కరువు రాష్ట్రాలపై ఇంత నిర్లక్ష్యమా? | So carefree on drought States | Sakshi
Sakshi News home page

కరువు రాష్ట్రాలపై ఇంత నిర్లక్ష్యమా?

Published Thu, Apr 7 2016 1:45 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

కరువు రాష్ట్రాలపై ఇంత నిర్లక్ష్యమా? - Sakshi

కరువు రాష్ట్రాలపై ఇంత నిర్లక్ష్యమా?

♦ కేంద్ర సాయంలో జాప్యమొద్దు
♦ కేంద్రానికి సుప్రీం అక్షింతలు
 
 సాక్షి, న్యూఢిల్లీ:  కరువు రాష్ట్రాల్లో సరిపడా ఉపాధి హామీ నిధులను విడుదల చేయకపోవడం పట్ల కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉపశమన చర్యలను వెంటనే చేపట్టాలని, ఏడాది తర్వాత కాదని అక్షింతలు వేసింది. ‘మీరు నిధులు విడుదల చేయకపోతే పని చేయడానికి ఎవరూ ఇష్టపడరు. రాష్ట్రాలేమో తమ వద్ద నిధుల్లేవంటాయి. అందువల్ల ఉపాధి పనులకు వారు డబ్బులు చెల్లించరు’ అని చెప్పింది. రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించే సాయం ఏదైనా తక్షణమే అందించాలని స్పష్టం చేసింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరువు తీవ్రత అధికంగా ఉందని, కేంద్రం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారంటూ స్వరాజ్ అభియాన్ సంస్థ, సామాజికవేత్త యోగేంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎన్.వి.రమణల బెంచ్ విచారించింది. ఏపీ, తెలంగాణతోపాటు 12 రాష్ట్రాల్లో కరువు వచ్చినా తగినంత పరిహారం ఇవ్వలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.  ఉపాధి హామీ పథకంలో కేంద్రం గత ఏడాది రూ. 36 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉండగారూ. 3 వేల కోట్లే విడుదల చేసిందని పిటిషనర్ల   న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ తెలిపారు. దీంతో జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘ఒక పక్క 45 డిగ్రీలతో ఎండలు మండిపోతున్నాయి. తాగునీరూ లేదు.

ప్రజలు వలస పోతున్నారు. వారికి ఉపశమనం కోసం ఏదైనా చేయాలి. అందువల్ల రాష్ట్రాలు కోరిన వెంటనే నిధులు విడుదల చేస్తే నిజమైన సాయంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘ఉపాధి, కరువు నిధులతోపాటు విపత్తులు సంభవించినప్పుడు కూడా కేంద్రం ప్రకటించే సాయం వెంటనే చేరడం లేదు. సాయం ఆలస్యమైతే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండదు. ఏపీలో హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడూ కేంద్రం రూ. 1,000 కోట్లు సాయం ప్రకటించి నెలలు గడిచాక రూ. 300 కోట్లే  ఇచ్చినట్టు పత్రికల్లో చదివా’నని అన్నారు.

ఉపాధి హామీని ఇప్పటికే 46 శాతం అమలుచేస్తున్నామని, 50 శాతం అమలుకు కృషిచేస్తామని కేంద్రం తరఫు న్యాయవాది నివేదించారు. ‘ఇప్పుడు 46 శాతం.. తరువాత 50 శాతం అంటున్నారు. మరి 100 శాతం ఎప్పుడు అమలుచేస్తారు’ అని జస్టిస్ రమణ ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్ల వెనకబడిన, కరువు రాష్ట్రాల్లో ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గురువారమూ విచారణ జరుపుతామని, కేంద్రం వైఖరిపై అఫిడవిట్  వేయాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు. గురువారం కాకుండా మరో రోజు విచారణ జరపాలని కేంద్రం తరపు న్యాయవాది కోరగా, వేసవి సెలవులు వస్తుందన్నందున నిధుల విడుదలపై ఇప్పుడే విచారణ చేయాలని ధర్మాసనం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement