genco project
-
ప్రాజెక్టుల డీపీఆర్‌లు బయటపెట్టాలి
ప్రభుత్వానికి టీజేఏసీ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన సాగు, తాగునీటి పథకాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను వెంటనే బహిర్గతం చేయాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టీజేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రాజెక్టుల కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ (సీబీఏ)లతోపాటు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను (పీపీఏ) ప్రజల ముందుంచాలని స్పష్టం చేసింది. మణుగూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు, జెన్కో ప్రాజెక్టుల బ్యాక్‌డౌన్, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్టెక్తో ఒప్పందాలు, సింగరేణి ప్రాజెక్టు నిర్మాణ, ఉత్పత్తి వ్యయాల పెంపుపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాం డ్ చేసింది. విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఈఆర్సీ) విచారణలో ఉద్యోగులు పాల్గొన రాదంటూ విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులకూ వేతనాలు పెంచాలని కోరింది. ప్రభుత్వ నిర్ణయాలను వెలువరించే ఉత్తర్వులను ప్రజ లకు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రజా సమస్యలకు సంబంధించిన 30 అంశాలపై జేఏసీ ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. తీర్మానాలు, సమావేశంలో చర్చించిన అంశాలను టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విలేకరులకు వివరించారు. ప్రాజెక్టులపైనే రాష్ట్ర భవిష్యత్తు ప్రాజెక్టుల డీపీఆర్‌లు, సీబీఏలపై నిపుణులతో సదస్సులు నిర్వహిస్తామని, సదస్సుల్లో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ప్రొఫెసర్ కోదండారం చెప్పారు. రూ. వేల కోట్ల ప్రజాధనం ఇమిడి ఉన్న ప్రాజెక్టులపైనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, సాగు, తాగునీటి ప్రాజె క్టుల్లో అవకతవకలు, ప్రజలకు భారంగా పరిణమించనున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యతను టీజేఏసీ చేపడుతుందని, ఈ మేరకు రాష్ట్రవ్యాప్త సదస్సులు, పాదయాత్రలను జేఏసీ నిర్వహించనుందని చైర్మన్ కోదండరాం వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని కరువు మండలాలను గుర్తించాలని, ఇప్పటికే ప్రకటించిన కరువు మండలాల్లో ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాగునీటి సరఫరా, పశుగ్రాసం పంపిణీతోపాటు పంట నష్టపోయిన రైతులకు పరిహారం, ఇన్పుట్ సబ్సిడీని అందించాలన్నారు. కరువు ప్రాంతాల్లో వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, వృద్ధులకు, చేతి వృత్తిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వమే ఉచితంగా విద్య, వైద్యం అందించాలి ప్రభుత్వరంగంలోనే విద్య, వైద్య విభాగాలను బలోపేతం చేసి ఉచితంగా ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఐడీపీఎల్, హిందుస్తాన్ కేబుల్స్ తదితర మూతపడిన పరిశ్రమలను తెరిపించడంతోపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో మాదిరిగా ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకు రిజిర్వేషన్ కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఆయన సూచించారు. రాష్ట్ర పురోభివృద్ధి కోసం తెలంగాణ జేఏసీ కొనసాగుతుందని, రాజకీయేతర శక్తిగానే ముందుకెళుతుందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతి విషయంపైనా జేఏసీ తన విధానాన్ని ఇకపైనా ప్రకటిస్తుందన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా, ఆయన సూచించిన మార్గంలోనే జేఏసీ నడుస్తుందన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన, జైళ్లు, కేసుల పాలైన, ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలన్నారు. సమావేశంలో టీజేఏసీ రాష్ట్ర సమన్వయ కర్త పిట్టల రవీందర్, విద్యుత్ జేఏసీ కన్వీనర్ రఘు, జేఏసీ నాయకులు ఖాజా మొహినుద్దీన్, నల్లపు ప్రహ్లాద్, వివిధ జిల్లాల టీజేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. టీజేఏసీ తీర్మానాల్లో మరికొన్ని.. ► ఉద్యమంలో పాల్గొన్న లాయర్ల కోసం రూ. 100 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధిని అర్హులైన వారి సంక్షేమానికి తక్షణం వాడాలి ► కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని వర్షపాతాన్ని లెక్కించాలి. ఇందుకోసం అన్ని గ్రామాల్లోనూ వర్షపాత నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలి ► పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా ఎకరానికి రూ. 10 వేల చొప్పున రైతులకు నగదు అందించాలి ► వ్యవసాయ అనుబంధ చేతి వృత్తిదారులు, మేకలు, గొర్రెల పెంపకందారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలి ► ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించాలి ► ఒకేసారి రైతులకు రుణమాఫీ చేసి వెంటనే పంట రుణాలు ఇప్పించాలి ► వ్యవసాయ స్థిరీకరణ కోసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి -
బడాబాబులకి దోచిపెట్టి.. భారం ప్రజలపైనా?
