ఉద్యోగినిపై ‘అధికార’ పెత్తనం
♦ ఎంపీడీఓపై కేసు ఉపసంహరించుకుంటే సరే...
♦ లేదంటే ఉన్న ఉద్యోగం ఊడుతుంది...
♦ టెక్నికల్ అసిస్టెంట్‌కు ఉన్నతాధికారి బెదిరింపులు
♦ ఆమేరకు సియూజీ సిమ్ కట్ చేసిన వైనం
సాక్షి ప్రతినిధి, కడప : ‘ఆడబిడ్డలకు అండగా ఉంటాం. విధి నిర్వహణలో మహిళా ఉద్యోగులపై వేధింపులు సహించం.’ ఇవన్నీ ప్రస్తుత పాలకులు చెప్పే మాటలు. వాస్తవంలో అందుకు విరుద్ధమెన పరిస్థితులు నెలకొన్నాయి. వేధింపులకు ఎదురేగి పోరాటం చేస్తే అండగా నిలవాల్సిన ఉన్నతాధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం ఊడుతుందని హెచ్చరికలు జారీచేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు..ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ఎం. మేరి ముద్దనూరులో విధులు నిర్వర్తిస్తున్నారు. ముద్దనూరు ఎంపీడీఓ మనోహర్‌రాజు వేధింపులు అధికమయ్యాయని ఆమె ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంది. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ మేరిపై అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా సరెండర్ చేయడం వెనుక అసలు వ్యవహారం ఏమిటో విచారణ చేపట్టాల్సిందిగా అడిషనల్‌పీడీ విజయ్‌కుమార్ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఏపీడీ మల్లేశ్వరరెడ్డిని నియమించారు. నివేదిక అనంతరం ఎంపీడీఓ సరెండర్‌ను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో ఎంపీడీఓ మనోహార్‌రాజు వేధింపులు భరించలేకున్నా, ఇక్కడి నుంచి బదిలీ చేయమని స్వయంగా పీడీ రమేష్‌కు మేరీ ఏప్రిల్ 21న రాతపూర్వకంగా కోరారు. ఆరు మండలాలను ఆప్షన్ ఇస్తూ ఏదో మండలానికి బదిలీ చేయాలని అభ్యర్థించారు. ‘ఎలాంటి తప్పు చేయలేదు, మీరేందుకు బదిలీ కావాలి, మేమున్నాం’ అంటూ ఉన్నతాధికారులు అప్పట్లో నోటిమాటలు చెప్పారు.
ఉపాధి కూలీల నుంచి ఎలాంటి ఆరోపణలు లేకపోగా, ఉన్నతాధికారులు సైతం అండగా ఉండటంతో మేరీ విధులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే వేధింపులు పునరావృతం కావటంతో ఆమె జేసీ శ్వేతను జూన్ 2న ఆశ్రయించినట్లు సమాచారం. ఎంపీడీఓ వేధింపులు భరించలేకున్నా, అక్కడి నుంచి బదిలీ చేయమంటే అధికారులు చేయడం లేదని మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన జేసీ ఎంపీడీఓకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటీకీ ధోరణి మారకపోవడంతో జూన్ 24న ముద్దనూరు పోలీసుస్టేషన్‌లో మేరీ ఫిర్యాదు చేశారు. ఆమేరకు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు.
ప్లేట్ ఫిరాయించిన ఉన్నతాధికారి
గతంలో అండగా నిలిచిన ఉన్నతాధికారి ఒకరు ఉన్నట్లుండీ ప్లేట్ ఫిరాయించారు. జూన్ 24న మేరీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరుసటిరోజు నుంచి వార్నింగ్‌లు మొదలయ్యాయి. కేసు ఉపసంహరించుకోకపోతే ఉద్యోగం చేయలేవని హెచ్చరికలు తీవ్రమయ్యాయి. విసిగిపోయిన మేరి వెనక్కి తగ్గేది లేదని గట్టిగా చెప్పినట్లు సమాచారం. మహిళగా మేరి తెగువను అభినందించాల్సి పోయి, శాఖాపరంగా వేధింపులు... అత్యున్నతాధికారి సమక్షంలో బెదిరింపులు పాల్పడటం రివాజుగా మారినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఆమెకు ఇచ్చిన సియూజీని సైతం కట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా కేసు ఉపసంహారించుకోవాలని మేరీపై పెద్దఎత్తున ఒత్తిడి పెంచడం వెనుక ఓ ఎమ్మెల్యే సిఫార్సులే కారణంగా తెలుస్తోంది. అధికారపార్టీ కండువా కప్పుకున్న ఆ ఎమ్మెల్యే కేసు ఉపసంహరింపజేయాల్సిన బాధ్య త ఉన్నతాధికారిదేనని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఆమేరకు తొలివిడతగా సియూజీ సిమ్ కట్ చేసినట్లు తెలుస్తోంది. రేపోమాపో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం సైతం తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
నిసిగ్గుగా అధికారుల ప్రవర్తన
టెక్నికల్ అసిస్టెంట్‌పై వేధింపుల వ్యవహారంలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒకరు సిఫార్సు చేశారని అత్యున్నతాధికారులు నిసిగ్గుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు అన్యాయం వైపు మొగ్గుచూపుతూ రాజకీయ నాయకులకు కొమ్ముకాయడాన్ని పలువురు చిరుద్యోగులు మండిపడుతుండటం విశేషం.