బాబువన్నీ మాటలేనా!
బి.కొత్తకోట: ‘తంబళ్లపల్లె నియోజకవర్గం కరువు, వెనుకబాటుతనం, పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. ఇంతకాలం పెత్తందారి వ్యవస్థలో నలిగిపోయింది. ఇక్కడ అవసరమైన అభివృద్ధి చేస్తా. తాగునీటి సమస్యను తీరుస్తాన’నని బుధవారం అంగళ్లులో జరిగిన జన్మభూ మి సభలో చంద్రబాబు ప్రకటించారు. అయితే ఏం చేయబోతున్నారో ఒక్క మాటైనా చెప్పలేదు. అభివృద్ధిపై ఆశలు పెంచుకున్న నియోజవర్గ ప్రజల్లో నిరాశను మిగిల్చారు. ఎన్నో సమస్యలున్నా వాటి ప్రస్థావన లేదు. సభలో నియోజకవర్గానికి చంద్రబాబు ఇచ్చింది ఐదు హామీలు. బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రిని 30 పడకల స్థాయికి పెంచడం, బి.కొత్తకోటకు డిగ్రీ కళాశాల, టమాట రైతులకు ప్యాకేజీ, కురబలకోట ఆస్పత్రి అభివృద్ధి, రూ.50 కోట్లతో రోడ్ల అభివృద్ధి. బి.కొత్తకోట డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2013 ఏప్రిల్‌లో హామీ ఇచ్చారు. దీనిపై చర్యలు సైతం ప్రారంభమయ్యాయి. తర్వాత రాష్ట్ర విభజన కారణంగా చర్యలు ఆగిపోయాయి. ఇదే హామీని చంద్రబాబు తిరిగి ఇచ్చారు. ఇక 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు కోసం చంద్రబాబు 1995-2003 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రతిపాదనలున్నాయి. దీనికీ హామీ ఇచ్చారు. కొత్తగా రూ.50 కోట్లతో రోడ్లు, కురబలకోట ఆస్పత్రి అభివృద్ధికి హామీ ఇవ్వడం మినహా చేసిందేమీలేదు. తంబ ళ్లపల్లె పరిస్థితులపై జాలిపడిన చంద్రబాబు అందుకు తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళిక
ప్రకటించలేకపోయారు. సమస్యలపై మాటేలేదు..
నియోజకవర్గంలోని తీవ్ర సమస్యలను కనీసం ప్రస్తావించలేదు. బి.కొత్తకోటలో ఆర్టీసీ డిపో, బస్టాండ్ ఏర్పాటు, తంబళ్లపల్లెకు విద్యుత్‌సబ్‌స్టేషన్, సరిహద్దు రహదారుల అభివృద్ధి, హార్సిలీహిల్స్ అభివృద్ధి, కురబలకోట చింతపండుకు మార్కెటింగ్, హంద్రీ-నీవా కోసం భూ ములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీ, బి.కొత్తకోట బైపాస్‌రోడ్డు, గట్లమీదపల్లెలకు రహదారి, కురబలకోటకు ప్రభుత్వ కళాశాలలు, మదనపల్లెలో నడుస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, పెద్దేరు ప్రాజెక్టు కాలువల నిర్మాణం తదితరాలు ప్రస్తావించలేదు.
రూ.50 కోట్లు ఏ మూలకు..
నియోజకవర్గంలోని సుమారు 600 పల్లెలకు రోడ్డు వసతి లేదని ఎమ్మెల్యే శంకర్ సభల్లో పదేపదే చెబుతుంటారు. వీట న్నింటికీ రోడ్లు వేయాలంటే రూ.50 కోట్లు సరిపోతాయా?. ప్రస్తుతం కిలోమీటరు రోడ్డుకు అయ్యే ఖర్చెంత, సీఎం ప్రకటించిన నిధులతో ఎన్నిపల్లెలకు రోడ్డువేయెచ్చో అంచనా వేయేచ్చు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో ప్రజలకు రోడ్డు బాధలు ఇప్పట్లో తీరేలా లేవు.