తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, అందులో భాగంగా పలు అంశాల్లో జాతీయ స్థాయి అవార్డులు దక్కాయని గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు సాధిం చిన ఉపాధిహామీ, ఈజీఎంఎం, సెర్ప్ అధికారులను అభినందించారు.
శనివారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో రూ.1,080 కోట్ల విలువైన ఉపాధి పనులు చేపట్టిందని చెప్పారు. సెర్ప్ ద్వారా మహిళా సాధికారత, ఉపాధి అవకాశాల కల్పనలోనూ జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. అవార్డు పొందిన నిజామాబాద్ జిల్లా మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ పదవిని బాధ్యతగా చేపట్టి గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేశానన్నారు. కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమిబసు పాల్గొన్నారు.