ఉపాధిలో లోపాలెన్నో.. | Wages Delayed In Employment Guarantee Scheme YSR Kadapa | Sakshi
Sakshi News home page

ఉపాధిలో లోపాలెన్నో..

Published Mon, May 14 2018 12:48 PM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM

Wages Delayed In Employment Guarantee Scheme YSR Kadapa - Sakshi

కడప సిటీ : ఉపాధి హామీ పథకం జిల్లాలో సక్రమంగా అమలుకు నోచుకోలేదన్న విమర్శలున్నాయి.  సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర వైఫల్యం చెందారన్న ఆరోపణలున్నాయి. మజ్జిగ పంపిణీ, కూలీలకు సౌకర్యాలు, బిల్లుల చెల్లింపు, పెండింగ్‌ ఖాతాల పరిష్కారాలు, సిబ్బంది సమస్యలు తదితర అంశాలు తిష్టవేసి పరిష్కారానికి నోచుకోక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. 

పంపిణీ కాని మజ్జిగ :జిల్లాలో రోజుకు ఉపాధి  పనులకు 1.80 లక్షల మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.   వేసవిలో కూలీలకు వడదెబ్బ సోకకుండా ఒక్కొక్కరికి 250ఎం.ఎల్‌ మజ్జిగను  అందించాల్సి ఉంటుంది. ఇందుకుగానూ మేట్లకు మజ్జిగకు రూ.4లు, పంపిణీ చేసినందుకు ఒక్క రూపాయి ఇస్తారు.  అయితే జిల్లాలో చాలా చోట్ల మేట్లు కూలీలకు మజ్జిగ పంపిణీ చేయకుండానే పంపిణీ చేస్తున్నట్లు నమోదు చేసుకుంటున్నారు. తమ ఖాతాలలో ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినప్పటికీ ఈ విషయం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. 

పరిష్కారంకానీ సస్పెన్షన్‌ ఖాతాలు :గతకొన్నేళ్లుగా ఉపాధి కూలీలకు సంబంధించి సస్పెన్షన్‌ ఖాతాల జాబితాలో ఉన్న వారికి ఇప్పటికీ కూలీ ల సొమ్ము అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ  ఖాతాల పరిధిలో 13,832మంది కూలీలు ఉన్నారు. దాదాపు రూ.2.26కోట్లు ఈ కూలీలకు డబ్బులు రావాల్సి ఉంది. ఆధార్‌ కార్డు బ్యాంక్‌ ఖాతాకు లింకేజీ కాకపోవడంవల్ల కూలీలకు డబ్బులు జమ కాలేదు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించలేదు.
కంప్యూటర్‌ ఆపరేటర్లు జాబ్‌ కార్డులు ఇచ్చేటప్పుడు వారి బ్యాంక్‌ ఖాతాకు ఆధార్‌ కార్డు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు నంబర్లు సరిగా వేస్తేనే ఖాతా నమోదవుతుంది.  ఆపరేటర్ల నిర్లక్ష్యం ఉన్నా అధికారులు దగ్గరుండి చేయించకపోవడంవల్లే ఈ పరిస్థితి నెలకొంది.

వాటర్‌ షెడ్‌ గ్రామాలలో అందని మజ్జిగ..
జిల్లాలో 795పంచాయతీలున్నాయి. ఇందులో 200గ్రామాలు వాటర్‌ షెడ్‌ కింద ఎంపికయ్యాయి. అయితే ఈ పథకం కింద ఎంపికైన గ్రామాలలో ఉపాధి కూలీలు మజ్జిగ పంపిణీకి నోచుకోలేదు. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.   దాదాపు 40వేల మంది కూలీలకు మజ్జిగ అందడంలేదు. 

సరిగా అందని బిల్లులు :జిల్లాలో గతంలో లేని విధంగా కూలీలకు బిల్లుల సమస్య వెంటాడుతోంది.  2016–17 సంవత్సరంలో మార్చి నాటికే దాదాపు రూ.60లక్షల మేర బిల్లులు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బిల్లులు రాలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు అందడంలేదు. దీంతో కూలీలు పనులకు రావాలంటే మొగ్గు చూపడంలేదు.

సోషల్‌ ఆడిట్‌పై విమర్శలు : ఉపాధి  పనులను సక్రమంగా చేశారా.. లేక అక్రమాలకు పాల్పడ్డారా అనే విషయంపై సామాజిక తనిఖీ(సోషల్‌ ఆడిట్‌) చేయడం ఉపాధి  పథకంలో ఒక నియమంగా ఉంటుంది. కానీ జిల్లాలో సోషల్‌ ఆడిట్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. 

ముద్దనూరులో సోషల్‌ ఆడిట్‌ సక్రమంగా జరగలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే సొ మ్ము రికవరీ చేయడానికి అలసత్వం ప్రదర్శిస్తున్న ట్లు తెలుస్తోంది. కొంతమందినుంచి రికవరీ చేయకుండానే లోపాయికారి ఒప్పందం చేసుకుని అధికా రులు మళ్లీ విధులలో చేర్చుకున్నట్లు సమాచారం.  
ఉపాధిలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించాలని డైరెక్టర్‌ రంజిత్‌ బాషాను ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించే దిశగా నేడు జరిగే  సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement