
పోస్టాఫీస్ పొదుపు పథకాలకు వడ్డీ రేట్లలో.. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్పును ప్రకటించలేదు. కొత్తగా ప్రకటించిన రేట్లు 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికాలకు వర్తిస్తాయి. ఆర్థిక వ్యవహారాల శాఖ జారీ చేసిన సర్క్యులర్ ద్వారా దీనిని ధ్రువీకరించింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి ఖాతా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) మొదలైనవాటికి వర్తిస్తుంది. ఈ పథకాలకు 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నిర్ణయించిన వడ్డీ రేట్లే వర్తిస్తాయి.
ఏప్రిల్ 1, 2025 & జూన్ 30, 2025 మధ్య పోస్టాఫీస్ స్కీమ్ వడ్డీ రేట్లు
➜పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా: 4 శాతం
➜పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్: 6.7 శాతం
➜పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం: 7.4 శాతం
➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (1 సంవత్సరం): 6.9 శాతం
➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (2 సంవత్సరాలు): 7 శాతం
➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (3 సంవత్సరాలు): 7.1 శాతం
➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (5 సంవత్సరాలు): 7.5 శాతం
➜కిసాన్ వికాస్ పత్ర (KVP): 7.5 శాతం
➜పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): 7.1 శాతం
➜సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం
➜నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7 శాతం
➜సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS): 8.2 శాతం
చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం త్రైమాసికానికి ఒకసారి నిర్ణయిస్తుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కేంద్రం చివరగా వడ్డీ రేట్లను నిర్ణయించింది. ఆ తరువాత ఇప్పటి వరకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకుంది.
వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలనే నిర్ణయానికి ప్రధాన కారణం.. మార్కెట్ పరిస్థితులనే చెప్పాలి. మార్కెట్లు నష్టాల్లో సాగుతున్న సమయంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం వల్ల ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈ చిన్న పొదుపు పథకాలు సాధారణ ప్రజలకు స్థిరమైన పెట్టుబడి అవకాశాలను అందించడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.