వారంలో ఆరురోజులు ‘ఉపాధి’కి దరఖాస్తు
- స్వీకరించాలని సిబ్బందికి డెరైక్టర్ అనితారామచంద్రన్ ఆదేశం
- జాబ్ కార్డుదారుల్లో సగం మందికైనా 100 రోజుల పని కల్పించాలి
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పనుల కోసం ఇకపై వారంలో ఆరు రోజులపాటు దరఖాస్తు చేసుకోవచ్చని గ్రామీణాభివృద్ధి విభాగం డెరైక్టర్ అనితారామచంద్రన్ వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న మూడు రోజులను పొడిగిస్తూ మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రతివారంలో సోమవార ం నుంచి శనివారం వరకు శ్రమశక్తి సంఘాలు, జాబ్‌కార్డులు కలిగిన వ్యక్తుల నుంచి పనికొరకు దరఖాస్తులు స్వీకరించి పని కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.
మార్గదర్శకాలు ఇవీ..
►బ్యాచ్ 1, 2 వారీగా గ్రామ పంచాయతీల్లో పని కోరినవారి వద్ద నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేయాలి. దరఖాస్తుల స్వీకరణ నిమిత్తం రోజూ ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్‌లు గ్రామ పంచాయతీ కార్యాలయం/రచ్చబండ వద్ద ఉదయం 6 నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉండాలి.
►దరఖాస్తులు స్వీకరించే ప్రదేశం నుంచే మొబైల్ ద్వారా లబ్ధిదారుల ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. అవసరమైన మేరకు దరఖాస్తు ఫారాలు శ్రమశక్తి సంఘాలకు మేట్‌ల ద్వారా అందించాలి.
►స్వీకరించిన దరఖాస్తులు, రశీదు నంబర్ల వివరాలతో తప్పనిసరిగా డిమాండ్ రిజిస్టర్‌ను నిర్వహించాలి. ప్రతి బుధవారం జరిగే సమావేశం వరకు స్వీకరించిన దరఖాస్తుల వివరాలను డిమాండ్ రిజిస్టర్‌లో నమోదు చేసి టెక్నికల్ అసిస్టెంట్, ఏపీవోల సంతకాలను తీసుకోవాలి.
►రోజూ ఎంపీడీవో/ ఉపాధిహామీ ప్రాజెక్ట్ అధికారి ఆధ్వర్యంలో ఏపీవోల బృందం కనీసం ఒక గ్రామంలో సమావేశం నిర్వహించాలి. నెలలోగా మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సమావేశాలు నిర్వహించి ఉపాధిహామీ పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, లబ్ధిదారులకు కల్పిస్తున్న హక్కులపై అవగాహన కల్పించాలి.
►గ్రామంలో జాబ్‌కార్డ్ కలిగినవారిలో సగం మందికిపైగా 100 రోజుల పనిని తప్పనిసరిగా పొందేలా చర్యలు చేపట్టాలి. సమావేశం జరిగిన ప్రదేశం నుంచి ఫీల్డ్ లేదా టెక్నికల్ అసిస్టెంట్లు సమావేశపు ఫొటోలను మొబైల్ ద్వారా అప్‌లోడ్ చేయాలి.
ఆ మూడు జిల్లాల్లో ఉపాధి మెరుగు
ఉపాధి హామీ పథకం పనులను కల్పించడం లో రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా లు ముందున్నాయని పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ ప్రశంసించారు. నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో అధికారులు పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకం అమలుపై వివిధ జిల్లాల డ్వామా పీడీలతో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ ఏడాది వంద శాతం లేబర్ బడ్జెట్ సాధించడానికి రోజూ 15.72 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కూలీల జాబ్‌కార్డులకు ఆధార్ నం బరును నెలాఖరులోగా అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు.