బి.కొత్తకోట: చంద్రబాబునాయుడు సీఎం అయ్యాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో నాలుగు సార్లు పర్యటించారు. అన్నిసార్లూ హామీలు గుప్పించారు. అసలే కరువు ప్రాంతం.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితుల్లో హామీలపై ఇక్కడి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆచరణలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. తొలిసారి 2014 నవంబర్ 5న కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన జన్మభూమి– మాఊరు సభలో, 2015 ఫిబ్రవరి 19న బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పెద్దచెరువులో జరిగిన నీరు– చెట్టు ప్రారంభోత్సవ సభలో, 2015 మే 7న కురబలకోట మండలం అంగళ్లులో జరిగిన రైతు సదస్సులో, 2016లో కురబలకోట మండలం ముదివేడులో జరిగిన పంట సంజీవని పనుల పరిశీలన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు. రైతు సదస్సు జరిగిన మరుసటి రోజు జరిగిన విలేకరుల సమావేశంలోనూ హామీల వరద పారించారు. ఈ హామీలన్నీ హామీల స్థాయిలోనే ఆగిపోయాయి.
సీఎం ఇచ్చిన హామీలను పరిశీలిస్తే..
► 2015 వర్షాకాలంలోగా హంద్రీ–నీవా జలాలను తంబళ్లపల్లె నియోజకవర్గానికి రప్పిస్తామని ప్రకటించారు. రెండు వర్షాకాలాలు ముగిసినా నీరు పారలేదు.
► జిల్లాలో రోజుకు 22 లక్షల లీటర్ల పాలను రైతులు ఉత్పత్తి చేస్తున్నారని, దీన్ని 50 లక్షల లీటర్లకు పెంచేలా ప్రణాళిక అమలు చేస్తానన్నారు.
► కరువు పరిస్థితులతో రైతులు పశుగ్రాసం కొరత ఎదుర్కొంటున్నారని, ఈ కొరతను ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలోనూ ఊరి వెలుపల 400 నుంచి 500 పశువులకు వసతులు కల్పించే హాస్టల్స్ నిర్మిస్తామని చెప్పారు. ఇందులోని పశువుల కోసం 50 నుంచి 60 ఎకరాల్లో సామూహికంగా పశుగ్రాసం సాగుచేసి వాటికి అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
► పశువుల హాస్టల్స్‌లో లభించే పేడ, పంచితం (గోమూత్రం)తో బయోగ్యాస్ తయారు చేసి గ్రామంలోని కుటుంబాలకు సరఫరా చేస్తామన్నారు. పశువుల పేడతో ఎరువును తయారు చేసి విక్రయాలు సాగిస్తామన్నారు.
► జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అనంతపురం జిల్లాలో అమలు చేస్తున్న కరువు ప్యాకేజీని ఇక్కడా అమలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. కరువు జిల్లాగా ప్రకటించక పోగా, అనంతపురం ప్యాకేజీని పట్టించుకోనేలేదు.
► పరిశ్రమలను ప్రోత్సహించేలా కర్ణాటకలోని బెంగళూరును కలి పేలా అనంతపురం జిల్లా మీదుగా తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలు కలిసేలా రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు.
► పడమటి మండలాలకు ప్రత్యేక వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా ప్రతి కుటుంబానికి కొళాయిల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందిస్తామని చెప్పారు. హంద్రీ–నీవా కాలువ నీటిని దీనికి అనుసంధానిస్తామన్నారు. గ్రిడ్ పరిధిలోకి తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలను కలుపుతామని ప్రకటించారు.
► బి.కొత్తకోటలో డిగ్రీ కళాశాలను ప్రారంభించి, ఉద్యోగాలు లభించే సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులను ప్రారంభిస్తామని నమ్మబలికారు.
► కురబలకోటలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుకున్న బీటెక్, ఎంటెక్ విద్యార్థులు ఉద్యోగాలకోసం వలసపోకుండా స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేందుకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఐటీ సంస్థలను స్థాపిస్తామన్నారు.
► 100 రోజుల్లో లక్ష మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
► తంబళ్లపల్లె నియోజకవర్గ టమాట రైతుకు రూ.10కోట్ల ప్యాకేజీ అమలు చేస్తామన్నారు.. ఇవన్నీ హామీలుగానే మిగిలిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment