మీ ఆదరణ మరువలేను.. | Your reception was not forgotten .. | Sakshi
Sakshi News home page

మీ ఆదరణ మరువలేను..

Published Wed, Jan 6 2016 1:38 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

మీ ఆదరణ మరువలేను.. - Sakshi

మీ ఆదరణ మరువలేను..

వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు
అన్ని సందర్భాల్లోనూ అండగా నిలిచారు
చెల్పూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్

 
వరంగల్ : జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని సందర్భాల్లో వరంగల్ జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తున్నారని అన్నారు. గణపురం మండలం  చెల్పూరులో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ) రెండో దశ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జాతికి అంకితం చేశారు. అనంతరం కేటీపీపీ ఆవరణలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘వరంగల్ జిల్లా ప్రజలు ఆనాడు ఉద్యమంలో, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అండగా నిలిచారు. మీరు ఇచ్చిన ప్రేమను ఈ జన్మలో ఏమిచ్చినా నేను తీర్చుకోలేను. అంతగొప్ప అభిమానాన్ని చూపిస్తున్నారు. ఉప ఎన్నికలో ఎందరో ఎన్నో అవాకులు చవాకులు పేలిన్రు. ఎన్నో మాట్లాడిన్రు. కరెక్టు  పంథాలో గవర్నమెంటు పోతాంది, ఇంకా గట్టిగా పనిచేయండని చెప్పి, మొన్న మీరు వరంగల్‌లో ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. వరంగల్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

వరంగల్ జిల్లా ప్రత్యేక అభివృద్ధికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాకు మంచి రోజులు రానున్నాయి. ఎల్‌ఎండీ నుంచి ఉన్న కాకతీయ కాల్వ సామర్థ్యం 8వేల క్యూసెక్కులు. సమైక్య రాష్ట్రంలో పట్టించుకోకపోవడం వల్ల అన్ని నీళ్లు రావడం లేదు. వచ్చే ఏడాది నుంచి 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతోని నీరు రావడానికి కాల్వల మరమ్మతు కోసం రూ.138 కోట్లు మంజూరు చేసినం. ఆ పనులన్నీ ఈ వేసవిలోనే పూర్తవుతాయి. కాకతీయ కాల్వ కింద ఉన్న నీటి పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని త్వరితగతిన రిపేర్ చేసి రైతులకు నీరిచ్చేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టరును, అధికారులను కోరుతున్నా. ఎంత డబ్బు అయినా సరే ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఈ డీబీఎం, ఆ డీబీఎం, ఈ ఊరు ఆ ఊరు అని కాదు కాకతీయ కాలువ కింద మొత్తం నీటి పంపిణీ వ్యవస్థ బాగుపడాలి. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఈ రోజు, రేపు మధ్యామ్నం మూడు నాలుగు గంటల దాక ఉంట. చాలా నిర్ణయాలు రేపు నేను ప్రకటిస్తా. వరంగల్ నుంచి మొత్తం జిల్లాకు సంబంధించిన నిర్ణయాలన్నీ ప్రకటిస్తా. ప్రత్యేకంగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణలోనే  రెండో పెద్ద పట్టణం మన వరంగల్ పట్టణం. ఇప్పుడు వచ్చేటప్పుడు హెలికాప్టర్‌లో చూస్తుంటే బాధపడే పరిస్థితి ఉంది. ఆ పట్టణాన్ని ఏం చేయాలే, జిల్లా అభివృద్ధికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలేంది. సాగునీరేంది, కరెంటేందీ, మంచేంది, చెడ్డేంది చూసుకుందాం. ఆ ప్రకారంగా ముందుకు పోదామని  తెలియజేస్తున్నాను’ అని అన్నారు.

భూపాలపల్లికి వరాలు...
‘దేవాదుల ప్రాజెక్టు మూడోదశ వరకు పూర్తయితే భూపాలపల్లి, ములుగు, నర్సంపేట నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. ఒక్క రూపాయూ ఖర్చు చేయకుండా, ఏ లిఫ్టు చేయకుండా కాలువ తవ్వుకుంటే రామప్ప, గణపురం, లక్నవరం చెరువులు నిండే పరిస్థితి ఉంది. ఈ చెరువుల కింద రెండు పంటలు పండించి చూపిస్తా అని నేను మీకు హామీ ఇస్తున్నా. మధుసూదనాచారి నాయకత్వంలో ఆ కాల్వలు సత్వరమే ఈ నెలలోపే శాంక్షన్ చేయించి.. ఈ సీజన్‌లోనే తవ్వించి.. వచ్చే సీజన్ నుంచే మీరు బ్రహ్మాండంగా రెండు పంటలు పండించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తదని చెప్పి హామీ ఇస్తున్నా. భీంఘన్‌పూర్ నుంచి చిన్నలిఫ్టు పెడితే కమలాపూర్, రాంపూర్, దీక్షకుంట, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, పందిపంపుల, నందిగామ, పంబాపూర్ గ్రామాలన్నింటీకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. రేపు హైదరాబాద్ పోయిన తర్వాత ఎస్టిమేట్ తెప్పించి. ఈ జనవరి నెలలోనే దాన్ని శాంక్షన్ చేయిస్తం. కచ్చితంగా ఫిబ్రవరిలో పనులు మొదలుపెడ్తం. ఆ ప్రాంతాలకు నీళ్లు వస్తయి. చల్వాయి ప్రాజెక్టు పర్మినెంట్‌గా ఉంటది. త్వరలోనే భీంఘన్‌పూర్ లిఫ్టుకు నేనే పునాది రాయి వేస్తానని తెలియజేస్తున్న. భూపాలపల్లి ప్రాంతంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం. గాంధీనగర్ ప్రాంతంలో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేస్తం. పోస్టు గ్రాడ్యుయేషన్ సెంటర్‌కు భవనాలను మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నా. మైనింగ్ ట్రేడ్స్‌తోని పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేస్తున్నం. వచ్చే మార్చి తర్వాత ప్రారంభించుకునేలా భూపాలపల్లి నియోజకవర్గానికి అదనంగా అదనంగా రెండు వేల డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తున్నాం’ అని అన్నారు.

విద్యుత్ వారికి ధన్యవాదాలు...
‘అనుకున్న దానికంటే ముందే భూపాలపల్లి 600 మెగావాట్ల పవర్ ప్లాంటును పూర్తి చేసి ప్రారంభోత్సవం జరిపించిన విద్యుత్ శాఖ వారికి పేరుపేరునా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్న. విద్యుత్ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు, విద్యుత్ ఇంజనీర్లకు అభినందనలు తెలుపుతున్నా’ అన్నారు.  
 
పోచారం ప్రస్తావన..

 పోచారం శ్రీనివాసరెడ్డిని తీరు నాకు చాలా సంతోశమేసింది. వారిది వాస్తవానికి నిజామాబాద్ జిల్లా. ప్రజల పట్ల అవగాహన ఉన్న నాయకులు ఉంటే ఎలా ఉంటరంటే వీరిని చూస్తే తెలుస్తంది. భూపాలపల్లితో వారికి అటాచ్‌మెంట్ లేదు. మొన్న ఎన్నికలప్పుడు వచ్చి తిరిగిగారు. ఈ ప్రాంతం బాగా వెనుకబడి ఉంది అభివృద్ధి చేయాలి అన్నరు’ అని సీఎం కేసీఆర్ సభలో చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement