మంత్రులు నారాయణ, అయ్యన్నపాత్రుడు.
పోర్టు, జెన్‌కోలో పర్యటన
ముత్తుకూరు : ఓడరేవుల ఏర్పాటుతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పురపాలకశాఖ మంత్రి నారాయణలు అన్నారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో 29 మంది ఎమ్మెల్సీలు, 23 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం జిల్లా పారిశ్రామికాభివృద్ధి అధ్యయనంలో భాగంగా కృష్ణపట్నం పోర్టులో పర్యటించారు. ఈ సందర్భంగా పోర్టు(సౌత్)లో జరిగిన సభలో మంత్రులు ప్రసంగించారు. సువిశాల తీరప్రాంతం ఉండటం వల్ల రాష్ట్రానికి ఓడరేవుల అవసరం ఉందన్నారు. దీని వల్ల పరిశ్రమలు వస్తాయని, రాష్ట్ర సంపద పెరుగుతుందన్నారు.
రాజధాని నిర్మాణానికి చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాలు సేకరించామన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఇదొక ఉదాహరణ అన్నారు. డిప్యూటీ స్పీకర్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల సర్వం కోల్పోయామని అనుకోవడం కంటే అభివృద్ధిపై అందరూ దృష్టిపెడితే మంచిదన్నారు. ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ఒకేప్రాంతంలో కాకుండా అన్ని జిల్లాల్లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కార్గో పెరిగితే బెర్తులు పెంచుతాం
కృష్ణపట్నం పోర్టు ఎగుమతి, దిగుమతయ్యే సరుకుల పరి మాణం పెరిగితే బెర్తుల సంఖ్య పెంచుతామని పోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి అన్నారు. లేకుంటే పోర్టు నష్టాలకు గురవుతుందన్నారు. కలకత్తా పోర్టు రూ. 300 కోట్లు, కొచ్చిన్ పోర్టు రూ. 150 కోట్ల నష్టాల్లో ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంలు కాలుష్యం, సీఎస్‌ఆర్ నిధుల వ్యయంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సవివరంగా సమాధానాలిచ్చారు. 250 హెక్టార్లలో మొక్కలు పెంచుతున్నామన్నారు.
ఉప్పు నేలలు కావడం వల్ల మొక్కలు ఎదగడం లేదన్నారు. సోషల్ ఇన్‌ఫ్రాస్త్రక్చర్ అభివృద్ధి చెందితే విదేశీ ప్రాజెక్టులు ఏర్పాటవుతాయని తెలిపారు. ఇందుకోసం తాము ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సభలో విప్‌లు కాలువ శ్రీనివాసులు, అంగార శ్రీనివాసులు, యామనీబాల, పూన రవికుమార్, మేకా మల్లికార్జునరెడ్డి, కలెక్టర్ జానకి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్టులో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలామ్ విగ్రహాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరించారు.
జెన్‌కో ప్రాజెక్టు ఖర్చు ఎందుకు పెరిగింది
నేలటూరులోని ఏపీ జెన్‌కో ప్రాజెక్టులో పర్యటించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందానికి ప్రాజెక్టు ఇంజనీర్లు ఘనంగా స్వాగతం పలికారు. సెక్యూరిటీ గార్డులు గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా జెన్‌కో ప్రాజెక్టు ఖర్చు ఎందుకు పెరిగింది, బొగ్గు నిల్వలు ఎందుకు తగ్గుతున్నాయి, విద్యుత్ యూనిట్ ఎంతకు ఇస్తున్నారు, పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోవడానికి కారణాలు ఏమిటని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రశ్నలు కురిపించారు. దీనికి సీఈ సత్యనారాయణ బదులిస్తూ, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నామన్నారు. కోల్ లింకేజీ ఒప్పందంలో జాప్యం జరిగిందన్నారు. మంగళవారం 2వ యూనిట్ సీఈఓ మొదలైందన్నారు.
ఓడరేవులతోనే రాష్ట్రాభివృద్ధి!
Published Wed, Aug 19 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM
Advertisement
Advertisement