45.18 లక్షల కూలీలకు పనులు కల్పించాం
పీఆర్, ఆర్‌డీ డెరైక్టర్ అనితా రామచంద్రన్
సాక్షి కథనం ‘పనిసరే పైసలేవి?’పైవివరణ
సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో 25.43 లక్షల కుటుంబాల్లో 45.18 లక్షల కూలీలకు పనులను కల్పించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. గ్రామస్థాయిలో పని అడిగిన ప్రతి కుటుంబానికి పని కల్పన, అలాగే సకాలంలో చెల్లింపులు చేసేందుకు రాష్ర్ట స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నట్లు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 21న సాక్షి దినపత్రికలో ‘పని సరే పైసలేవి?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆమె వివరణ ఇచ్చారు.
ఉపాధి హామీ పథకం కూలీల చెల్లింపు కోసం కేంద్రం నుంచి రూ.615 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.68 కోట్లు కలిపి మొత్తం రూ.683.87 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకున్న వేతన బకాయిలు రూ.318.70 కోట్లు కూలీలకు చెల్లించామన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉపాధి కూలీలకు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌లో 30 శాతం, జూన్‌లో 20 శాతంగా నిర్ణయించిన పనికన్నా తక్కువ పని కేటాయించి, వారు చేసిన పనిమీద వేసవి అలవెన్స్ కలిపి కూలీ చెల్లిస్తామన్నారు.