కూలీల సంఖ్య పెంచకుంటే చర్యలు
► రోజూ 50వేల మందికి ‘ఉపాధి’ కల్పించాలి
►26న మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటన
► నగదు రహిత గ్రామాలుగా 61 ఎంపిక
► వీడియోకాన్ఫరెరన్స్ లో జేసీ యాస్మిన్ బాషా
సాక్షి, సిరిసిల్ల : ఉపాధిహామీ ద్వారా చేపట్టే పనుల్లో కూలీల సంఖ్య పెంచకపోతే ఏపీవోలపై చర్యలు తీసుకుంటామని జేసీ షేక్ యాస్మిన్ బాషా హెచ్చరించా రు. సోమవారం మండల అధికారులతో సిరిసిల్ల నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజూ 50 వేల మందికి పైగా కూలీలకు పని కల్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రతీగ్రామంలో ఉపాధి పనులు చేపట్టాలన్నారు. ఈనెల 26వ తేదీ నాటికి జిల్లాను వందశా తం బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఇది సాధ్యమని అన్నారు. కేంద్ర బృందం మూడుసార్లు జిల్లాలో పర్యటించి నిర్ధారించుకున్నాకే ఓడీఎఫ్‌గా ప్రకటిస్తుందన్నారు. వంద శాతం నగదు రహిత లావాదేవీలకు 61 గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఈ గ్రామాల్లోని ప్రజలందరితో బ్యాంక్ ఖాతాలు తెరిపించాలన్నారు. హరితహారంలో నర్సరీల పెంపకంపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామపంచాయతీలకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద రూ.10 వేలు మంజూరు చేశామని, వీటిని వినియోగించి పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు వంద శాతం ఉపయోగంలో ఉండాలన్నారు. డీఆర్‌డీవో పీడీ ఎన్ .హన్మంతరావు, డీడబ్ల్యూవో సరస్వతి, డీఎంహెచ్‌వో ఆర్.రమేశ్, అధికారులు పాల్గొన్నారు.