ప్రాజెక్టుల డీపీఆర్‌లు బయటపెట్టాలి
ప్రభుత్వానికి టీజేఏసీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగు, తాగునీటి పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను వెంటనే బహిర్గతం చేయాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టీజేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రాజెక్టుల కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ (సీబీఏ)లతోపాటు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను (పీపీఏ) ప్రజల ముందుంచాలని స్పష్టం చేసింది. మణుగూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు, జెన్‌కో ప్రాజెక్టుల బ్యాక్‌డౌన్, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్‌టెక్‌తో ఒప్పందాలు, సింగరేణి ప్రాజెక్టు నిర్మాణ, ఉత్పత్తి వ్యయాల పెంపుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాం డ్ చేసింది.
విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఈఆర్‌సీ) విచారణలో ఉద్యోగులు పాల్గొన రాదంటూ విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తేయాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులకూ వేతనాలు పెంచాలని కోరింది. ప్రభుత్వ నిర్ణయాలను వెలువరించే ఉత్తర్వులను ప్రజ లకు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రజా సమస్యలకు సంబంధించిన 30 అంశాలపై జేఏసీ ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. తీర్మానాలు, సమావేశంలో చర్చించిన అంశాలను టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విలేకరులకు వివరించారు.
ప్రాజెక్టులపైనే రాష్ట్ర భవిష్యత్తు
ప్రాజెక్టుల డీపీఆర్‌లు, సీబీఏలపై నిపుణులతో సదస్సులు నిర్వహిస్తామని, సదస్సుల్లో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ప్రొఫెసర్ కోదండారం చెప్పారు. రూ. వేల కోట్ల ప్రజాధనం ఇమిడి ఉన్న ప్రాజెక్టులపైనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, సాగు, తాగునీటి ప్రాజె క్టుల్లో అవకతవకలు, ప్రజలకు భారంగా పరిణమించనున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యతను టీజేఏసీ చేపడుతుందని, ఈ మేరకు రాష్ట్రవ్యాప్త సదస్సులు, పాదయాత్రలను జేఏసీ నిర్వహించనుందని చైర్మన్ కోదండరాం వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని కరువు మండలాలను గుర్తించాలని, ఇప్పటికే ప్రకటించిన కరువు మండలాల్లో ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాగునీటి సరఫరా, పశుగ్రాసం పంపిణీతోపాటు పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీని అందించాలన్నారు. కరువు ప్రాంతాల్లో వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, వృద్ధులకు, చేతి వృత్తిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వమే ఉచితంగా విద్య, వైద్యం అందించాలి
ప్రభుత్వరంగంలోనే విద్య, వైద్య విభాగాలను బలోపేతం చేసి ఉచితంగా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఐడీపీఎల్, హిందుస్తాన్ కేబుల్స్ తదితర మూతపడిన పరిశ్రమలను తెరిపించడంతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో మాదిరిగా ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకు రిజిర్వేషన్ కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఆయన సూచించారు. రాష్ట్ర పురోభివృద్ధి కోసం తెలంగాణ జేఏసీ కొనసాగుతుందని, రాజకీయేతర శక్తిగానే ముందుకెళుతుందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతి విషయంపైనా జేఏసీ తన విధానాన్ని ఇకపైనా ప్రకటిస్తుందన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా, ఆయన సూచించిన మార్గంలోనే జేఏసీ నడుస్తుందన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన, జైళ్లు, కేసుల పాలైన, ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలన్నారు. సమావేశంలో టీజేఏసీ రాష్ట్ర సమన్వయ కర్త పిట్టల రవీందర్, విద్యుత్ జేఏసీ కన్వీనర్ రఘు, జేఏసీ నాయకులు ఖాజా మొహినుద్దీన్, నల్లపు ప్రహ్లాద్, వివిధ జిల్లాల టీజేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
టీజేఏసీ తీర్మానాల్లో మరికొన్ని..
► ఉద్యమంలో పాల్గొన్న లాయర్ల కోసం రూ. 100 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధిని అర్హులైన వారి సంక్షేమానికి తక్షణం వాడాలి
► కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని వర్షపాతాన్ని లెక్కించాలి. ఇందుకోసం అన్ని గ్రామాల్లోనూ వర్షపాత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
► పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ఎకరానికి రూ. 10 వేల చొప్పున రైతులకు నగదు అందించాలి
► వ్యవసాయ అనుబంధ చేతి వృత్తిదారులు, మేకలు, గొర్రెల పెంపకందారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి
► ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలి
► ఒకేసారి రైతులకు రుణమాఫీ చేసి వెంటనే పంట రుణాలు ఇప్పించాలి
► వ్యవసాయ స్థిరీకరణ కోసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి