‘ఉపాధి’పై ఆరా | Ask about 'employment' | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’పై ఆరా

Published Mon, Aug 21 2017 4:44 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

‘ఉపాధి’పై ఆరా - Sakshi

‘ఉపాధి’పై ఆరా

ఉపాధి హామీ పథకం నిధుల వ్యయంపై కేంద్రం విచారణ
నెలల తరబడి కూలీలకు నిలిచిన చెల్లింపులు
నిధుల వ్యయంలో అవకతవకలే కారణం
నేడు జిల్లాకు కేంద్ర బృందం రాక


ఒంగోలు సెంట్రల్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీరుతెన్నులపై కేంద్ర ప్రభుత్వ బృందం నేడు జిల్లాలో పర్యటించి, పరిశీలించనుంది. ఇప్పటికే నిధుల విడుదలను నిలిపేసింది. ఈ పథకం కింద కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 10  శాతం విడుదల చేస్తూ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను నిర్వహిస్తోంది.

అయితే కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు నిధులను దారి మళ్లించడం, నిధుల వినియోగానికి సంబంధించి లెక్కలు లేకుండా కనీసం పుస్తక నిర్వహణ కూడా లేకపోవడంతో నిధుల విడుదలను ఆపేసింది. దీంతో ఉపాధి హామీ పనులను  ప్రత్యక్షంగా అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం సోమవారం జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. ఈ బృందం క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం సంతృప్తి చెందితేనే రాష్ట్రానికి, తద్వారా జిల్లాకు ఉపాధి నిధులు మంజూరవుతాయి.

ఇప్పటికే జూన్‌ నెలలో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం నివ్వెరపోయింది. ఈ పరిశీలనలో ఎక్కడా రికార్డులు లేకపోవడం, ఒక వేళ ఉన్నా అసంపూర్తిగా ఉండటంతో ఉపాధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి నిధుల విడుదలను నిలిపేసింది. నేడు జిల్లాలో కేంద్ర బృందం పర్యటిస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పాత పనులకు సంబంధించి పాత తేదీలతో సెలవు రోజుల్లో కూడా సిబ్బంది పనిచేసి రికార్డులను నమోదు చేయడంలో నిమగ్నమయ్యారు. నెలన్నరకు పైగా ఉపాధి కూలీని కూడా విడుదల చేయలేదు. కూలీ కంటే మెటీరియల్‌ చెల్లింపులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

రాష్ట్ర పథకాలపై ప్రభావం:
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను దారి మళ్లించి తన సొంత పథకాలకు వినియోగిస్తుందనే అంశంపై ముఖ్యంగా కేంద్ర బృందం పరిశీలించనున్నట్లు సమాచారం. చంద్రన్న బాట కింద సీసీ రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాలకు మెరుగులు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం, నీటితొట్టెలు, వర్మీ కంపోస్టు తదితర పథకాలకు ఉపాధి నిధులను వెచ్చిస్తున్నారని కొంత వరకూ గుర్తించినట్లు సమాచారం. కేంద్రం తన వాటా కింద 90 శాతం నిధులు ఉపాధి హామీకి విడుదల చేస్తున్న నేపథ్యంలో, రాష్ట్రం తన సొంత పథకాలకు  వాటిని ఎలా ఖర్చుచేస్తారనే విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. అంతే కాకుండా క్షేత్ర స్థాయిలో నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసినట్లు గత పరిశీలనలో కేంద్ర బృందాలు తెలుసుకున్నాయి.

నివేదిక మేరకే నిధులు:
జూన్‌ 23 నుంచి జిల్లాలో ఉపాధి కూలీలకు వేతనం, మెటీరియల్‌ కాంపోనెంట్‌ చెల్లింపులకు సంబంధించిన బకాయిలు దాదాపు రూ.80 కోట్ల వరకూ ఉన్నట్లు సమాచారం. ఇందులో అత్యధికం కూలీల బకాయిలే ఉండటం విశేషం. మెటీరియల్‌ కాంపోనెంట్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు నిధులు చెల్లిస్తున్నారు.  

నిలిచిపోయిన ఉపాధి కూలీ
దాదాపు 9 లక్షల పని దినాలకు సంబంధించి బకాయిలు చెల్లించాలి. జిల్లాలో 7.88 లక్షల ఉపాధి కార్డులు ఉండగా వీరిలో పనిచేస్తున్న కుటుంబాలు 3.60 లక్షలు, కూలీలు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. ఏ లక్ష్యంతో ఉపాధి హామీని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం ప్రస్తుతం నెరవేరడం లేదు. వర్షాభావంతో ఉపాధి పథకమే ఏకైక దిక్కుగా ఉన్న రోజుల్లో ఉపాధి చేసిన నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కూలీల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement