ఖాతా ఉంటేనే వేతనం
Published Thu, Mar 31 2016 2:48 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
మండపేట :ఉపాధి హామీ పథకం కూలీలకు కష్టార్జితం చేతికందాలంటే ఇకమీదట బ్యాంకు ఖాతా ఉండాల్సిందే. ఇక నుంచి ‘ఉపాధి’ కూలీల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని తొలివిడతగా జిల్లాలోని 142 గ్రామాల్లో ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. అనంతరం జిల్లావ్యాప్తంగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.వేతనాల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించడంతోపాటు, అవకతవకలను అరికట్టే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఏప్రిల్ 1 నుంచి నూతన విధానం అమలుకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా ఉపాధి కూలీలకు చెందిన ప్రధానమంత్రి జన్‌ధన్ లేదా వారి వ్యక్తిగత పొదుపు ఖాతాల వివరాలను సిద్ధం చేయాలని రెండు నెలల క్రితమే జిల్లా యంత్రాంగానికి ఉత్తర్వులు అందాయి. వాస్తవానికి మార్చి నెల నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని జిల్లా యంత్రాంగం భావించింది. జిల్లాలోని 62 మండలాల పరిధిలోని 1,075 పంచాయతీల్లో 7,60,313 జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిద్వారా శ్రమశక్తి సంఘాల్లో 8,45,712 మంది సభ్యులుగా ఉన్నారు. వీరిలో సుమారు 4.82 లక్షల మంది రోజువారీ ఉపాధి కూలీలుగా పని చేస్తున్నారు. కొత్త విధానానికి అనుగుణంగా వారి బ్యాంకు ఖాతాల వివరాలను ఉపాధి హామీ పథకం సిబ్బంది సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ 3,47,842 మంది ఖాతాల వివరాలు సేకరించారు.
గత సమస్యలు అధిగమించే లక్ష్యంతో..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2007 మే నెల నుంచి అమలులోకి వచ్చింది. మొదట్లో కార్మికులతో పుస్తకాల్లో సంతకాలు చేయించుకుని చెల్లింపులు చేసేవారు. ఈ విధానంలో పలుచోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటిని నివారించే పేరుతో బయోమెట్రిక్ పద్ధతిని అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం అత్యధిక శాతం కూలీలకు తపాలా శాఖ ద్వారా బయోమెట్రిక్ తరహాలో 12 నుంచి 14 రోజులకోసారి వేతనాలు చెల్లిస్తున్నారు. ఆధార్ సంఖ్య, వేలిముద్రలు సరిపోలకపోవడం, సాంకేతిక సమస్యలతో వేతనాలు పొందేందుకు ఉపాధి కూలీలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. ఆయా సమస్యలను అధిగమించే లక్ష్యంతో నూతన విధానం అమలుకు కేంద్రం ఆదేశాలిచ్చింది.
బ్యాంకుల్లో ముందుకు సాగని ప్రక్రియ
నూతన విధానం అమలు కోసం తొలివిడతగా జిల్లాలోని 48 మండలాల పరిధిలో 142 గ్రామాలను ఎంపిక చేశారు. దీనిని అమలు చేసేంతవరకూ మిగిలిన పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న బయోమెట్రిక్ పద్ధతిలోనే వేతనాలు చెల్లిస్తారు. కొత్త విధానం ప్రకారం ఉపాధి కూలీల వేతనాల చెల్లింపునకు వారి వ్యక్తిగత ఖాతాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి, వారికి ఏటీఎం కార్డులు అందజేయాల్సి ఉంది.
ఈ మేరకు డ్వామా అధికారులు కూలీల ఖాతాల వివరాలను అందజేసినా ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకుల్లో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. తొలివిడతగా ఎంపిక చేసిన పంచాయతీల్లో ఇప్పటివరకూ 56 శాతం ఖాతాల అనుసంధానం మాత్రమే పూర్తయ్యింది. ఆయా గ్రామాల పరిధిలో 1,20,234 మంది కూలీలకు గానూ ఇప్పటివరకూ 67,808 మంది ఖాతాలను మాత్రమే అనుసంధానం చేశారు. మిగిలిన ఖాతాల అనుసంధానం త్వరితగతిన పూర్తికాకుంటే కూలి చెల్లింపుల్లో ఇబ్బందులు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement