Anita Ramachandran
-
టీఎస్పీఎస్సీ కార్యదర్శి బదిలీ
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఆమెస్థానంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ను నియమించారు. వీరితోపాటు పలు వురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆది వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ డైరెక్టర్‌గా ఉన్న లచ్చిరాంభూక్యను ప్రభుత్వం బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సరీ్వసులకు తిప్పి పంపించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న బి.గోపికి ఫిషరీస్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ► హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బి.బాలమాయాదేవి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, ► రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావును రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగాను ► సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ కె. అశోక్‌రెడ్డిని ఉద్యానవనశాఖ డైరెక్టర్‌గా క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఎ.నిర్మలకాంతి వెస్లీని స్త్రీ, శిశు, వయోజనుల సంక్షేమ శాఖకు బదిలీ చేస్తూ, ఆమెకే ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ పోస్టును సైతం ప్రభుత్వం అప్పగించింది. ► హైదరాబాద్ జూ పార్క్ డైరెక్టర్‌గా ఉన్న విఎస్‌ఎన్‌వి.ప్రసాద్‌కు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నియమించింది. ► వెయిటింగ్లో ఇద్దరిలో సీతాలక్ష్మిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీల కార్యదర్శిగాను, జి.ఫణీంద్రరెడ్డికి హైదరాబాద్ జిల్లా రేషనింగ్ అధికారిగా బదిలీ చేసింది. -
టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఈడీ ప్రశ్నలవర్షం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సుమారు రూ. 40 లక్షలు చేతులు మారినట్లు తేలడం, ఇందులో మనీలాండరింగ్ కోణం ఉండటంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)... తాజాగా పరీక్షల నిర్వహణ తీరుతెన్నులు, లీకేజీ పరిణామాలపై కమిషన్ చైర్మన్ బి. జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లను సోమవారం సుదీర్ఘంగా విచారించింది. వారిని ఏకదాటిగా 11 గంటలపాటు విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అన్ని కోణాల్లో ప్రశ్నలు..: ఈడీ అధికారుల నోటీసుల మేరకు జనార్ధన్‌రెడ్డి, అనితా రామచంద్రన్‌లు సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని వేర్వేరుగా అన్ని కోణాల్లో విచారించారు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణ ఎలా ఉంటుంది..? ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత, చైర్మన్, కార్యదర్శిల పర్యవేక్షణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉద్యోగుల విధులు, ఆ విభాగంలోకి ఇతర ఉద్యోగులు వెళ్లేందుకు ఉన్న అవకాశాలు వంటి అంశాలపై వివరాలు సేకరించారు. అలాగే పేపర్ల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తీరు, తీసుకున్న చర్యలు తదితర అంశాలపైనా ప్రశ్నించారు. అనంతరం ఈ కేసులోని కీలక నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డిల పాత్రపై ఆరా తీసినట్లు తెలిసింది. ఉద్యోగంలో వారి చేరికతోపాటు విధులు, బాధ్యతలు, ప్రవర్తన ముఖ్యంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చే మహిళా అభ్యర్థులతో ప్రవీణ్ స్నేహాల గురించి అనితా రామ్చంద్రన్ను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. లీకేజీకి పాల్పడిన ఉద్యోగులపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు...? ఈ మొత్తం వ్యవహారంలో ఇంకెవరైనా ఉద్యోగులకు సంబంధం ఉన్నట్టు మీ అంతర్గత దర్యాప్తులో ఏమైనా తెలిసిందా? అని జనార్దన్‌రెడ్డిని అడిగినట్లు తెలిసింది. తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ఉద్యోగులను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. ఈ కేసులో నిందితురాలైన గురుకుల టీచర్ రేణుకకు సంబంధించిన వివరాలపై ముగ్గురు గురుకుల టీచర్ల నుంచి కూడా ఈడీ అధికారులు సోమవారం వాంగ్మూలాలు తీసుకున్నట్లు సమాచారం. -
మీరే ఆదుకోవాలి మేడమ్!
సాక్షి, యాదాద్రి: సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో హత్యకు గురైన కల్పన కుటుంబ సభ్యులు కలెక్టర్ అనితారామ చంద్రన్ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్, మైసిరెడ్డిపల్లిని ఆదివారం జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ సందర్శించారు. సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో దారుణంగా హత్యకు గురైన బాలికలు కల్పన, మనీషా, శ్రావణి కుటుంబాలను ఆమె పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కల్పన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అభంశుభం తెలియని తమ చిన్నారి అతి కిరాతకంగా హత్యకు గురైందని వారు వాపోయారు. నిరుపేదలమైన తమ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆమె వారిని ఓదారుస్తూ ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. రావాల్సిన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
హరితహారం లక్ష్యాన్ని సాధించాలి
జనగామ : హరితహారం లక్ష్యం చేరుకునేలా అధికారులు కష్టపడి పనిచేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జనగామ, పాలకుర్తి నియోజకవర్గ అధికారులతో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. రెండు నియోజకవర్గాల్లో 80 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. చెరువు కట్టలు, ప్రభుత్వ భూములు, పీఆర్, ఆర్అండ్బీ రహదారులు, వ్యవసాయ గట్లపై మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంపై కేసీఆర్ సీరియస్‌గా పని చేస్తున్నారని, లక్ష్యాన్ని అధిగమించేందుకు అన్ని శాఖల అధికారులు సమసన్వయంతో పని చేయాలని అన్నారు. దీనిపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రతి వారం రివ్యూ నిర్వహిస్తున్నారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు మిగతా పనులు పక్కన బెట్టి హరితహారంపైనే దృషి సారించాలని సూచించారు. లక్ష్యం సాధించేవరకు మండల ప్రత్యేకాధికారులు ఆయా మండలాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. జిల్లాలో 6 లక్షల ఈత మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైన అధికారులు ప్రతిపాదనలు పంపించి తీసుకెళ్లాలని అన్నారు. మొక్కలను రక్షించేందుకు వాటర్ ట్యాంకులు, అద్దె బోర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సమీక్షలో డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో అనిల్ పాల్గొన్నారు. కాగా షామీర్పేట, వడ్లకొండ గ్రామాల్లో బండ్ ప్లాంటేషన్, ఈత గౌడ సొసైటీ భూమిని పరిశీలించారు. వారి వెంట డ్వామా ఏపీడీ వసంత, క్లస్టర్ టీఏ కె.శ్రీనివాస్ రెడ్డి, ఈసీ మోహన్ ఉన్నారు. -
వారంలో ఆరురోజులు ‘ఉపాధి’కి దరఖాస్తు
- స్వీకరించాలని సిబ్బందికి డెరైక్టర్ అనితారామచంద్రన్ ఆదేశం - జాబ్ కార్డుదారుల్లో సగం మందికైనా 100 రోజుల పని కల్పించాలి సాక్షి, హైదరాబాద్: ఉపాధి పనుల కోసం ఇకపై వారంలో ఆరు రోజులపాటు దరఖాస్తు చేసుకోవచ్చని గ్రామీణాభివృద్ధి విభాగం డెరైక్టర్ అనితారామచంద్రన్ వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న మూడు రోజులను పొడిగిస్తూ మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రతివారంలో సోమవార ం నుంచి శనివారం వరకు శ్రమశక్తి సంఘాలు, జాబ్‌కార్డులు కలిగిన వ్యక్తుల నుంచి పనికొరకు దరఖాస్తులు స్వీకరించి పని కల్పించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. మార్గదర్శకాలు ఇవీ.. ►బ్యాచ్ 1, 2 వారీగా గ్రామ పంచాయతీల్లో పని కోరినవారి వద్ద నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేయాలి. దరఖాస్తుల స్వీకరణ నిమిత్తం రోజూ ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు గ్రామ పంచాయతీ కార్యాలయం/రచ్చబండ వద్ద ఉదయం 6 నుంచి 7 గంటల వరకు అందుబాటులో ఉండాలి. ►దరఖాస్తులు స్వీకరించే ప్రదేశం నుంచే మొబైల్ ద్వారా లబ్ధిదారుల ఫొటోలను అప్లోడ్ చేయాలి. అవసరమైన మేరకు దరఖాస్తు