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజాగ్రహం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రజలపై విద్యుత్ భారం మోపడం ఏమిటని విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రజా సంఘాలు నిలదీశాయి. పంపిణీ సంస్థల నష్టాలకు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు కారణం కాదా అని ప్రశ్నించాయి. కాంట్రాక్టుల విషయంలో సాక్షాత్తూ సీఎంపైనే అవినీతి ఆరోపణలు వచ్చిన వైనాన్ని గుర్తుచేశాయి. రూ. 5,145 కోట్ల వార్షిక ఆర్థిక లోటు ఉన్నట్టు తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి తెలిపాయి. దీనిని పూడ్చుకోవడానికి విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతినివ్వాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఏపీఈఆర్సీ కార్యాలయంలో సోమవారం బహిరంగ ప్రజా విచారణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రఘు, రామ్మోహన్ పాల్గొన్నారు. సీఎంపైనే అవినీతి ఆరోపణలు: జెన్కో ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టు వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. సోలార్ ప్రాజెక్టులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలవి కావా? అని ప్రశ్నించారు. సీఎంపైనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు. -
ఓడరేవులతోనే రాష్ట్రాభివృద్ధి!
మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు. పోర్టు, జెన్కోలో పర్యటన ముత్తుకూరు : ఓడరేవుల ఏర్పాటుతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పురపాలకశాఖ మంత్రి నారాయణలు అన్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో 29 మంది ఎమ్మెల్సీలు, 23 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం జిల్లా పారిశ్రామికాభివృద్ధి అధ్యయనంలో భాగంగా కృష్ణపట్నం పోర్టులో పర్యటించారు. ఈ సందర్భంగా పోర్టు(సౌత్)లో జరిగిన సభలో మంత్రులు ప్రసంగించారు. సువిశాల తీరప్రాంతం ఉండటం వల్ల రాష్ట్రానికి ఓడరేవుల అవసరం ఉందన్నారు. దీని వల్ల పరిశ్రమలు వస్తాయని, రాష్ట్ర సంపద పెరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణానికి చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలు సేకరించామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇదొక ఉదాహరణ అన్నారు. డిప్యూటీ స్పీకర్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల సర్వం కోల్పోయామని అనుకోవడం కంటే అభివృద్ధిపై అందరూ దృష్టిపెడితే మంచిదన్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ఒకేప్రాంతంలో కాకుండా అన్ని జిల్లాల్లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్గో పెరిగితే బెర్తులు పెంచుతాం కృష్ణపట్నం పోర్టు ఎగుమతి, దిగుమతయ్యే సరుకుల పరి మాణం పెరిగితే బెర్తుల సంఖ్య పెంచుతామని పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి అన్నారు. లేకుంటే పోర్టు నష్టాలకు గురవుతుందన్నారు. కలకత్తా పోర్టు రూ. 300 కోట్లు, కొచ్చిన్ పోర్టు రూ. 150 కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంలు కాలుష్యం, సీఎస్ఆర్ నిధుల వ్యయంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానాలిచ్చారు. 