పంచాయతీలకు విద్యుత్ షాక్
- బకాయిలను ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించాలన్న సర్కారు
- పాత బకాయిలు రూ.942 కోట్ల వరకు ఉన్నాయని డిస్కంల వెల్లడి
- బిల్లులన్నీ అశాస్త్రీయమైనవే అంటున్న సర్పంచులు
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలపై విద్యుత్ పిడుగు పడనుంది. పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులన్నీ విద్యుత్ బకాయిలకే వెళ్లిపోతున్నాయి. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధుల్లో 80 శాతాన్ని విద్యుత్ బకాయిల చెల్లింపునకే వినియోగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులన్నీ అటకెక్కనున్నాయి. మరోవైపు సర్కారు నిర్ణయంతో గ్రామ పంచాయతీల సర్పంచులు లబోదిబోమంటున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను ఇప్పటికిప్పుడు పంచాయతీలే భరించాలనడం ఎంతవరకు సమంజసమని వారు పేర్కొంటున్నారు.
- సాక్షి, హైదరాబాద్
సర్కారే చెల్లించాలి..
పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇటీవల రూ.279 కోట్లు రాగా.. ఏప్రిల్, మే నెలల్లో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మరో రూ.580 కోట్లు అందనున్నాయి. మరోవైపు గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.942 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని డిస్కంలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించాలని సర్కారు తాజాగా సర్క్యులర్ జారీచేసింది. దీనిపై సర్పంచులు మండిపడుతున్నారు. గతంలో గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులన్నింటినీ ప్రభుత్వమే చెల్లించేదని.. ఇకపై కూడా అదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులన్నీ బకాయిలకే వెచ్చిస్తే.. పంచాయతీల నిర్వహ ణ ప్రశ్నార్థకమవుతుందని వాపోతున్నారు.
బిల్లులు తప్పులతడకలు!
గ్రామ పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను కాజేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు చూస్తున్నాయని.. వారు చూపుతున్న బిల్లులన్నీ అశాస్త్రీయమైనవని సర్పంచులు ఆరోపిస్తున్నారు. కొందరు సర్పంచులు తమ గ్రామాలకు విద్యుత్ అధికారులు ఇచ్చిన బిల్లులను ఇటీవల సచివాలయానికి తీసుకొచ్చి ఉన్నతాధికారులకు చూపారు కూడా. రూ.లక్షల్లో ఉన్న ఆ బిల్లులను చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలంలోని మింటపల్లి గ్రామానికి రూ.7.5లక్షలు, అంకూర్ గ్రామానికి రూ.17లక్షలు, చిట్యాల గ్రామానికి రూ.28 లక్షలు కరెంటు బిల్లు రావడం విశేషం. అసలు ఆయా గ్రామాల్లో జనాభా వెయ్యి నుంచి రెండువేల లోపే. అందులోనూ కేవలం మంచినీటి సరఫరాకు, రాత్రివేళ వీధిలైట్లకే విద్యుత్ వాడతారు. అయినా ఇంతగా బిల్లులు రావడమేమిటని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో జరిగే విద్యుత్ చౌర్యం, సరఫరా నష్టాన్ని కూడా పంచాయతీల ఖాతాలోనే వేస్తామనడం ఎంతవరకు సబబు అని నిలదీస్తున్నారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం, అవసరమైన చోట మీటర్లు అమర్చడం విద్యుత్ శాఖ బాధ్యత అని పేర్కొంటున్నారు.
80 శాతం ఇవ్వాలన్నాం
గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చాం. పాత బకాయిలే అయినప్పటికీ వాటిని చెల్లించక తప్పదు. ఆర్థిక సంఘం నుంచి అందిన నిధుల్లో 80 శాతం బకాయిల చెల్లింపుకోసం వినియోగించాలని చెప్పాం. ఇక గ్రామ పంచాయతీలన్నింటికీ విద్యుత్ మీటర్లు తప్పనిసరిగా అమర్చాలని కూడా విద్యుత్ శాఖకు సూచించాం. ఇంటిపన్ను వసూళ్లు పెరిగినందున నిర్వహణ వ్యయానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
- అనితా రామచంద్రన్,పంచాయతీరాజ్ కమిషనర్
మీటర్లు బిగించాలి
గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు అని చెబుతూ డిస్కంలు అశాస్త్రీయమైన బిల్లులు చూపి సర్కారును తప్పుదోవ పట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని 8,635 పంచాయతీల్లో కేవలం ఐదు శాతం వాటికే విద్యుత్ మీటర్లున్నాయి. డిస్కంలు చూపుతున్న పెండింగ్ బకాయిలను సర్కారే చెల్లించాలి. పంచాయతీలకు మీటర్లు బిగించాక వచ్చే బిల్లులను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం.
- పురుషోత్తమ్, మింటపల్లి గ్రామసర్పంచ్, మహబూబ్‌నగర్ జిల్లా సర్పంచుల
సంఘం అధ్యక్షుడు
ఆందోళన చేపడతాం
పాత బకాయిల పేరిట లక్ష ల రూపాయల భారాన్ని పంచాయతీలపై మోపడం సరికాదు. గతంలో మాదిరిగానే పంచాయతీల కరెంటు బిల్లులను సర్కారే భరించాలి. రూ.లక్షల్లో వచ్చిన బిల్లులపై విచారణ చేయించి, వాస్తవాలేమిటో నిగ్గు తేల్చాలి. ఈ విషయమై సర్కారుకు నివేదిస్తాం. సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన చేపడతాం.
- సత్యనారాయణరెడ్డి, తెలంగాణపంచాయతీరాజ్ చాంబర్
రాష్ట్ర అధ్యక్షుడు