ఫారాలు శ్రమశక్తి సంఘాలకు మేట్ల ద్వారా అందించాలి. ►స్వీకరించిన దరఖాస్తులు, రశీదు నంబర్ల వివరాలతో తప్పనిసరిగా డిమాండ్ రిజిస్టర్‌ను నిర్వహించాలి. ప్రతి బుధవారం జరిగే సమావేశం వరకు స్వీకరించిన దరఖాస్తుల వివరాలను డిమాండ్ రిజిస్టర్లో నమోదు చేసి టెక్నికల్ అసిస్టెంట్, ఏపీవోల సంతకాలను తీసుకోవాలి. ►రోజూ ఎంపీడీవో/ ఉపాధిహామీ ప్రాజెక్ట్ అధికారి ఆధ్వర్యంలో ఏపీవోల బృందం కనీసం ఒక గ్రామంలో సమావేశం నిర్వహించాలి. నెలలోగా మండలంలోని అన్ని గ్రామాల్లోనూ సమావేశాలు నిర్వహించి ఉపాధిహామీ పథకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, లబ్ధిదారులకు కల్పిస్తున్న హక్కులపై అవగాహన కల్పించాలి. ►గ్రామంలో జాబ్‌కార్డ్ కలిగినవారిలో సగం మందికిపైగా 100 రోజుల పనిని తప్పనిసరిగా పొందేలా చర్యలు చేపట్టాలి. సమావేశం జరిగిన ప్రదేశం నుంచి ఫీల్డ్ లేదా టెక్నికల్ అసిస్టెంట్లు సమావేశపు ఫొటోలను మొబైల్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఆ మూడు జిల్లాల్లో ఉపాధి మెరుగు ఉపాధి హామీ పథకం పనులను కల్పించడం లో రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా లు ముందున్నాయని పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ ప్రశంసించారు. నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో అధికారులు పనితీరును మరింత మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకం అమలుపై వివిధ జిల్లాల డ్వామా పీడీలతో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ ఏడాది వంద శాతం లేబర్ బడ్జెట్ సాధించడానికి రోజూ 15.72 లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కూలీల జాబ్‌కార్డులకు ఆధార్ నం బరును నెలాఖరులోగా అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. -
45.18 లక్షల కూలీలకు పనులు కల్పించాం
పీఆర్, ఆర్డీ డెరైక్టర్ అనితా రామచంద్రన్ సాక్షి కథనం ‘పనిసరే పైసలేవి?’పైవివరణ సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో 25.43 లక్షల కుటుంబాల్లో 45.18 లక్షల కూలీలకు పనులను కల్పించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. గ్రామస్థాయిలో పని అడిగిన ప్రతి కుటుంబానికి పని కల్పన, అలాగే సకాలంలో చెల్లింపులు చేసేందుకు రాష్ర్ట స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నట్లు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 21న సాక్షి దినపత్రికలో ‘పని సరే పైసలేవి?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆమె వివరణ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కూలీల చెల్లింపు కోసం కేంద్రం నుంచి రూ.615 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.68 కోట్లు కలిపి మొత్తం రూ.683.87 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకున్న వేతన బకాయిలు రూ.318.70 కోట్లు కూలీలకు చెల్లించామన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉపాధి కూలీలకు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌లో 30 శాతం, జూన్‌లో 20 శాతంగా నిర్ణయించిన పనికన్నా తక్కువ పని కేటాయించి, వారు చేసిన పనిమీద వేసవి అలవెన్స్ కలిపి కూలీ చెల్లిస్తామన్నారు. -
పంచాయతీలకు విద్యుత్ షాక్
బకాయిలను ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలన్న సర్కారు పాత బకాయిలు రూ.942 కోట్ల వరకు ఉన్నాయని డిస్కంల వెల్లడి బిల్లులన్నీ అశాస్త్రీయమైనవే అంటున్న సర్పంచులు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలపై విద్యుత్ పిడుగు పడనుంది. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులన్నీ విద్యుత్ బకాయిలకే వెళ్లిపోతున్నాయి. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధుల్లో 80 శాతాన్ని విద్యుత్ బకాయిల చెల్లింపునకే వినియోగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ అటకెక్కనున్నాయి. మరోవైపు సర్కారు నిర్ణయంతో గ్రామ పంచాయతీల సర్పంచులు లబోదిబోమంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను ఇప్పటికిప్పుడు పంచాయతీలే భరించాలనడం ఎంతవరకు సమంజసమని వారు పేర్కొంటున్నారు. - సాక్షి, హైదరాబాద్ సర్కారే చెల్లించాలి.. పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇటీవల రూ.279 కోట్లు రాగా.. ఏప్రిల్, మే నెలల్లో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరో రూ.580 కోట్లు అందనున్నాయి. మరోవైపు గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.942 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని డిస్కంలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించాలని సర్కారు తాజాగా సర్క్యులర్ జారీచేసింది. దీనిపై సర్పంచులు మండిపడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులన్నింటినీ ప్రభుత్వమే చెల్లించేదని.. ఇకపై కూడా అదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలకే వెచ్చిస్తే.. పంచాయతీల నిర్వహ ణ ప్రశ్నార్థకమవుతుందని వాపోతున్నారు. బిల్లులు తప్పులతడకలు! గ్రామ పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను కాజేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు చూస్తున్నాయని.. వారు చూపుతున్న బిల్లులన్నీ అశాస్త్రీయమైనవని సర్పంచులు ఆరోపిస్తున్నారు. కొందరు సర్పంచులు తమ గ్రామాలకు విద్యుత్ అధికారులు ఇచ్చిన బిల్లులను ఇటీవల సచివాలయానికి తీసుకొచ్చి ఉన్నతాధికారులకు చూపారు కూడా. రూ.లక్షల్లో ఉన్న ఆ బిల్లులను చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలంలోని మింటపల్లి గ్రామానికి రూ.7.5లక్షలు, అంకూర్ గ్రామానికి రూ.17లక్షలు, చిట్యాల గ్రామానికి రూ.28 లక్షలు కరెంటు బిల్లు రావడం విశేషం. అసలు ఆయా గ్రామాల్లో జనాభా వెయ్యి నుంచి రెండువేల లోపే. అందులోనూ కేవలం మంచినీటి సరఫరాకు, రాత్రివేళ వీధిలైట్లకే విద్యుత్ వాడతారు. అయినా ఇంతగా బిల్లులు రావడమేమిటని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో జరిగే విద్యుత్ చౌర్యం, సరఫరా నష్టాన్ని కూడా పంచాయతీల ఖాతాలోనే వేస్తామనడం ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం, అవసరమైన చోట మీటర్లు అమర్చడం విద్యుత్ శాఖ బాధ్యత అని పేర్కొంటున్నారు. 80 శాతం ఇవ్వాలన్నాం గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చాం. పాత బకాయిలే అయినప్పటికీ వాటిని చెల్లించక తప్పదు. ఆర్థిక సంఘం నుంచి అందిన నిధుల్లో 80 శాతం బకాయిల చెల్లింపుకోసం వినియోగించాలని చెప్పాం. ఇక గ్రామ పంచాయతీలన్నింటికీ విద్యుత్ మీటర్లు తప్పనిసరిగా అమర్చాలని కూడా విద్యుత్ శాఖకు సూచించాం. ఇంటిపన్ను వసూళ్లు పెరిగినందున నిర్వహణ వ్యయానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. - అనితా రామచంద్రన్,పంచాయతీరాజ్ కమిషనర్ మీటర్లు బిగించాలి గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు అని చెబుతూ డిస్కంలు అశాస్త్రీయమైన బిల్లులు చూపి సర్కారును తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 8,635 పంచాయతీల్లో కేవలం ఐదు శాతం వాటికే విద్యుత్ మీటర్లున్నాయి. డిస్కంలు చూపుతున్న పెండింగ్ బకాయిలను సర్కారే చెల్లించాలి. పంచాయతీలకు మీటర్లు బిగించాక వచ్చే బిల్లులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. - పురుషోత్తమ్, మింటపల్లి గ్రామసర్పంచ్, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఆందోళన చేపడతాం పాత బకాయిల పేరిట లక్ష ల రూపాయల భారాన్ని పంచాయతీలపై మోపడం సరికాదు. గతంలో మాదిరిగానే పంచాయతీల కరెంటు బిల్లులను సర్కారే భరించాలి. రూ.లక్షల్లో వచ్చిన బిల్లులపై విచారణ చేయించి, వాస్తవాలేమిటో నిగ్గు తేల్చాలి. ఈ విషయమై సర్కారుకు నివేదిస్తాం. సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన చేపడతాం. - సత్యనారాయణరెడ్డి, తెలంగాణపంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు