క్షమించండి.. లోపాలు జరిగాయి
ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుపై ఈసీ
బాంబే హైకోర్టులో పిల్ వేసేందుక ముంబై ఓటర్లు సిద్ధం
జాబితాలో పేర్లు తొలగింపుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో తలెత్తుతున్న లోపాలు, ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో జరుగుతున్న అసౌకర్యం, ఓటరు జాబితాల్లో భారీ సంఖ్యలో పేర్లు గల్లంతు కావడంపై ఈసీ తీవ్రంగా స్పందించింది. తమ వైపు నుంచి తప్పులు జరిగాయని ఒప్పుకున్న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్.ఎస్. బ్రహ్మ జాబితాలో పేర్లు గల్లంతై ఓటు వేయలేక పోయినవారిని క్షమాపణలు కోరారు. ‘జాబితాలో పేర్లు గల్లంతై.. ఓటు వేయలేక పోయిన అత్యధిక మంది ఓటర్లకు క్షమాపణలు చెబుతున్నా’ అని బ్రహ్మ అన్నారు.
ముంబైలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంపై ఆగ్రహం వెలిబుచ్చిన కార్పొరేట్ దిగ్గజాలు సహా వేలాది మంది ఓటర్లు ఈసీకి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే సీఎన్‌ఎన్-ఐబీఎన్ వార్తా సంస్థతో బ్రహ్మ మాట్లాడారు. ఇంతమంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి ఏవిధంగా గల్లంతయ్యాయో తనకు అర్ధం కావడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ తప్పు జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువరించిన తర్వాత ఈ లోపాలపై దృష్టి సారిస్తామని, తప్పులు సరిదిద్దు కుంటామని చెప్పారు. ఇదిలావుంటే, జాబితాల్లో పేర్లు సరిచూసుకోవాలని పేర్కొంటూ తాము అనేక మార్లు ప్రకటనలు ఇచ్చినా ఎవరూ స్పందించలేదని మహారాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
‘మహా’ సీఎం రుసరుస...: ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతై.. ఓట్లు కోల్పోయిన కార్పొరేట్ దిగ్గజాల పట్ల మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవాన్ రుసరుసలాడారు. ‘ఓటరు జాబితాలో తమ పేర్లు లేవంటూ కార్పొరేట్ దిగ్గజాలు ఎందుకు ఫిర్యాదు చేశారో నాకర్ధం కావడం లేదు. ఎన్నికల ముందే పరిశీలించుకుని ఉండాల్సింది. అంతర్జాతీయ విమానాలు ఎక్కే ముందు ప్రయాణికుల జాబితాలో పేర్లు పరిశీలించుకోవడం లేదా?’ అంటూ చురకలంటించారు. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ దీపక్ పరేఖ్ సహా అనేక మంది కార్పొరేట్ దిగ్గజాల పేర్లు ముంబై ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. దీనిపై బాంబే హైకోర్టులో సోమవారం పిల్ దాఖలుకు పేర్లు గల్లంతైనవారు సిద్ధమయ్యారు.