిగారిపల్లె, తుమ్మచెట్లపల్లె, భద్రయ్యగారిపల్లె, గుట్టమీద సాయిబులపల్లె, పట్టెంవాండ్లపల్లె, మడుమూరు, సంపతికోట, దేవప్పకోట, బురుజుపల్లె, కాట్నగల్లు, బూచి పల్లె, మద్దయ్యగారిపల్లె, తుమ్మరకుంట, కందుకూరు, టీ.సదుం, గోపిదిన్నె, కన్నెమడుగు, ఎర్రసానిపల్లె, కోటకొండ, కోటాల, ఆర్‌ఎన్‌తాండా, తంబళ్లపల్లె, దిన్నిమీదపల్లె పంచాయతీల్లో అధిక కుటుంబాలు వలసలు వెళ్లాయి. 47కు 32 కుటుంబాలు వలస కురబలకోట మండలంలోని తుమ్మచెట్లపల్లెలో 47 కుటుంబాలున్నాయి. ఇక్కడి జనాభా 282 మంది. 32 కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ కుటుంబాలకు చెందిన వ్యక్తులు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూలి పనులు చేస్తున్నారు. కేబుల్ వేసేందుకు గుంతలు తవ్వడం వీరి పని. వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఇళ్లవద్దే ఉంటున్నారు. పెద్దలకు డబ్బులు చేతికందాక ఇంటికి వచ్చి కొన్నిరోజులుండి మళ్లీ పనుల కోసం వలసలు వెళ్తారు. ఏడాదిగా ఉపాధి జాడలేదు ఈ పల్లెల్లో జాబ్‌కార్డులు 132 ఉన్నాయి. ఇక్కడ ఏడాదిగా ఉపాధి జాడలేదు పెద్దమండ్యం మండలం సీ.గొల్లపల్లె పంచాయతీకి చెందిన కుడుములవారిపల్లెలో 54 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 11 కుటుంబాలు పూర్తిగా పల్లె వదిలి బెంగళూరుకు వలస వెళ్లాయి. ఇళ్లకు తాళాలు వేయడంతో గృహాలకు ఆలనాపాలనా లేక దుస్థితికి చేరాయి. ఈ పల్లెలో 96 జాబ్‌కార్డులు, 140 మంది కూలీలు ఉన్నారు. ఏడాదిగా ఒక్క ఉపాధి పనినీ మంజూరు కాలేదు. ఇక్కడ క్షేత్ర సహాయకుడి పోస్టు ఖాళీగా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. కుటుంబాలకు కుటుంబాలే వలసలు వెళ్తున్నాయి. బి.కొత్తకోటలో మరీ అధ్వానం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జాబ్‌కార్డులు కలిగిన కూలీలు 62,461 మంది ఉన్నారు. వీరిలో అధికారులు ఉపాధి పనులు కల్పిస్తున్నది 15,749 మంది కూలీలకు మాత్రమే. ఇందులోనూ ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యంత దారుణంగా పనులు కల్పించింది బి.కొత్తకోట మండలంలోనే. ఇక్కడ 11,759 జాబ్‌కార్డులు కలిగిన కూలీలుంటే పనులు చేస్తున్నది 2,027 మంది కూలీలే. చేసేదానికి పనిలేక నగరాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కూలీలుగా మార్చేసింది పెద్దతిప్పసముద్రం పాత మండలం వీధికి చెందిన బడికాయలపల్లె ఖాదర్‌సాబ్(70)కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయమే ఆధారం. నాలుగు ఎకరాల పొలం ఉంది. సేద్యం చేసేందుకు మూడు బోర్లు వేయించాడు. చుక్కనీరు పడకపోగా అప్పులు మిగిలాయి. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. బతుకుదెరువు కరువైంది. ఇద్దరు కొడుకులు బెంగళూరుకు వలసవెళ్లారు. పెద్ద కొడుకు మహబూబ్‌పీర్ తోపుడు బండిపై టీ అమ్ముతున్నాడు. చిన్నకొడుకు షఫీసాబ్ భవన నిర్మాణ కార్మికుడిగా ఉన్నాడు. వీరి సంపాదనతోనే కుటుంబం గడిచే పరిస్థితి. షఫీసాబ్ ముగ్గురు కుమార్తెలు, కుమారుడు, భార్య పీటీఎంలోనే ఉంటున్నారు. షఫీసాబ్ కూలి చేస్తే వచ్చే మొత్తంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము ఇంటికి పంపిస్తున్నాడు. భర్త బెంగళూరు వెళ్లడంతో ఇక్కడ బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడం కష్టంగా ఉందని భార్య షాహీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
బాబువన్నీ మాటలేనా!
బి.కొత్తకోట: ‘తంబళ్లపల్లె నియోజకవర్గం కరువు, వెనుకబాటుతనం, పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. ఇంతకాలం పెత్తందారి వ్యవస్థలో నలిగిపోయింది. ఇక్కడ అవసరమైన అభివృద్ధి చేస్తా. తాగునీటి సమస్యను తీరుస్తాన’నని బుధవారం అంగళ్లులో జరిగిన జన్మభూ మి సభలో చంద్రబాబు ప్రకటించారు. అయితే ఏం చేయబోతున్నారో ఒక్క మాటైనా చెప్పలేదు. అభివృద్ధిపై ఆశలు పెంచుకున్న నియోజవర్గ ప్రజల్లో నిరాశను మిగిల్చారు. ఎన్నో సమస్యలున్నా వాటి ప్రస్థావన లేదు. సభలో నియోజకవర్గానికి చంద్రబాబు ఇచ్చింది ఐదు హామీలు. బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిని 30 పడకల స్థాయికి పెంచడం, బి.కొత్తకోటకు డిగ్రీ కళాశాల, టమాట రైతులకు ప్యాకేజీ, కురబలకోట ఆస్పత్రి అభివృద్ధి, రూ.50 కోట్లతో రోడ్ల అభివృద్ధి. బి.కొత్తకోట డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 ఏప్రిల్‌లో హామీ ఇచ్చారు. దీనిపై చర్యలు సైతం ప్రారంభమయ్యాయి. తర్వాత రాష్ట్ర విభజన కారణంగా చర్యలు ఆగిపోయాయి. ఇదే హామీని చంద్రబాబు తిరిగి ఇచ్చారు. ఇక 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు కోసం చంద్రబాబు 1995-2003 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రతిపాదనలున్నాయి. దీనికీ హామీ ఇచ్చారు. కొత్తగా రూ.50 కోట్లతో రోడ్లు, కురబలకోట ఆస్పత్రి అభివృద్ధికి హామీ ఇవ్వడం మినహా చేసిందేమీలేదు. తంబ ళ్లపల్లె పరిస్థితులపై జాలిపడిన చంద్రబాబు అందుకు తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళిక ప్రకటించలేకపోయారు. సమస్యలపై మాటేలేదు.. నియోజకవర్గంలోని తీవ్ర సమస్యలను కనీసం ప్రస్తావించలేదు. బి.కొత్తకోటలో ఆర్టీసీ డిపో, బస్టాండ్ ఏర్పాటు, తంబళ్లపల్లెకు విద్యుత్‌సబ్‌స్టేషన్, సరిహద్దు రహదారుల అభివృద్ధి, హార్సిలీహిల్స్ అభివృద్ధి, కురబలకోట చింతపండుకు మార్కెటింగ్, హంద్రీ-నీవా కోసం భూ ములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ, బి.కొత్తకోట బైపాస్‌రోడ్డు, గట్లమీదపల్లెలకు రహదారి, కురబలకోటకు ప్రభుత్వ కళాశాలలు, మదనపల్లెలో నడుస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, పెద్దేరు ప్రాజెక్టు కాలువల నిర్మాణం తదితరాలు ప్రస్తావించలేదు. రూ.50 కోట్లు ఏ మూలకు.. నియోజకవర్గంలోని సుమారు 600 పల్లెలకు రోడ్డు వసతి లేదని ఎమ్మెల్యే శంకర్ సభల్లో పదేపదే చెబుతుంటారు. వీట న్నింటికీ రోడ్లు వేయాలంటే రూ.50 కోట్లు సరిపోతాయా?. ప్రస్తుతం కిలోమీటరు రోడ్డుకు అయ్యే ఖర్చెంత, సీఎం ప్రకటించిన నిధులతో ఎన్నిపల్లెలకు రోడ్డువేయెచ్చో అంచనా వేయేచ్చు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ప్రజలకు రోడ్డు బాధలు ఇప్పట్లో తీరేలా లేవు.