రోడ్డుపై బోల్తా పడిన ట్రాలీ ఆటో
సారంగాపూర్(జగిత్యాల): ఉపాధి హామీ కూలీలను తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తాపడిన సంఘటనలో 21 మంది గాయపడ్డారు. జగిత్యాల జిల్లా లక్ష్మీదేవిపల్లి–పెంబట్ల గ్రామాల మధ్య సోమవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలోని బుడిగెజంగాలకాలనీ, బీసీ కాలనీకి చెందిన కూలీలు కొద్దిరోజులుగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు.
సోమవారం ఉదయం పెంబట్ల–రంగపేట గ్రామాల మధ్య పెద్దమ్మ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పనులు నిర్వహించడానికి సుమారు 35 మంది గ్రామానికి చెందిన పార్తం గంగాధర్ ట్రాలీ ఆటోలో వెళ్లారు. పనులు ముగించుకుని ట్రాలీ ఆటోలో ఇళ్లకు బయల్దేరారు. ఆటో లక్ష్మీదేవిపల్లి గ్రామం దాటగానే ఓవర్‌లోడ్ కారణంగా కుదుపునకు గురికావడంతో డ్రైవర్ సడెన్‌గా బ్రేక్‌వేశాడు. దీంతో వేగంగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈసంఘటనలో 21 మంది కూలీలు గాయపడ్డారు.
సకాలంలో స్పందించిన పోలీసులు
సంఘటన విషయం తెలుసుకున్న సారంగాపూర్ ఎస్సై రాజయ్య 10 నిమిషాల్లో తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ వసంత, ఎంపీడీవో పుల్లయ్య పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment