‘మూడింది!
► ‘ఉపాధి’ కల్పనలో దిగజారిన ‘అనంత’ స్థానం
► తొలి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన జిల్లా
► చివరి నిమిషంలో విశాఖ, విజయనగరం ముందంజ
► మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి
కూలీలకు ‘ఉపాధి’ కల్పనలో ‘అనంత’ స్థానం దిగజారిపోయింది. తొలి నుంచి రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన జిల్లా..ఈసారి మాత్రం మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) అధికారులు చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొదట్నుంచీ అల్లంత దూరంలో ఉన్న విశాఖపట్నం ఇప్పుడు నెంబర్‌వన్ అయ్యింది. విజయనగరం రెండోస్థానాన్ని దక్కించుకుంది.
అనంతపురం సెంట్రల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనుల కల్పనలో జిల్లా అధికారులు వెనుకబడిపోయారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా 93,611 కుటుంబాలకు మాత్రమే వందరోజుల పని కల్పించారు. ఇందుకోసం రూ.556 కోట్లు ఖర్చు చేశారు. పనులు పొందిన కుటుంబాల సంఖ్య తక్కువగా ఉండటంతో రాష్ట్రంలో ‘అనంత’ మూడోస్థానానికి పడిపోయింది. ఈ పథకం అమలుకు సంబంధించి ర్యాంకుల కేటాయింపునకు 100 రోజుల పని పొందిన కుటుంబాలను ప్రామాణికంగా తీసుకుంటారు.
విశాఖపట్నం జిల్లాలో రూ.475 కోట్లు ఖర్చు చేసి 1,05,512 కుటుంబాలకు, విజయనగరం జిల్లాలో రూ.482 కోట్లు ఖర్చు చేసి 99,460 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. దీంతో అవి మొదటి, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ రెండు జిల్లాలు నెల క్రితం మన జిల్లా కంటే పది వేల కుటుంబాలు వెనుకబడి ఉన్నాయి. అయితే.. చివరి నిమిషంలో ఎక్కువ మంది కూలీలు పనుల్లోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. నిధులు ఖర్చు చేయడంలో మాత్రం అనంతపురం జిల్లానే అగ్రస్థానంలో నిలవడం ఊరట కల్గించే అంశం.
చేజేతులా..
జిల్లాస్థానం పడిపోవడానికి అధికారులు తీసుకున్న నిర్ణయాలు, వారి నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మార్చి 26 నాటికి జిల్లాలో వంద రోజులు పూర్తి చేసుకోవడానికి మూడు రోజులు తక్కువ ఉన్న కుటుంబాలు 20వేల పైచిలుకు ఉన్నాయి. వీటిని ఆ మూడు రోజులు పనిలో పాల్గొనేలా చర్యలు తీసుకొని ఉంటే అగ్రస్థానానికి ఢోకా ఉండేది కాదు. ఈ విషయంలో అధికారులు విఫలమయ్యారు. ఉపాధిహామీ చట్టం ప్రకారం కూలీలు అడిగిన పని కల్పించాలి. జిల్లాలో మాత్రం ఫారంపాండ్లు చేపట్టాలని అధికారులు చెబుతున్నారు. కష్టతరమైన ఈ పనికి కూలీలు రావడం లేదు. ఎక్కువశాతం ఎర్రనేలలు ఉండటంతో మట్టిని తవ్వలేక ఇబ్బంది పడుతున్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కూలీలు అడిగిన పని మంజూరు చేస్తున్నారు. దీనివల్ల అవి ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకున్నాయి.
► జిల్లాలో జాబ్‌కార్డు పొందిన కుటుంబాలు : 7.87 లక్షలు
► పనులకు సక్రమంగా హాజరవుతున్న కూలీలు : 4.27 లక్షలు
► వందరోజుల పని కల్పించిన కుటుంబాలు : 93,611
► కూలీలపై ఖర్చు : రూ. 226 కోట్లు
► మొత్తం ఖర్చు : రూ. 556 కోట్లు