Kakatiya thermal power plant
-
కేటీపీపీలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
గణపురం: జయశంకర్ జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్తు ప్లాంట్(కేటీపీపీ)లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. 600 మెగావాట్ల రెండో దశ విద్యుత్తు కేంద్రంలో బాయిలర్ లీకేజీ వల్ల ఉత్పత్తి నిలిచిపోయినట్లు చీఫ్ ఇంజినీర్ మహేష్‌కుమార్ తెలిపారు. రెండు రోజుల్లో మరమ్మతులు చేసి ప్లాంట్‌ను పునఃప్రారంభిస్తామన్నారు. రోజుకు రూ.32లక్షల విలువైన విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. -
సారొస్తారా..!
సీఎం పర్యటన ఆనవాయితీ కొనసాగేనా.. 2015, 2016 జనవరిలో వచ్చిన కేసీఆర్ మూడునాలుగు రోజులపాటు జిల్లాలోనే.. ఈ ఏడాది పర్యటనపై అందరిలో ఆసక్తి వరంగల్ : తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచిన వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అధికారికంగా ఎక్కువ రోజులు వరంగల్ జిల్లాలోనే ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్‌లో పర్యటించారు. టీఆర్ఎస్ అధినేతగా తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎక్కువసార్లు వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే కూడా అదే పరంపరను కొనసాగించారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక ప్రతి ఏడాది జనవరిలో వరంగల్ జిల్లాలో మూడునాలుగు రోజులు బస చేశారు. 2015, 2016 జనవరి నెలల్లో ఇదే ఒరవడిని కొనసాగించారు. వరుసగా రెండేళ్లు వరంగల్ జిల్లా పర్యటనకు ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్... 2017లోనూ ఇదే ఆనవాయితీని కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై జిల్లా ప్రజల్లో, టీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది. మొదటిసారే నాలుగు రోజులు బస 2015 జనవరిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్ వరంగల్ నగరంలో వరుసగా నాలుగు రోజులు పర్యటించి రికార్డు సృష్టించారు. జనవరి 8న సాయంత్రం ఆకస్మికంగా వరంగల్‌కు వచ్చిన సీఎం... వరుసగా నాలుగు రోజులు జిల్లాలోనే ఉన్నారు. వస్తూ వస్తూనే వరంగల్ తూర్పు నియోకవర్గంలోని లక్ష్మీపురం, గిరిప్రసాద్‌నగర్, శాకరాసికుంట బస్తీల్లో పర్యటించారు. పేదల సమస్యలను, ప్రభుత్వ పథకాల అమలుతీరును వారితోనే అడిగి తెలుసుకున్నారు. జనవరి 9న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీన్‌దయాళ్‌నగర్, ప్రగతినగర్, నాగేంద్రనగర్, జితేందర్‌నగర్ బస్తీలకు వెళ్లి అక్కడి పేదలతో నేరుగా మాట్లాడారు. బస్తీ వాసుల సమస్యలను, అవసరాలను తెలుసుకున్నారు. అదే రోజు హన్మకొండలో జరిగిన అర్చక సమాఖ్య బహిరంగసభలో పాల్గొన్నారు. అనంతరం గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) గెస్ట్‌హౌస్‌లో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి 10న వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎస్ఆర్ నగర్,పరకాల నియోజకవర్గంలోని గరీబ్‌నగర్ బస్తీలను సందర్శించారు. జనవరి 11న వరంగల్ నగరపాలక సంస్థలోని ఆరు బస్తీల్లో కొత్తగా నిర్మించనున్న మోడల్ కాలనీలకు శంకుస్థాపన చేశారు. రెండోసారి మూడు రోజులు 2016 జనవరిలో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో వరుసగా మూడు రోజులు ఉన్నారు. జనవరి 4న వరంగల్ జిల్లా పర్యటకు వచ్చారు. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు, వ రంగల్–ఖమ్మం జిల్లాల మధ్య గోదావరిపై వంతెనను కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు. జనవరి 5న గణపురం మండలం చెల్పూరులో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన కేటీపీపీ రెండో దశ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. జనవరి 6న వరంగల్ జిల్లా, గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. -
మళ్లీ తెరపైకి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్
ప్రభుత్వం సానుకూలంగా ఉందని అధికారుల వెల్లడి గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో మూడో విడతగా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అధికారులు అంటున్నారు. వారి నోట 800 మెగావాట్ల ప్లాంట్ ప్రస్తావన రావడంతో ఈ ప్రాంత వాసుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మూడేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 800 మెగావాట్ల ప్లాంట్ మంజూరు చేసి, రూ.నాలుగు వేల కోట్లు కేటాయించారు. అయితే తెలంగాణ ఏర్పాటుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను రద్ధు చేసింది. నిధులు మంజూరై, స్థల సేకరణ చేసి, టెండర్లు పిలిచి ప్లాంట్ నిర్మించే సమయంలో రద్దు చేసి, మరో చోటుకు తరలించింది. అయితే గండ్రవెంకటరమణారెడ్డి పలుసార్లు టీజెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో పాటు డైరెక్టర్లను కలిసి 800 మెగావాట్ల ప్లాంట్‌ను కేటీపీపీలో నిర్మించాలని వినతిపత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు చేపట్టారు. దీంతో ఈ ప్లాంట్ మరోసారి తెరపైకి వచ్చింది. కేటీపీపీ సీఈ శివకుమార్ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ 800 మెగావాట్ల ప్లాంట్‌పై యాజమాన్యం సానుకూలంగా ఉందని ప్రకటించిన విషయం విదితమే. -
ఉత్పత్తి నాలుగు రోజులే
600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో తరచూ అంతరాయం 44 రోజుల పాటు సాంకేతిక సమస్యలే జెన్కోకు కోట్ల రూపాయల నష్టం.. గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం రెండవ దశ 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సాంకేతిక సమస్యలతోనే కాలం వెళ్లదీస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించి 48 రోజులు కాగా, అం దులో విద్యుత్ ఉత్పత్తి అరుుంది కేవలం నాలుగు రోజులే. మిగితా 44 రోజులు మరమ్మతులతోనే గడిచిపోయింది. నూతన ప్లాంట్‌లో లైటాఫ్ చేయడం, అనంతరం సింక్రనైజేషన్ చేయడం.. 200 నుంచి 300 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరగడం.. సాంకేతిక కారణాలతో మధ్యలోనే నిలిచిపోవడం.. ఇదేతంతు కొనసాగుతోంది. ఈ ప్లాంట్‌లో నవంబర్ నుంచే సింక్రనైజేషన్ ప్రారంభమైనప్పటికీ డిసెంబర్ చివరి వరకు సీఓడీ చేయలేదు. ఇందుకోసం కేటీపీపీ అధికారులు చేసిన యత్నాలు ఫలించలేదు. సీఓడీ కాకముందే జనవరి 5న సీఎం కేసీఆర్ ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. నాటి నుంచి కేటీపీపీ, జెన్కో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యుదుత్పత్తి సజావుగా సాగకపోవడంతో వారు తల పట్టుకుంటున్నారు. ఓసారి స్టీమ్ పైపుల్లో.. మరోసారి బారింగ్ గేర్.. ఇంకోసారి బూడిద సమస్య, పైపులు వంగిపోవడం.. ఇలా 600 మెగావాట్ల ప్లాంట్‌కు అనేక అవాం తరాలు ఎదురవుతున్నారుు. ప్లాంట్‌లో 72 గంటల పాటు ఎలాంటి అటంకం లేకుండా విద్యుత్ ఉత్పత్తి జరిగితేనే సీఓడీకి అవకాశం ఉంటుంది. ఇందుకోసం అధికారులు కృషి చేస్తూనే ఉన్నారు. ఆటంకం కలిగిన ప్రతిసారి నిరాశ పడకుండా నూతన ఉత్సాహంతో మళ్లీ లైటాఫ్ చేస్తున్నారు. జెన్కో డెరైక్టర్ కేటీపీపీలోనే ఉండి మరమ్మతు చేయిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. కేటీపీపీకి నష్టం కోట్లలోనే... 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల మూలంగా కేటీపీపీ భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాంట్ ని ర్మాణంలో తీవ్ర జాప్యం కావడంతో ప్రాజెక్టుకు అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేశారు. 36 నెలల్లో పూర్తికావాల్సిన ప్లాంట్‌కు మరో 86 నెలల సమయం తీసుకున్నారు. సమయం, డబ్బు అదనంగా ఖర్చు చేసినా సక్రమంగా నిర్మించలేదని ప్లాంట్‌లో తలెత్తుతున్న సమస్యలు స్పష్టం చేస్తున్నారుు. 600 మెగావా ట్ల ప్లాంట్‌లో 24 గంటలకు 14.4 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలి. ఒక్క యూనిట్‌కు నాలుగు రూపాయల చొప్పున జెన్కోకు కోట్ల రూపాయలు రావాలి. కానీ సమస్యల కారణంగా ఈ ఆదాయం నష్టపోవాల్సి వస్తోంది. -
మీ ఆదరణ మరువలేను..
వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు అన్ని సందర్భాల్లోనూ అండగా నిలిచారు చెల్పూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వరంగల్ : జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని సందర్భాల్లో వరంగల్ జిల్లా ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారని అన్నారు. గణపురం మండలం చెల్పూరులో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ) రెండో దశ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జాతికి అంకితం చేశారు. అనంతరం కేటీపీపీ ఆవరణలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘వరంగల్ జిల్లా ప్రజలు ఆనాడు ఉద్యమంలో, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అండగా నిలిచారు. మీరు ఇచ్చిన ప్రేమను ఈ జన్మలో ఏమిచ్చినా నేను తీర్చుకోలేను. అంతగొప్ప అభిమానాన్ని చూపిస్తున్నారు. ఉప ఎన్నికలో ఎందరో ఎన్నో అవాకులు చవాకులు పేలిన్రు. ఎన్నో మాట్లాడిన్రు. కరెక్టు పంథాలో గవర్నమెంటు పోతాంది, ఇంకా గట్టిగా పనిచేయండని చెప్పి, మొన్న మీరు వరంగల్‌లో ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. వరంగల్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వరంగల్ జిల్లా ప్రత్యేక అభివృద్ధికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాకు మంచి రోజులు రానున్నాయి. ఎల్ఎండీ నుంచి ఉన్న కాకతీయ కాల్వ సామర్థ్యం 8వేల క్యూసెక్కులు. సమైక్య రాష్ట్రంలో పట్టించుకోకపోవడం వల్ల అన్ని నీళ్లు రావడం లేదు. వచ్చే ఏడాది నుంచి 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతోని నీరు రావడానికి కాల్వల మరమ్మతు కోసం రూ.138 కోట్లు మంజూరు చేసినం. ఆ పనులన్నీ ఈ వేసవిలోనే పూర్తవుతాయి. కాకతీయ కాల్వ కింద ఉన్న నీటి పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని త్వరితగతిన రిపేర్ చేసి రైతులకు నీరిచ్చేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టరును, అధికారులను కోరుతున్నా. ఎంత డబ్బు అయినా సరే ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఈ డీబీఎం, ఆ డీబీఎం, ఈ ఊరు ఆ ఊరు అని కాదు కాకతీయ కాలువ కింద మొత్తం నీటి పంపిణీ వ్యవస్థ బాగుపడాలి. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఈ రోజు, రేపు మధ్యామ్నం మూడు నాలుగు గంటల దాక ఉంట. చాలా నిర్ణయాలు రేపు నేను ప్రకటిస్తా. వరంగల్ నుంచి మొత్తం జిల్లాకు సంబంధించిన నిర్ణయాలన్నీ ప్రకటిస్తా. ప్రత్యేకంగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణలోనే రెండో పెద్ద పట్టణం మన వరంగల్ పట్టణం. ఇప్పుడు వచ్చేటప్పుడు హెలికాప్టర్లో చూస్తుంటే బాధపడే పరిస్థితి ఉంది. ఆ పట్టణాన్ని ఏం చేయాలే, జిల్లా అభివృద్ధికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలేంది. సాగునీరేంది, కరెంటేందీ, మంచేంది, చెడ్డేంది చూసుకుందాం. ఆ ప్రకారంగా ముందుకు పోదామని తెలియజేస్తున్నాను’ అని అన్నారు. భూపాలపల్లికి వరాలు... ‘దేవాదుల ప్రాజెక్టు మూడోదశ వరకు పూర్తయితే భూపాలపల్లి, ములుగు, నర్సంపేట నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. ఒక్క రూపాయూ ఖర్చు చేయకుండా, ఏ లిఫ్టు చేయకుండా కాలువ తవ్వుకుంటే రామప్ప, గణపురం, లక్నవరం చెరువులు నిండే పరిస్థితి ఉంది. ఈ చెరువుల కింద రెండు పంటలు పండించి చూపిస్తా అని నేను మీకు హామీ ఇస్తున్నా. మధుసూదనాచారి నాయకత్వంలో ఆ కాల్వలు సత్వరమే ఈ నెలలోపే శాంక్షన్ చేయించి.. ఈ సీజన్లోనే తవ్వించి.. వచ్చే సీజన్ నుంచే మీరు బ్రహ్మాండంగా రెండు పంటలు పండించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తదని చెప్పి హామీ ఇస్తున్నా. భీంఘన్‌పూర్ నుంచి చిన్నలిఫ్టు పెడితే కమలాపూర్, రాంపూర్, దీక్షకుంట, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, పందిపంపుల, నందిగామ, పంబాపూర్ గ్రామాలన్నింటీకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. రేపు హైదరాబాద్ పోయిన తర్వాత ఎస్టిమేట్ తెప్పించి. ఈ జనవరి నెలలోనే దాన్ని శాంక్షన్ చేయిస్తం. కచ్చితంగా ఫిబ్రవరిలో పనులు మొదలుపెడ్తం. ఆ ప్రాంతాలకు నీళ్లు వస్తయి. చల్వాయి ప్రాజెక్టు పర్మినెంట్‌గా ఉంటది. త్వరలోనే భీంఘన్‌పూర్ లిఫ్టుకు నేనే పునాది రాయి వేస్తానని తెలియజేస్తున్న. భూపాలపల్లి ప్రాంతంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం. గాంధీనగర్ ప్రాంతంలో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేస్తం. పోస్టు గ్రాడ్యుయేషన్ సెంటర్‌కు భవనాలను మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నా. మైనింగ్ ట్రేడ్స్తోని పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేస్తున్నం. వచ్చే మార్చి తర్వాత ప్రారంభించుకునేలా భూపాలపల్లి నియోజకవర్గానికి అదనంగా అదనంగా రెండు వేల డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తున్నాం’ అని అన్నారు. విద్యుత్ వారికి ధన్యవాదాలు... ‘అనుకున్న దానికంటే ముందే భూపాలపల్లి 600 మెగావాట్ల పవర్ ప్లాంటును పూర్తి చేసి ప్రారంభోత్సవం జరిపించిన విద్యుత్ శాఖ వారికి పేరుపేరునా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్న. విద్యుత్ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు, విద్యుత్ ఇంజనీర్లకు అభినందనలు తెలుపుతున్నా’ అన్నారు. పోచారం ప్రస్తావన.. పోచారం శ్రీనివాసరెడ్డిని తీరు నాకు చాలా సంతోశమేసింది. వారిది వాస్తవానికి నిజామాబాద్ జిల్లా. ప్రజల పట్ల అవగాహన ఉన్న నాయకులు ఉంటే ఎలా ఉంటరంటే వీరిని చూస్తే తెలుస్తంది. భూపాలపల్లితో వారికి అటాచ్మెంట్ లేదు. మొన్న ఎన్నికలప్పుడు వచ్చి తిరిగిగారు. ఈ ప్రాంతం బాగా వెనుకబడి ఉంది అభివృద్ధి చేయాలి అన్నరు’ అని సీఎం కేసీఆర్ సభలో చెప్పారు. -
2018 నుంచి 24గంటలూ విద్యుత్
2018 నుంచి రాష్ట్ర మంతా 24గంటల నిరంతరాయ విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తెలిపారు. మంగళవారం గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ ను ఆయన జాతికిఅంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతుల కోసం ఖరీఫ్ పంటకు 9గంటల విద్యుత్ అందిస్తామన్నారు. ఏటా రూ25 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్ట్ ల అభివృద్ధికి ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మార్చి నుంచి కళ్యాణ లక్ష్మికి అర్హులని ప్రకటించారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు.. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ లైన్ మన్లే నని తెలిపారు. రాష్ట్రాన్ని 2019 సంవత్సరం నాటికి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసుకున్న సంకల్పానికి మరో ముందడుగు పడింది. గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటుచేసిన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్(600 మెగావాట్లు)లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. రూ.3,400 కోట్ల వ్యయంతో 900 ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. -
2018 నుంచి 24గంటలూ విద్యుత్
-
సూపర్ పవర్
తెలంగాణలో విస్తరించనున్న కేటీపీపీ వెలుగులు మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు 1,900 మెగావాట్లకు చేరుకోనున్న ప్లాంట్ సామర్థ్యం ఇదివరకే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన జెన్కో.. సమకూరిన నిధులు ప్రత్యేక దృష్టి సారించిన టీఆర్ఎస్ సర్కారు విద్యుత్ కొరత అధిగమించే దిశగా అడుగులు గణపురం, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ వెలుగులు విస్తరించనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో విద్యుత్ కొరతను అధిగమించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లను పూర్తి చేయడం... లోటును పూడ్చుకునేందుకు మరిన్ని విద్యుత్ ప్లాంట్లను నిర్మించే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఇదివరకే శ్రీకారం చుట్టగా... అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే... మొత్తం 1900 మెగావాట్లతో కేటీపీపీ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది. ఏడాదిలో 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వానికి విద్యుత్ సమస్య సవాల్‌గా మారనుంది. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ కొరత తీరాలంటే... ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న దాని కంటే మరో 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం. ఈ మేరకు పరిస్థితి చక్కబడాలంటే రెండు, మూడేళ్లపాటు లభ్యత ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయూల్సిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్లాంట్లపై టీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండో దశలో భాగంగా చేపట్టిన 600 మెగావాట్ల... సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 1200 మెగావాట్లు విద్యుత్ ప్లాంట్లపై నజర్ వేసింది. పనులను వేగవంతం చేసి... సంవత్సరం కాలంలో 18 వందల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా... గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో జెన్కో ఉన్నతస్థాయి అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన పనులను వేగిరం చేయడంతోపాటు కేటీపీపీలో మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయూలని ఆదేశించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జెన్కో, ప్రభుత్వం ఇదివరకే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు సర్వే కూడా చేయించిన విషయం తెలిసిందే. యాష్ ఫాండ్, కోల్ డంప్‌యార్డ్, రిజర్వాయర్ ఏర్పాటు కోసం దుబ్బపల్లి కొంపల్లి, మోరంచవాగు పరిసర ప్రాంతాలు అనువైనవిగా అధికారులు అప్పుడు గుర్తించారు. అవసరమైతే మరింత భూమిని ఇచ్చేందుకు ఆ ప్రాంత గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చెల్పూరు శివారు దుబ్బపల్లిని మరో చోటుకు తరలించే క్రమంలో గ్రామం పరిసరాల్లోనే సర్వే చేసిన 400 ఎకరాలు... మోరంచ, కొత్తపల్లి, కొంపెల్లి ప్రాంతాల్లో మరో 400 ఎకరాల భూములు అనుకూలంగా ఉన్నాయి. ఈ 800 ఎకరాలను భూములను జెన్కో సేకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన నిధులు సైతం సమకూరాయి. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.4 వేల కోట్ల రూపాయలను సేకరించింది. నిధులు సమకూరడంతో ప్లాంట్ నిర్మాణానికి మార్గం సుగమం కాగా... రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో ప్లాంట్ నిర్మాణంలో జాప్యం జరిగింది. అయితే నూతన రాష్ట్రంలో ప్రస్తుత అవసరాలకు సరిపోను విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం... రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశముండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే భూపాలపల్లి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు సిరికొండ మధుసూదనాచారి పదిరోజుల క్రితం స్వయంగా కేటీపీపీకి వచ్చి అధికారులతో మాట్లాడారు. ప్లాంట్ విస్తరణకు ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలను వాకబు చేశారు. 600 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పరిస్థితి... మంజూరైన 800 మెగావాట్ల మూడో దశ యూనిట్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులపై అధికారులతో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక రూపంలో అందజేశారు. ఈ 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం జరిగితే... 1900 మెగావాట్లతో సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రంగా కేటీపీపీ అవతరించనుంది. -
పోస్టుల అమ్మకం?!
కేటీపీపీలో సీఎల్ ఉద్యోగాలకు డిమాండ్ ఇప్పటికే దొడ్డిదారిన 150 పోస్టులు భర్తీ రూ.లక్షలు సమర్పించుకుంటున్న నిరుద్యోగులు కొత్త రాష్ట్రంలో పోస్టులు పర్మనెంట్ అవుతాయని ఆశ భూ నిర్వాసితులను పట్టించుకోని అధికారులు గణపురం, న్యూస్‌లైన్ : కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో పోస్టుల అమ్మకానికి మళ్లీ తెరలేచింది. వారం రోజులుగా కేటీపీపీలో సీఎల్(క్యాజువల్ లేబర్) పోస్టులను గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో ఈ పోస్టుల భర్తీలో వివాదం జరగడంతో వారుుదా వేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఇప్పుడు ఈ పోస్టులకు డిమాండ్ పెరిగింది. కొందరు రాజకీయ నాయకులు యువకుల వద్ద గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వారికి పోస్టులు ఇప్పించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాక ముందే నియూమకాలు చేపట్టాలని మాజీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. భూ నిర్వాసితులను, స్థానిక నిరుద్యోగులను పట్టించుకోని కేటీపీపీ, జెన్కో అధికారులు తమ అనుంగులకు, రాజకీయ నాయకులకు పోస్టులను ధారాదత్తం చేస్తున్నారు. గతంలో ఏం జరిగిందంటే.. కేటీపీపీలోని అధికారులు రెండు మూడు సంవత్సరాలుగా సీఎల్ పోస్టులను అమ్ముకుంటున్నారు. కరీంనగర్, గోదావరిఖని, పాల్వంచ, కొత్తగూడెం, రామగుండం ప్రాంతాల వారితో పాటు సీమాంధ్రకు చెందిన వారిని దాదాపు 150 మందిని భర్తీ చేసినట్టు స్థానికులు గుర్తించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు, భూ నిర్వాసితులు పలుమార్లు ధర్నా చేశారు. భూ నిర్వాసితులు రిలే దీక్షలు కూడా చేశారు. జెన్కో, కేటీపీపీ అధికారులను నిలదీశారు. వారి ధర్నాకు అన్ని రాజకీయ పక్షాలు సంఘీభావం తెలిపాయి. స్థానికేతరులను కొందరిని తొలగించి.. కోర్టు ఆదేశాలతో మళ్లీ పనుల్లోకి తీసుకున్నారు. ఈ తతంగం వెనుక అధికారుల సహాయ సహకారాలు ఉన్నాయనే ప్రచారం కుడా ఉంది. దాంతో స్థానికులను సీఎల్‌గా తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపైన ఒత్తిడి పెరిగింది. దీంతో జెన్కో అధికారులు జోక్యం చేసుకుని కాంగ్రెస్‌కు ఇరవై, టీడీపీకి, టీఆర్ఎస్కు పది చొప్పున సీఎల్ పోస్టులు కేటాయించారు. అయితే ఆ విధంగా మంజూరైన పోస్టులను కిందిస్థాయి రాజకీయ నేతలు.. భూ నిర్వాసితులకు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే అంటకట్టారని, లక్షల్లో డబ్బు వసూలు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ రెండో విడతగా.. ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులు, మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు జన్కో సీఎండీని వేర్వేరుగా కలిసి.. తమ కార్యకర్తలకు సీఎల్ పోస్టులు కావాలని ఒత్తిడి చేసి 40 పోస్టులకు అనుమతి తీసుకువచ్చారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టులు కంటే ప్రజాప్రతినిధులు ఆశిస్తున్న పోస్టుల సంఖ్య ఎక్కుగా ఉండటంతో దిక్కు దోచనిస్థితిలో అప్పటి సీఈ మహాబలేశ్వర్ జెన్కో ఉన్నతాధికారులకు తన గోడు వివరించారు. అదే సమయంలో స్థానిక భూ నిర్వాసితులు, నిరుద్యోగుల నుంచి వచ్చిన నిరసనల మూలంగా అప్పుడు నియూమకాలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఇప్పుడు పోస్టుల భర్తీకి మాజీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ అక్రమ తతంగాన్ని నిలిపివేయూలని, పోస్టుల భర్తీలో తమకు ప్రాధాన్యం కల్పించాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు. -
బూడిదతో నిండిన కేటీపీపీ
గణపురం,న్యూస్‌లైన్ : మండల పరిధిలోఉన్న చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో ఈఎస్పీలో ఏర్పడిన సాంకేతిక లోపం మూలంగా ప్లాంట్ మొత్తం బూడిదతో నిండిపోయింది. జూన్25 నుంచి జూలై 26 వరకు ప్లాంటును వార్షిక మరమ్మతుల కోసం మూసివేసిన విషయం విదితమే. జూలై 27వ తేదీ నుంచి తిరిగి విద్యుత్ ప్రారంభమైంది. కనీసం వారం రోజులైనా నడవక ముందే ప్లాంట్‌లో బూడిద సమస్య మళ్లీ తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది. బూడిద పైపులైన్ లీకేజీ కావడంతో ఆది వారం ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి 500మెగావాట్ల నుంచి 250 మెగావాట్లకు పడిపోవడవంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఈ సమస్య మరో రెండు మూడు రోజుల్లో పరిష్కారం కాకుంటే మళ్లీ షట్‌డౌన్ చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నెలలో బూడిద సమస్య మూలంగానే వార్షిక మరమ్మతుల పేరిట ప్లాంటును షట్‌డౌన్ చేశారు. బూడిదను సైలో నిర్మాణాలకు సరఫరా చేసే పైపులైన్‌ను మరమ్మతు చేయడంలో కేటీపీపీ అధికారులు పూర్తిగా విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. గతంలో బూడిద పైపులు పగలడం వల్ల దుబ్బపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బం దులు పడి ఆందోళనలు చేపట్టారు. తాజాగా ప్లాంటులోని ఈఎస్పీలో బూడిద లీకేజీ కావడంతో ప్లాంటులో పనులు చేస్తున్న కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.