250 హెక్టార్లలో మొక్కలు పెంచుతున్నామన్నారు. ఉప్పు నేలలు కావడం వల్ల మొక్కలు ఎదగడం లేదన్నారు. సోషల్ ఇన్ఫ్రాస్త్రక్చర్ అభివృద్ధి చెందితే విదేశీ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని తెలిపారు. ఇందుకోసం తాము ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సభలో విప్‌లు కాలువ శ్రీనివాసులు, అంగార శ్రీనివాసులు, యామనీబాల, పూన రవికుమార్, మేకా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ జానకి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్టులో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలామ్ విగ్రహాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు. జెన్కో ప్రాజెక్టు ఖర్చు ఎందుకు పెరిగింది నేలటూరులోని ఏపీ జెన్కో ప్రాజెక్టులో పర్యటించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందానికి ప్రాజెక్టు ఇంజనీర్లు ఘనంగా స్వాగతం పలికారు. సెక్యూరిటీ గార్డులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జెన్కో ప్రాజెక్టు ఖర్చు ఎందుకు పెరిగింది, బొగ్గు నిల్వలు ఎందుకు తగ్గుతున్నాయి, విద్యుత్ యూనిట్ ఎంతకు ఇస్తున్నారు, పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోవడానికి కారణాలు ఏమిటని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నలు కురిపించారు. దీనికి సీఈ సత్యనారాయణ బదులిస్తూ, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నామన్నారు. కోల్ లింకేజీ ఒప్పందంలో జాప్యం జరిగిందన్నారు. మంగళవారం 2వ యూనిట్ సీఈఓ మొదలైందన్నారు. -
మాగోడు వినండయ్యా..
పునరావాస కాలనీల్లో పీఏసీ చైర్మన్ భూమా పర్యటన సమస్యలు ఏకరువు పెట్టిన కాలనీవాసులు ముత్తుకూరు : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి మంగళవారం కృష్ణపట్నం పోర్టు పునరావాస కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను సావధానంగా ఆలకించారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితుల కోసం ఏర్పాటైన సీవీఆర్ ఆసుపత్రి(మాధవ చికిత్సాలయం)ని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఆర్వో ప్లాంటును పరిశీలించారు. మండుటెండలో పాదయాత్ర ద్వారా కాలనీలో నిర్మించిన రోడ్లు, ఇరువైపులా నాటిన చెట్లు, డ్రెయిన్లు, ఆలయాలను తిలకించారు. మధురానగర్‌లో సీవీఆర్ పాఠశాలను పరిశీలించారు. సమస్యలను విన్నవించిన నజిరీనా పునరావాస కాలనీలోని పాదర్తిపాళేనికి చెందిన నజిరీనా అనే మహిళ పలు సమస్యలను భూమా నాగిరెడ్డికి విన్నవించింది. ఆమెతోపాటు ఆ ప్రాంతవాసులు తమ గోడును వెల్లిబుచ్చారు. ఉప్పు సాగు నిలిచిపోవడంతో ఉపాధి దొరక్క బతుకు భారంగా మారిందన్నారు. ప్రాజెక్టుల నుంచి కొందరు పెద్దలు మాత్రమే లబ్ధి పొందుతున్నారని తెలిపారు. కృష్ణపట్నం గ్రామంలో జెన్కో ప్రాజెక్టు అందజేస్తున్న ప్యాకేజీని ఇతర ప్రాజెక్టుల నుంచి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ గ్రామాల కాపులు ఈ సందర్భంగా పలు సమస్యలు, డిమాండ్లను భూమా దృష్టికి తీసుకొచ్చారు. ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం నిర్వాసితులకు అంద వలసిన ప్రతి సదుపాయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తామని భూమా హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధనరెడ్డి, ట్రేడ్ యూనియన్ కన్వీనర్ గండవరం సూరి ఉన్నారు.