
పోస్టుల అమ్మకం?!
- కేటీపీపీలో సీఎల్ ఉద్యోగాలకు డిమాండ్
- ఇప్పటికే దొడ్డిదారిన 150 పోస్టులు భర్తీ
- రూ.లక్షలు సమర్పించుకుంటున్న నిరుద్యోగులు
- కొత్త రాష్ట్రంలో పోస్టులు పర్మనెంట్ అవుతాయని ఆశ
- భూ నిర్వాసితులను పట్టించుకోని అధికారులు
గణపురం, న్యూస్‌లైన్ : కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో పోస్టుల అమ్మకానికి మళ్లీ తెరలేచింది. వారం రోజులుగా కేటీపీపీలో సీఎల్(క్యాజువల్ లేబర్) పోస్టులను గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో ఈ పోస్టుల భర్తీలో వివాదం జరగడంతో వారుుదా వేశారు. తెలంగాణ రాష్ట్రంలో క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఇప్పుడు ఈ పోస్టులకు డిమాండ్ పెరిగింది.
కొందరు రాజకీయ నాయకులు యువకుల వద్ద గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వారికి పోస్టులు ఇప్పించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాక ముందే నియూమకాలు చేపట్టాలని మాజీ ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. భూ నిర్వాసితులను, స్థానిక నిరుద్యోగులను పట్టించుకోని కేటీపీపీ, జెన్‌కో అధికారులు తమ అనుంగులకు, రాజకీయ నాయకులకు పోస్టులను ధారాదత్తం చేస్తున్నారు.
గతంలో ఏం జరిగిందంటే..
కేటీపీపీలోని అధికారులు రెండు మూడు సంవత్సరాలుగా సీఎల్ పోస్టులను అమ్ముకుంటున్నారు. కరీంనగర్, గోదావరిఖని, పాల్వంచ, కొత్తగూడెం, రామగుండం ప్రాంతాల వారితో పాటు సీమాంధ్రకు చెందిన వారిని దాదాపు 150 మందిని భర్తీ చేసినట్టు స్థానికులు గుర్తించారు. దీనికి వ్యతిరేకంగా స్థానికులు, భూ నిర్వాసితులు పలుమార్లు ధర్నా చేశారు.
భూ నిర్వాసితులు రిలే దీక్షలు కూడా చేశారు. జెన్‌కో, కేటీపీపీ అధికారులను నిలదీశారు. వారి ధర్నాకు అన్ని రాజకీయ పక్షాలు సంఘీభావం తెలిపాయి. స్థానికేతరులను కొందరిని తొలగించి.. కోర్టు ఆదేశాలతో మళ్లీ పనుల్లోకి తీసుకున్నారు. ఈ తతంగం వెనుక అధికారుల సహాయ సహకారాలు ఉన్నాయనే ప్రచారం కుడా ఉంది. దాంతో స్థానికులను సీఎల్‌గా తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపైన ఒత్తిడి పెరిగింది. దీంతో జెన్‌కో అధికారులు జోక్యం చేసుకుని కాంగ్రెస్‌కు ఇరవై, టీడీపీకి, టీఆర్‌ఎస్‌కు పది చొప్పున సీఎల్ పోస్టులు కేటాయించారు.
అయితే ఆ విధంగా మంజూరైన పోస్టులను కిందిస్థాయి రాజకీయ నేతలు.. భూ నిర్వాసితులకు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే అంటకట్టారని, లక్షల్లో డబ్బు వసూలు చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ రెండో విడతగా.. ఇద్దరు మాజీ ఎంపీలు, ఇద్దరు మాజీ మంత్రులు, మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు జన్‌కో సీఎండీని వేర్వేరుగా కలిసి.. తమ కార్యకర్తలకు సీఎల్ పోస్టులు కావాలని ఒత్తిడి చేసి 40 పోస్టులకు అనుమతి తీసుకువచ్చారు.
అయితే ఖాళీగా ఉన్న పోస్టులు కంటే ప్రజాప్రతినిధులు ఆశిస్తున్న పోస్టుల సంఖ్య ఎక్కుగా ఉండటంతో దిక్కు దోచనిస్థితిలో అప్పటి సీఈ మహాబలేశ్వర్ జెన్‌కో ఉన్నతాధికారులకు తన గోడు వివరించారు. అదే సమయంలో స్థానిక భూ నిర్వాసితులు, నిరుద్యోగుల నుంచి వచ్చిన నిరసనల మూలంగా అప్పుడు నియూమకాలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఇప్పుడు పోస్టుల భర్తీకి మాజీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ అక్రమ తతంగాన్ని నిలిపివేయూలని, పోస్టుల భర్తీలో తమకు ప్రాధాన్యం కల్పించాలని భూ నిర్వాసితులు కోరుతున్నారు.