2018 నుంచి 24గంటలూ విద్యుత్
2018 నుంచి రాష్ట్ర మంతా 24గంటల నిరంతరాయ విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ తెలిపారు. మంగళవారం గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటు చేసిన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ ను ఆయన జాతికిఅంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రైతుల కోసం ఖరీఫ్ పంటకు 9గంటల విద్యుత్ అందిస్తామన్నారు. ఏటా రూ25 వేల కోట్ల రూపాయలను ప్రాజెక్ట్ ల అభివృద్ధికి ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మార్చి నుంచి కళ్యాణ లక్ష్మికి అర్హులని ప్రకటించారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు.. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ లైన్ మన్లే నని తెలిపారు.
రాష్ట్రాన్ని 2019 సంవత్సరం నాటికి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసుకున్న సంకల్పానికి మరో ముందడుగు పడింది. గణపురం మండలం దుబ్బపల్లిలో ఏర్పాటుచేసిన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్(600 మెగావాట్లు)లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. రూ.3,400 కోట్ల వ్యయంతో 900 ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.