షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
19న నోటిఫికేషన్.. అదే రోజున నామినేషన్ల స్వీకరణ
ఫిబ్రవరి 13న పోలింగ్.. 16న ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటన
జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్
తిరుపతి: తిరుపతి శాసనసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తెరతీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్ సంపత్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 19న జారీచేయనున్నారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 27 తుదిగడువు. ఈనెల 30 మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఫిబ్రవరి 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంల్లో పోలైన ఓట్లను ఫిబ్రవరి 16న లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ఎం.వెంకటరమణ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. తిరుపతి శాసనసభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసివిజయం సాధించారు.
అనారోగ్యం బారిన పడిన వెంకటరమణ డిసెంబర్ 15న చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంకటరమణ మృతితో ఖాళీ అయిన తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అంటే ఫిబ్రవరి 19 వరకూ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించుతారన్నది చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ భార్య ఎం.సుగుణను బరిలోకి దించుతారా..? వారి కుటుంబ సభ్యుల్లో మరొకరిని పోటీకి దించుతారా..? ఇతరులను బరిలోకి దించుతారా...? అన్నది తేలాల్సి ఉంది. అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయంపైనే ఉప ఎన్నిక ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికకు మోగిన నగారా
Published Tue, Jan 13 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM
Advertisement